హిట్టు నుంచి కాదు... ఉద్వేగంలోంచి సినిమా పుట్టాలి!
సినిమా కమర్షియల్ మయం అయిపోయిన రోజులివి. మనిషి, మానవత్వం, విలువలు, పట్టుదల, కార్యదీక్ష... ఇవన్నీ టార్చిలైట్ వేసి వెతికితేనే సినిమాలో కనిపిస్తాయి. ఈ తరుణంలో ఓ పర్పస్ కోసం, ఓ ఉద్వేగం కోసం... సినిమాలు తీస్తున్న ఒకే ఒక్క దర్శకుడు ఎన్.శంకర్. ‘జయం మనదేరా’ నుంచి... నిన్నటి ‘జై బోలో తెలంగాణ’ వరకూ... ఎన్నో సినిమాలు హృదయాన్ని కదిలించే సన్నివేశాలతో మలిచారాయన. మరోసారి సరికొత్త కథనంతో... వైవిధ్యమైన సినిమాని అందించడానికి రంగం సిద్ధం చేస్తున్న ఈ దర్శకుడు చెప్పిన అనుభవాలు మీ కోసం....
మీ సినిమా కథాంశాలపై ?
ఎన్‌కౌంటర్ - ఓ తల్లి ఆవేదన నుంచి పుట్టిన కథాంశం. శ్రీరాము లయ్య - ఒక బయోగ్రఫీ. యమజాతకుడు - యమలోకం సెట్ వేసి నేచురల్‌గా తీశాం. దానికోసం ఎంతో స్టడీ చేశాం. జయం మ నదేరా - అత్యధికులకు సామాజిక న్యాయం జరగాలని చెప్పిన సినిమా. సామాజిక న్యాయం, రాజకీయ, ఆర్థిక సమానత్వం అవస రమని చెప్పాం. నేటి సమాజంలో ఆర్థికాన్ని బట్టే కులవ్యవస్త పాదు కుంది. బాగా ధనవంతునికి, బాగా పేదవాడికి కులంతో పనిలేదు. మధ్యతరగతి వారికే ఈ కులం పిచ్చి. రాజకీయం, ఆర్థికంలో సమానత్వం లేకపోవడం వల్లే ఈ కులతత్వం ఉంటుంది. మహాత్మ ఫూలే ఆదర్శంగా ‘జయం మనదేరా’ చేశాం. పెరియార్ వారసులు, ఫూలె వారసులు చెన్నై నుంచి వచ్చి మరీ ఈ సినిమా చూశారు. ఇంత చిన్నకుర్రాడా... ఈ సినిమా తీసింది అన్నారు.
సినీకెరీర్ ఆరంభంలో జ్ఞాపకాలు?
1984లో మద్రాసు వెళ్లేప్పుడు 500 మంది మా ఊరి వాళ్లు నాతోపాటు వచ్చి రైలెక్కించి సాగనంపారు. మద్రాసు నుంచి వస్తున్నాననగా మా అమ్మ ముందే వూరంతా ఠాం ఠాం వేసేది. కొన్ని జ్ఞాపకాలివి. నేను, దర్శకుడు దేవీప్రసాద్, గిరిధర్ (జర్నలిస్ట్), నాగేంద్ర కుమార్ అంతా... అక్కడ ఒకే గూటి పక్షులం. బి.ఎ.రాజు కూడా మాతో వచ్చి పిచ్చాపాటి మీటింగుల్లో పాల్గొనేవారు. ఆ తర్వాత మహానటుడు ఎస్వీ రంగారావు ఇంట్లో నేను ఉండేవాడిని. స్నేహితులంతా వేరు వేరు చోట్ల స్థిరపడ్డారు. ఇటీవల ‘జై భోలో...’లో హీరోయిన్ అన్నగా ఎస్వీఆర్ మనువడు నటించారు.
‘జై బోలో...’ తర్వాత గ్యాప్ ఇచ్చారు. సినిమాలు చేయలేదేం?
