చాంద్రమాన క్యాలెండర్‌ను అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం తొమ్మిదవ నెలలో వచ్చే ఉత్సవమేళా ఈ రంజాన్(ఈదుల్ ఫితర్)! ఇస్లాం పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ కూడా ఈ నెలలోనే ఆవిష్కరించడం కారణంగా ఉత్సవరీతులు అంబరాన్నంటుతుంటాయి. రంజాన్ అంటేనే క్రమశిక్షణ.. దాతృత్వం.. దైవ చింతనలు. ఇవి పండగ సమయంలోనే కాకుండా ప్రతీరోజు ప్రతీ వ్యక్తికి దినచర్యలో భాగమై ఉండాలి! పవిత్ర మాసం.. ప్రవక్త బోధనలు.. ప్రజల ప్రార్థనలు! అలంకరణలు రమణీయమై.. ముస్తాబు కమనీయమై పండుగ వేళకు సిద్ధమైంది!
వివేకపు ద్వారాలు తెరచి సౌహార్ధ్ర సమభావాల్ని పంచాలనే ఆదేశాన్ని పాటించడానికి అమలిన హృదయాలతో ఒకరికొకరు సహాయ పడటం వంటివి అల్లాహ్ స్మరణలో భాగంగా వెల్లడిస్తారు ముస్లింలు. ఇలాంటి దైవ చింతనే నమాజ్. దుష్ట చింతనలను.. దురాగతాలను.. కుహనా సంస్కారాలను ఎదుర్కునే శక్తి నమాజ్‌కు ఉంటుంది. సత్ప్రవర్తన కలిగించే సామర్థ్యం కూడా ఉంది. సత్ ప్రవర్తన కలిగి వ్యక్తి సర్వేశ్వడి దృష్టిలో అందరికన్నా మిన్న అనే భావం ఖురాన్‌లో కూడా ఉంది. అందుకే రంజాన్ పర్వదినాన ఉదయం స్నానానుదులు ముగించుకొని వస్ర్తాలు ధరించి.. సుగంధం-పన్నీరు పూసుకొని తక్వీర్ పఠిస్తూ ఈద్గాలో ప్రార్థనలు చేస్తారు. సర్వ జనహితం కోసం అల్లాహ్‌ను కోరతారు.
నెలవంక సాక్షిగా.. ఈద్గా వేదికగా ఈద్-ఉల్-ఫితర్ అత్తర్ సువాసనలతో ఆహ్వానం పలుకుతోంది! రంజాన్ అంటే క్రమశిక్షణ.. దాతృత్వం.. దైవ చింతనల కలయిక! ఇలాంటి పరమ పవిత్ర పండుగ ప్రాశస్య్తం.. మారుతున్న ఉత్సవ రీతుల గురించి తెలుసుకుందాం! పండుగలు మానవ జీవన స్రవంతిలో భాగం. జాతీయతకు.. సంస్కృతి వికాసానికి ఇవి దోహదం చేస్తాయి. దసరా అయినా.. క్రిస్మస్ అయినా.. రంజాన్ అయినా ఇవి ఇచ్చే సందేశమొక్కటే. ఇప్పుడు రంజాన్ కాలం. నెల రోజుల్నుంచి పవిత్ర హృదయాలతో అల్లాహ్‌కు ఉపవాసాలు ఉండి రోజంతా ప్రార్థనలు చేసిన ముస్లింలు మాత్రమే కాకుండా రంజాన్‌ను యావత్ మానవజాతి అంతా సెలబ్రేట్ చేసుకుంటోంది. రంజాన్ రాక అందర్నీ ఆనందింపజేస్తోంది. ఈ నెల రోజులు పల్లె.. పట్నం తేడా లేకుండా.. ధనిక.. పేద భేదం రాకుండా మసీదుల్లో ప్రార్థనలు మార్మోగాయి. ఆ ప్రార్థనల ఫలితం.. ప్రపంచశాంతి జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు.
