బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు "బొడ్డెమ్మ" ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండగ.. తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకొనే ముచ్చటైన పండగ. ఇందులో కులాల కట్టుబాట్లు, ధనికులమనే అహంకారాలు లేవు. కట్టుబాట్లన్నీమనుషులకే కాని నీటికి, పూలకూ లేవని చెబుతూ అందరూ సామరస్యంగా కలిసి మెలిసి జరుపుకునే పండగ. తెలంగాణ విశిష్టతను చాటిచెప్పే తీరొక్క పూల జాతర బతుకమ్మ. మట్టి మనుషుల మనసుల నిండా పూల వాసన గుప్పుమని గుభాళించే గొప్ప బతుకమ్మ పండుగంటే.. తెలంగాణ పడుచులకు ఎక్కడలేని సంబరం.. కొమ్మ కొమ్మ సిగలో పూసిన పూల కొన గోటితో తెంపుకొని.. ఒద్దికగా ఒడినింపుకొని.. భక్తితో ఇంటికి తెచ్చుకుంటారు..ఏ ఇల్లూ చూసినా బతుకమ్మల ముచ్చట్టే.. ఏ బజారు చూసినా బతుకమ్మల జాతరే.. ఈ తొమ్మిది రోజులూ ఊరంతా బతుకమ్మే... ఊరూరా బతుకమ్మే.
తెలంగాణ ప్రాంతంలో సంస్కృతీ సంప్రదాయాలకు అద్ధం పట్టే పడుగ బతుకమ్మ.. ఈ బతుకమ్మ పండగ ఎంగిలిపువ్వు బతుకమ్మతో ఆరంభమై, విజయదశమికి ఒక రోజు ముందు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజుల పండగలో తీరొక్క పువ్వులతోబతుకమ్మను ఒద్దికగా పేర్చుకుంటారు. కలాలకు, మతాలకు అతీతంగా ముచ్చట్లు పెట్టుకుంటూ ముచ్చటగా జరుపుకునే పండుగ బతుకమ్మ.. వర్షాలు తగ్గుముఖం పట్టి నేల పై పుట్టిన ప్రతికొమ్మా పూవుకు పురుడు పోసే పూలరుతువిది.. నేలమ్మ సిగలో ప్రకృతి మాత తురిమిన పూలచెండు వెన్నెలై వెలుగులు చిమ్ముతుంది.. ఆ పండు వెన్నెల్లో.. పూల వెలుగుల్లో పడుచు కన్నులు చెంపలను నిండుతాయి. ఏపుగా ఎదిగిన పంటల నడుమ. విరగపూసిన పువ్వులతో సాయంకాలం వరకూ బతుకమ్మలను పేర్చుకుంటారు. బొడ్డెమ్మలను చేసుకుంటారు. గౌరమ్మను పుదిస్తారు. ఫలహారాలు చేసుకుంటారు. అప్పటికే ఇండ్లు, వాకిళ్లు అలికి, పూసి, ముగ్గులు వేసి, శుచిగా తీర్చి దిద్దుకుంటారు. ఉన్న దాంట్లోనే శుభ్రమైన బట్టలు కట్టుకొని బతుకమ్మ ఆటకు బయలు దేరుతారు.
పూల మద్యలో కొలువుదీరిన ఈ గౌరమ్మే బతుకమ్మ అని, ఆమే శ్రీమహాలక్ష్మి అవతారమని తెలంగాణ ప్రజల నమ్మకం.. తంగెడు పువ్వంటే గౌరమ్మకు ఇష్టమనీ, గౌరి పూజకు తప్పక తంగెడు పువ్వును వాడడం వాళ్ల ఆనవాయితీగా వస్తోంది..కొద్దిగా పసుపు తీసుకొని దాన్ని నీళ్లతో తడిపి నాలుగు వేళ్లతో ముద్దగా చేసి నిలబెడతారు. దానికి పసుపు కుంకుమలు అద్ది పసుపు గౌరమ్మ మీద వేస్తారు. ఆ గౌరమ్మను రెండు తమల పాకుల మీద పెడతారు...ఈ గౌరమమ్మే బతుకమ్మ అనీ, బతుకమ్మే గౌరమ్మ అనీ అంతటా విశ్వసిస్తారు. బతుకమ్మను పూజిస్తే.. ఆడవాళ్లకు ఆరోగ్యమనీ, కోరిన కోరికలు ఫలిస్తాయనీ, ఆయుష్షు, సకల సంపదలు పెరిగి ముత్తైవులుగా ఉంటారని జానపదుల నమ్మకం.