అంతా కొత్తవాళ్లతో ఓ సినిమాకి సన్నాహాలు చేస్తున్నా. ప్రేమ, వినోదం దండిగా దట్టించి యువతకు నచ్చేలా ఓ కథ తయారు చేసుకున్నా. ఈ సినిమా పూర్తయ్యాక, ఓ ప్రముఖ నటుడితో సినిమా చేయనున్నా.
విజయం... అందుకున్నా వెంట వెంటనే సినిమాలు ఎందుకు చేయరు?
నాకంటూ ప్రత్యేకించి ప్రణాళికలు ఉండవు. కమర్షియల్‌గా హిట్టిచ్చినంత మాత్రాన వెంటవెంటనే సినిమాలు చేసేయాలనీ లేదు. అలా ప్రయత్నించినా... కుదిరిందీ లేదు. వరుసగా సినిమాలు చేయాలని అనుకోను. ఏ ప్రాజెక్ట్ అయినా దానంతటదే ముందుకెళుతుంది.
సినిమాకి పరిచయం ఎలా?
రచయిత, నటుడు ప్రభాకర్ రెడ్డి గారు... నేను సినిమా రంగానికి రావడానికి కారకులు. పాలిటెక్నిక్ డిప్లోమా రెండో సంవత్సరం చదువుతుండగానే ఆయన ప్రేరణతోనే ఇటొచ్చాను.
సహాయ దర్శకుడిగా తొలిసినిమా?
కృష్ణంరాజు హీరోగా ‘భారతంలో శంఖారావం’ చిత్రం... సహాయదర్శకుడిగా తొలిసినిమా. సందేశం, సామాజిక నేపథ్యం ఉన్న సినిమా అది. అలా నా కెరీర్ ఆరంభమే ఓ పర్పస్‌ఫుల్ సినిమాకి పనిచేశాను. అవార్డులు కూడా అందుకుందా చిత్రం. సినిమాలో రాజేష్ పాత్ర నాదే. నా వ్యక్తిగత అంశాలే ఆ పాత్రలో ఉంటా యి. పాత్ర చిత్రణ సహా సంభాషణల్లో నా సాయం ఉంది. ‘చనిపోయింది హిందు వా? ముస్లిమా? అని ఏడుస్తారు కానీ, మనిషి చచ్చాడని ఎవడూ ఏడ్వడం లేదు’ వంటి అద్భుత సంభాషణలు ఆ సినిమాలో ఉంటాయి.
దర్శకుడిగా ఆరంభం?
దర్శకుడిగా నా తొలిసినిమా ‘ఎన్‌కౌంటర్’. ఆ సినిమాతో ‘ఎన్‌కౌంటర్’ శంకర్‌గా పేరొచ్చింది. సూపర్‌స్టార్ కృష్ణ, రమేష్‌బాబు, రాధిక, రోజా... ఇలా భారీ తారా గణం నటించారు. పద్మాలయ బేనర్‌లో దర్శకుడిగా నా తొలిసినిమా చేశాను.
మీ సినిమాకి ముడివస్తువు?
నేను వ్యక్తిగతంగా ఎదుర్కొన్నవి, పరిసరాల్లో చూసినవి... సినిమాల్లో చూపిస్తాను.
దర్శకుడు కాకుంటే?
సవ్యంగా చదివితే ఇంజనీర్ అయ్యుండేవాడిని, చదవలేదు కాబట్టి దర్శకుడినయ్యాను.
సినిమా ఏమిచ్చింది?
నేను సినిమాకేం ఇచ్చానో తెలీదు కానీ, సినిమా మాత్రం నాకు చాలా ఇచ్చింది. నేనీరోజు ఆర్థికంగా, సామాజికంగా ఓ గౌరవప్రద స్థితిలో ఉన్నానంటే సినిమానే కారణం.
సినిమా ఎలా పుట్టాలి?