రంజాన్ పండగ స్నేహగీతిక అందించే వేదిక. వంటకాలను(హాలీం, ఖుర్బానీ కా మీఠా తదితరాలు).. అలంకరణను సర్వ మతాల వారు స్వీకరించడం ఇదే చెప్తోంది. మత సామరస్యానికి ప్రతీక అయిన ీ రంజాన్ యూనివర్సల్ ఫెస్టివల్‌గా ప్రజల్లో మనసుల్లో ముద్రితమైందని చెప్పవచ్చు.
రంజాన్ విశిష్టత:
నమాజ్ దుష్టచింతనల్ని. దురాగతాల్ని, కుహనా సంస్కారాన్ని ఎదుర్కోగలదు. సత్ప్రవర్తనను నేర్పించగలదు. సత్ప్రవర్తనగల వ్యక్తి సర్వేశ్వరుని దృష్టిలో అందరికన్నా మిన్న (ఖురాన్ 49:13) ఈద్‌ను శ్రామికుని వేతనం లభించే రోజు అని ఖురాన్ విస్పష్టం చేసింది.
నెల రోజులు కఠోరవ్రతం పాటించినవారి శ్రమకు పరిపూర్ణ ప్రతిఫలం ఈ రోజే లభిస్తుందని విశ్వాసం. పర్వదినాన ఉదయం స్నానపానాదులు ముగించుకుని వస్త్రాలు ధరించి సుగంధం పన్నీరు పూసుకుని తక్బీర్ పఠిస్తూ ఈద్‌గాహ్ చేరుకుంటారు. అక్కడ ప్రార్థన చేస్తారు.
ఇహ్‌దినస్సిరాత్ ముస్తఖీమ్ (మాకు సన్మార్గాన్ని చూపు). సమస్త మానవాళి హృదయాల్ని సద్బుద్ధితో నింపాలని కోరుతారు. ఈద్‌గాహ్‌లో నమాజ్ పూర్తి అయిన తర్వాత అక్కడ సమావేశమైన వారిలో వీలైనంత ఎక్కువ మందిని కలిసి సుహృద్భావంతో చేతులు కలుపుతారు.
ఈద్ ముబారక్ తెలియజేసుకుంటారు. అనంతరం ముస్లిమేతర సోదరుల్ని ఇంటికి ఆహ్వానిస్తారు. అమితానందంతో పరస్పరం ఆలింగనం చేసుకుంటారు. విందు ఆరగిస్తారు. ఈద్‌విలాప్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ మతసామరస్యానికి, పరస్పర సదవగాహనకు, సమైక్యతకు ప్రతీకలు.
క్రమశిక్షణ:
వసంతమైనా శిలలపై పూదోట పెరగదు. మెత్తటి మన్ను అయితే మనస్సును దోచే రంగురంగుల పూలు పూస్తాయి. బండరాయిగా మారే దిశవైపు ఎవరి గుండె వెళ్తున్నా.. దాన్ని మల్లించి మెత్తటి మట్టిగా మార్చడం పవిత్ర కార్యం అనే మాటల సారాంశాన్ని బోధిస్తోంది రంజాన్. నిర్ణీత వేళలకు సహరీ కోసం తెల్లవారు జామునే లేవడం.. సాయంత్రం ఒకేవేళకు ఇఫ్తార్ ఆరగించడం అంతా ఓ పద్ధతిగా సాగిపోయింది ఈ నెల రోజుల నుంచి. తినడానికి.. తాగడానికి.. ఏ సడలింపూ లేకుండా నిర్ణీత సమయాన్ని పాటించారు. రోజంతా ధర్మయుత ప్రార్థనా కార్యక్రమాలతో మునిగిపోయారు. ఇంతటి పవిత్రమైన కార్యక్రమాలతో రంజాన్ మాసమంతా పుణ్యకార్యం.. దైవారాదణ సుగుణాలతో నిండిపోయింది. ఇంతకన్నా క్రమశిక్షణ వేరే ఇంకెక్కడ ఉంటుంది?