బతుకమ్మను పేర్చడం అంటే అంత సులువు కాదు.. పట్టుకుంటే తునిగి పోయే తంగేడు పూలను ఒద్దికగా పేర్చుకుంటూ బతుకమ్మను చేయడం అంటే ఎంతో ఓపిక.. నైపుణ్యం కావాలి.. ఏ మాత్రం తేడా వచ్చినా.. కష్టం పడి పేర్చిన బతుకమ్మ క్షణంలో చెదిరిపోతుంది.. బతుకమ్మను పేర్చడం కూడా ఒక కళ. తంగెడు పువ్వు, బంతిపువ్వు, గునుగుపువ్వు, గుమ్మడి పువ్వు, తీగమల్లె, మంకన పువ్వు, ఛెత్రి పువ్వు, గులాబి, పోకబంతి, కనకాంబరాలు, గన్నేరుపూలు, గోరెంకపూలు, , ఇట్లా ఎన్నో రకాల పువ్వులు బతుకమ్మలో కొలువుదీరుతాయి.. బతుకమ్మ ఎత్తుగా పేర్చడానికి...గునుగు పువ్వులను మొదలు కత్తిరించి రకరకాల రంగులల్లో అద్ది చిన్నచిన్న కట్టలుగా కట్టి పేర్చుకుంటారు. తెచ్చిన పువ్వును బట్టి పళ్లెమో,..వెడల్పాటి ఈత పల్లెకను తీసుకొని అందులో వృత్తాకారంగా అంచునుండి గోడకట్టినట్లు పూవుల కట్టలు పేర్చుతూ...బతుకమ్మ నిలవడానికి కడుపులో గుమ్మడి, ఆముదం, కాకర, బీర ఆకులు ఏవి దొరికినా వాటిని విరిచి ముక్కలు చేసి నింపుకుంటా అంగుళం అంగుళం మేర పైకి లేపుతారు.వరుస వరుసకూ పువ్వులు మారుతాయి. పూవుల రంగు మారుతుంది. క్రింద బాగంలో వెడల్పుగా మొదలైన గుండ్రని బతుకమ్మ త్రికోణాకారంలో గోపురంలా పైకి లేస్తుంది. శిఖరానికి ఒక పోకబంతి పువ్వు లేక ధగధగ మెరిసే వంకాయ రంగు పువ్వునో అందంగా అలంకరిస్తారు..
ఈ బతుకమ్మ ఒక్క అడుగు నుండి నాలుగు అడుగుల ఎత్తు వరకూ పేర్చుకొని.. తాము పేర్చిన బతుకమ్మను చూసి మురిసిపోతారు..
బతుకమ్మను పేర్చి మొదట దర్వాజ ఎదురుగా గోడ దగ్గర పీటవేసి వుంచుతారు. అగరొత్తులు ముట్టిస్తారు. ఎదురుగా పళ్లెంలో గౌరమ్మనుంచుతారు. ఆ పసుపు గౌరమ్మే బతుకమ్మ, అన్ని పండుగలకు పెట్టే ప్రసాదాలు వేరు.. బతుకమ్మకు సమర్పించే ప్రసాదాలు వేరు.. తొమ్మిది రోజులు జరిపే బతుకమ్మ వేడుకల్లో... తొమ్మిది రోజులు.. తొమ్మిది రకాల ప్రసాదాలు బతుకమ్మకు సమర్పిస్తారు. బతుకమ్మకు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పలహారాలు సమర్పిస్తారు. మొదటి రోజు- ఎంగిలిపువ్వు బతుకమ్మ అమావాస్య నాడు చేస్తారు. ఆ రోజు ప్రసాదంగా నువ్వులు, నూకలు, బెల్లం వుంటుంది. రెండో రోజు- అటుకుల బతుకమ్మ: సప్పడి పప్పు, బెల్లం, అటుకులతో ప్రసాదం చేస్తారు. మూడో రోజు మద్దపప్పు బతుకమ్మ..- ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం చేస్తారు.. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ... పాలు, బెల్లం, నానేసిన బియ్యం ప్రసాదంగా సమర్పిస్తారు. ఐదో నాడు - అట్ల బతుకమ్మకు.. బియ్యం నానబెట్టి తీసి దంచి, లేదా విసిరి అట్లు, దోశలు, ఫలహారంగా పెడతారు.