ఉద్వేగంలోంచి సినిమా పుట్టాలి! హట్టిచ్చామని సినిమా చేయకూడదు. అలా ఉద్వేగంలోంచి చేసినవే ‘జయం మనదేరా’, ‘భద్రాచలం’, ‘జై భోలో తెలంగాణ’. అసలు ‘జై భోలో...’కి ఆర్ధిక ఇబ్బందులున్నా... స్నేహితుల సహకారం, సంకల్ప బలంతో పూర్తి చేయగలిగాను.
డ్రీమ్ ప్రాజెక్ట్?
నాకంటూ ప్రత్యేకించి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏం లేవు. మంచి మ్యూజికల్ లవ్‌స్టోరి, ఆ తర్వాత ‘జయం మనదేరా’ తరహా సినిమా ఒకటి చేయాలి. భారీ బడ్జెట్‌తో తెలంగాణ రజాకార్ల స్ట్రగుల్ పైనా సినిమా తీయాలి.
‘జై భోలో...’కి తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌తోనే పాట ఎందుకు రాయించారు?
డిసెంబర్ 9 తర్వాత తెలంగాణలో జరిగిన పరిణామాల్ని పాటలో అర్థమయ్యే లా చూపాలనుకున్నాం. ముక్కుసూటిగా... వ్యంగ్యాన్ని జోడిస్తూ పాట ఉండాల ని భావించాం. ఆ సందర్భానికి కేసీయార్ పాట రాస్తే బలం చేకూరుతుందని భావించి కలిశాం. తన మాటలతోనే వ్యంగాన్ని చూపే ఆయన అందుకు తగ్గట్టే అద్భుతమైన పాట రాశారు. కేసీయార్, గద్దర్, ప్రజాకవులు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, కులసంఘాలు, ప్రజా సంఘాలు, అందరి సహకారంతో తెలంగాణ కళారూపంగా ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించాం.
ప్రజా గాయకుడు గద్దర్ పాడిన ‘పొద్దు పొడు స్తోంది...’ పాటను 80 లక్షల మంది కాలర్ ట్యూన్లుగా పెట్టుకుని మరీ విన్నారు. ఆడియో చరిత్రలో ఇదో రికార్డ్. సంగీత ప్రియులను ఎంతగానో అలరించిన పాట అది. తెలంగాణలో ఏ వేడుక జరిగినా ఈ పాట మోగాల్సిందే.
సినిమా చూసి కేసీయార్ ఎలా స్పందించారు?
ఉద్యమానికి ఊతమిచ్చే చక్కని సినిమా తీశావని ప్రశంసించారు.
‘జై భోలో...’కి సీక్వెల్ తీయరా?
‘జై భోలో...’కి సీక్వెల్ తీసే ఆలోచన లేదు. చెప్పాల్సినవి, చూపాల్సినవీ చాలావరకూ ఆ సినిమాలోనే చూపించాం. ఇకనుంచి అప్‌డేట్ చేస్తూ సినిమా తీయాలేమో! మారే పరిస్థితులను బట్టి కథ సిద్ధం చేసినా చేయొచ్చు.
నియో రియలిజం తరహాలో జనాల మధ్య షూటింగులే ఎక్కువ చేస్తారు. ఎందుకలా?
జనాల మధ్య జనాల కోసం షూటింగ్ చేసేయడం, బాధితులైన జనాలతో సినిమా చేయడం నా పద్ధతి. ‘శ్రీరాములయ్య’ అలానే తీశాం. ఆ సినిమా టైంలో ఎన్నో బెదిరింపులు కూడా వచ్చాయి. దాడులు జరిగిన సంగతీ తెలిసిందే. కారు బాంబు ఘటనా అప్పటిదే. 75 వేల మందిని సెట్స్‌పైకి తెచ్చి ఓ రోజంతా... ఉప్మా, భోజనం... పెట్టడం చిన్న విషయం కాదు. దర్శకుడిగా నాకు అప్పట్లో సాధ్యమైంది.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more