దాతృత్వం:
లోకోపకారాన్ని కాంక్షిస్తూ చేసే సహాయ కార్యక్రమాలే దాతృత్వపు కార్యాలు. రోజంతా నిష్టతో ఉంటూ సమస్త విశ్వం కోసం.. సకల కోటి జనుల కోసం రంజాన్ పుణ్యవేళ ప్రార్థనలు చేశారు ముస్లింలు. సమస్త మానవాళి హృదయాలను సద్బుద్ధితో నింపాలని కోరుకున్నారు. తమ స్వార్థం కోసం కాకుండా చుట్టూ ఉన్న సమూహం.. సమాజం కోసం ప్రార్థించారు. అందుకే రంజాన్ చివరిరోజున ఈద్గాలో నమాజ్ అయిపోయిన తర్వాత వీలైనంత ఎక్కువ మందిని కలిసి సహృదయంతో ఆలింగనం చేసుకుంటారు. ఆత్మీయంగా పలకరించుకొని చేతులు కలుపుకొంటారు. ఇదంతా రంజాన్ పండుగలో ఒక భాగమే. సాంకేతిక పరిజ్ఞానం మారినా రంజాన్ లాంటి పండుగల వైభవం తగ్గలేదంటే ఈ పండుగకున్న విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఉత్సవ రీతి:
నెల రోజులుగా.. ఎక్కడ చూసినా దావత్-ఏ-ఇఫ్తార్‌లే. బట్టలు.. ఆహారం.. సుగుంధ పరిమళాల షాపింగ్‌లే. రంజాన్‌కున్న ప్రత్యేక మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారసంస్థలు కొన్ని సృజనాత్మకంగా ఆలోచించాయి. అప్పటివరకు ఉన్న ప్రచారపర్వాన్ని మార్చేసి వాణిజ్య ప్రకటలను మొత్తం ఉర్దూలోనే ఇవ్వడం ప్రారంభించాయి. అంటే రంజాన్ సీజన్ మార్కెట్‌కున్న క్రేజ్ ఏంటో దానివల్ల కంపెనీలకు కలిగే లాభమేంటో తెలుసుకోవచ్చు. ఇక హలీమ్.. బిర్యానీ వంటి స్పెషల్ వంటకాలకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద గిరాకీ ఏర్పడింది. దీంతో వాళ్లు కూడా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. మొత్తమ్మీద రంజాన్ ప్రభావం వ్యక్తుల మీద.. వ్యవస్థ మీదా పడి మంచి సామరస్యవాతావరణం ఏర్పడింది. సోదరభావం ఏర్పడింది. ఈ సంవత్సరమంతా ఇలానే ఉండాలని కోరుతూ.. ఈద్ ముబారక్!!
దైవ చింతన
చూస్తుండగానే నెలరోజులు గడచిపోయాయి. ఇప్పుడు కానరావాల్సింది షవ్వాల్ నెలవంక! దీనిని ఈద్-ఉల్-ఫితర్ అంటారు. షవ్వాల్ నెలవంక దర్శనమిస్తేనే రంజాన్ సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట! మనకు నెలవంక నేడు కనిపించే అవకాశాలున్నాయి. అయితే రంజాన్ రేపు అన్నమాట. నెలవంక తర్వాత ఈద్గాలో ప్రార్థనలు చేసి ముస్లిమేతర సోదరులను ఇంటికి ఆహ్వానిస్తారు. ఈద్‌మిలాస్ సమావేశాలు ఏర్పాటు చేసి విందు ఆరగిస్తారు. ఇవన్నీ మత సామరస్యానికి.. పరస్పర సదావగాహనకు ప్రతీకలు. మతసహనాన్ని మానవలోకానికి మణికిరీటంగా భావిస్తే.. మనిషి మనిషిగా జీవిస్తే భగవంతుడికి ఎనలేని హర్షం. ప్రతివ్యక్తి నిస్వార్థ సేవ చేస్తేనే జీవితంలోని వాస్తవిక ఆనందం బోధపడుతుంది. రంజాన్‌లాంటి పండుగల సందర్భంగా ఇతరుల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తే అంతకన్నా మించిన గొప్పకార్యం ఉండదేమో!
తెలుగు విశేష్ తరపున అందరికీ రంజాన్ శుభాకాంక్షలు...
(And get your daily news straight to your inbox)
Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more
Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more
Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more
Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more
Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more