ఆరవరోజు. - అలిగిన బతుకమ్మ.. ఈరోజు బతుకమ్మను పేర్చి ఆట ఆడతారు గానీ, ఈ రోజు ప్రసాదం ఏమీ ఉండదు.ఏడవ రోజు - వేపకాయల బతుకమ్మ: సకినాలు చేసే పిండి పదార్థాన్ని చిన్నచిన్న వేపకాయలంత పరిమాణంలో వేపకాయలుగా, ముద్దలుగా చేసి నూనెలో దేవిన వంటకాలను ప్రసాదంగా సమర్పిస్తారు... ఎనిమిదోనాడు - వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యితో తయారు చేసిన ఫలహారం పెడతారు , చివరి రోజు బతుకమ్మను - సద్దుల బతుకమ్మ అంటారు.. ఐదు రకాల సద్దులు పెరుగన్నం సద్ది, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర , కొబ్బరి తురుము , నువ్వుల పొడి, రకరకాల సద్దులను ప్రసాదంగా తొమ్మిది రోజులు బతుకమ్మలను చేసి, ఫలహారాలతో ఇంటి ముందు పెట్టుకొని ఉయ్యాల పాటతో ఆడుతారు., గ్రామ బొడ్రాయి దగ్గర కూడా అందరి బతుకమ్మలను ఉంచి, స్త్రీలందరూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొట్టుకుంటూ ఉయ్యాల పాట పాడుకుంటూ ఆడుతారు.డప్పుల దరువు, చప్పుట్ల దరువులు ఉత్సాహంగా ఊరిని కదిలిస్తుంటాయి. ఇక్కడ అన్ని కులాల వారూ చేరి ఐక్యతను, స్నేహాన్ని, గ్రామ బంధుత్వాన్ని కళ్లకు కట్టేలా ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు. బొడ్రాయి దగ్గర చాలా సేపు ఆడిన తర్వాత ఎవరి బతుకమ్మను వాళ్లు రెండు చేతులతో ఎత్తుకొని చెరువు దగ్గరికెళతారు. చెరువు దగ్గర బతుకమ్మలను దించి... ఆడి ఆ తర్వాత నీళ్లలో విడవడం ఆనవాయితీగా వస్తోంది.
పూవులు చెరువులో వేయడంలో ఒక శాస్త్రీయ దృక్పథం ఉందనిపిస్తుంది. బతుకమ్మలో పేర్చే ప్రతి పువ్వు ఆయుర్వేదంలో ఔషధ విలువలున్నవే.. పువ్వులు నీట చేరి కాలుష్యాన్ని నివారిస్తాయని శాస్త్రాల్లో చెప్పారు..
బతుకమ్మను విడవడంలో కూడా ఒక పద్ధతి వుంటుంది. మోకాళ్ల వరకు నీళ్లలో దిగాక... నీటిమీద బతుకమ్మ పళ్లెం ఉంచి, ఇంకా కొంచెం దూరం నడిచి తేలుతున్న బతుకమ్మనుంచి ఆ పళ్లాన్ని మెల్లగా కిందకి ఒత్తి పైకి తీస్తారు. నీళ్లపై తేలుతున్న బతుకమ్మను అలలతో ముందుకు నెట్టి వెనక్కి తిరిగి వస్తారు. వస్తూ వస్తూ పళ్లెంలో కొన్ని నీళ్లు తెచ్చి అందరి మీదా చల్లుతారు. నీళ్లు చల్లాక తెచ్చుకున్న ప్రసాదం ఒకరికొకరు పంచుకుంటూ ‘ఇచ్చుకుంటి వాయినం- పుచ్చుకుంటి వాయినం అనుకుంటూ... అందరూ ఒకచోట కూర్చొని ప్రసాదం తీసుకుంటారు. ఇదీ పల్లె పడుచుల పండుగ బతుకమ్మ వేడుక.. అనాదిగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాల వెనుక దాగి ఉన్న విజ్ఞాన విషయాలు మనిషిని ఆరోగ్యంగా చేస్తాయని.. అంటువ్యాధులు ప్రభలకుండా ఈ ఆయుర్వేద సూత్రాలు కాపాడుతాయని విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతోంది.
బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నదిది : ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం "బతుకమ్మా !" అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదనీ, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.
ఇంకొక కథలో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానము లేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఈయన భార్య గర్భవతియై లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కినది కావున ఈమె తల్లితండ్రులు బతుకమ్మా అని నామకరణము చేసినారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆన్వాయితీ అయ్యిందని ఈ కథ చెబుతున్నది. ఈ పూల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని పరిమళింపజేయాలని తెలుగు విశేష్ తరఫున మనసారాఆశిస్తున్నాం...
కోసలాధీశుండు ఉయ్యాలో – దశరథ నాముండు ఉయ్యాలో -
కొండ కోనలు దాటి ఉయ్యాలో – వేటకే బోయెను ఉయ్యాలో -
అడవిలో దిరిగెను ఉయ్యాలో – అటు ఇటు జూచెను ఉయ్యాలో -
చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో – చెరువొకటి కనిపించె ఉయ్యాలో -
శబ్దమేదొ వినెను ఉయ్యాలో – శరమును సంధించె ఉయ్యాలో -
జంతువేదొ జచ్చె ఉయ్యాలో – అనుకొని సాగెను ఉయ్యాలో -
చెంతకు చేరగా ఉయ్యాలో – చిత్తమే కుంగెను ఉయ్యాలో -
కుండలో నీళ్ళను ఉయ్యాలో – కొనిపో వచ్చిన ఉయ్యాలో -
బాలుని గుండెలో ఉయ్యాలో – బాణమే గ్రుచ్చెను ఉయ్యాలో -
ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో – ఏడ్పుతో దశరథుడు ఉయ్యాలో -
శ్రవణుడు నేననె ఉయ్యాలో – చచ్చేటి బాలుడు ఉయ్యాలో -
తప్పు జరిగెనంచు ఉయ్యాలో – తపియించెను రాజు ఉయ్యాలో -
చావు బతుకుల బాలుడుయ్యాలో – సాయమే కోరెను ఉయ్యాలో -
నా తల్లిదండ్రులు ఉయ్యాలో – దాహంతో ఉండిరి ఉయ్యాలో -
ఈ నీళ్ళు గొంపోయి ఉయ్యాలో – ఇచ్చి రమ్మనెను ఉయ్యాలో -
ఆ నీళ్ళతో రాజు ఉయ్యాలో – అడవంతా వెదికె ఉయ్యాలో -
ఒకచోట జూచెను ఉయ్యాలో – ఒణికేటి దంపతుల ఉయ్యాలో -
కళ్ళైన లేవాయె ఉయ్యాలో – కాళ్ళైన కదలవు ఉయ్యాలో -
వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో – వేదన చెందుతూ ఉయ్యాలో -
సాష్టాంగ పడె రాజు ఉయ్యాలో – సంగతి జెప్పెను ఉయ్యాలో -
పలుకు విన్నంతనే ఉయ్యాలో – పాపమా వృద్ధులు ఉయ్యాలో -
శాపాలు బెట్టిరి ఉయ్యాలో – చాలించిరి తనువులుయ్యాలో -
శాపమే ఫలియించి ఉయ్యాలో – జరిగె రామాయణం ఊయ్యాలో -
లోక కల్యాణమాయె ఉయ్యాలో – లోకమే మెచ్చెను ఉయ్యాలో
(And get your daily news straight to your inbox)
Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more
Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more
Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more
Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more
Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more