Motherhood limited to women

Mothers day, Motherhood limited to women, Mothers day celebrations, Mothers day in India

Motherhood limited to women

మగవాళ్ళకి దక్కని ఆ ఆనందం!

Posted: 05/12/2014 09:52 AM IST
Motherhood limited to women

ప్రపంచంలో ఇప్పటికీ పురుషాధిక్యమున్నదనటంలో అనుమానం లేదు.  విద్యా ఉద్యోగావకాశాలతో ఆర్థిక అసమానతలను దూరం చేసే ప్రయత్నం జరగటం వలన నగరప్రాంతాల్లో చాలావరకు తగ్గిపోయినా, ఇంకా మనకు మహిళలకంటే పురుషులకు ఎక్కువగా స్వేచ్ఛ, అధికారాలుండటం మనం చూడవచ్చు.  కానీ ఒక విషయంలో మాత్రం పురుషులు ఎన్నటికీ పొందలేని ఆనందం మహిళలకు మాత్రమే సిద్ధించింది.   అదే మాతృత్వం.

మాతృత్వం అనేది మహిళలకు ఒక వరం.  సమాజంలో దాన్ని పెద్ద బాధ్యతగా మోయలేని బరువుగా కొందరు చూస్తుండవచ్చు కానీ, మాతృత్వంతో మహిళకు పరిపూర్ణత వస్తుంది.  తొమ్మిది నెలలు మోసి, కని, పెంచటమే కాదు, ప్రేమ పంచటం కూడా తల్లికే సొంతం.  అలా అని తండ్రికి ప్రేమ ఉండదని కాదు.  కానీ పుట్టకముందు శిశువును దాచుకున్నట్లే తల్లి ఆ తర్వాత కూడా వాళ్ళ తప్పులను కూడా కడుపులో దాచుకోవటం జరుగుతుంది.  పుట్టిన తర్వాత తన శరీరం నుంచి వేరైనా, శిశువు ఎంత ఎత్తు ఎదిగినా తల్లికి తన శరీరంలో భాగమే అన్న భావన ఉంటుంది.  ఇది పురుషులకు కలగటం కష్టం. 

బాధ్యతలు ప్రేమలు చూపించవచ్చునేమో కానీ మాతృత్వంలోని ఆనందాన్ని ఆస్వాదించటం మాత్రం సాధ్యం కాదు.  

ఆ ప్రేమ, ఆనందం ఉండటం వలనే తల్లి గర్భం దాల్చిన దగ్గర్నుంచి కని పెంచి పెద్దచేయటంలో ఉన్న కష్టాన్ని ఓర్పుతో భరించగలుగుతుంది.  భార్య మీద ప్రేమతో ఆ కష్టాలను, ప్రేమ పంచటంలో ఉన్న ఆనందాన్ని పురుషులు అర్థం చేసుకోవచ్చునేమో కానీ ప్రత్యక్షానుభవం పొందలేరని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం.  

చిన్న పిల్లలలో మొదట్లో గంట గంటకూ అభివృద్ధి కనిపిస్తుంది.  దాన్ని ప్రత్యక్షంగా చూసి ఆనందించగలిగేది తల్లి మాత్రమే.  శిశువులకు పాలు, ఆహారం అందించటం, శుభ్రం చెయ్యటం, వారి బాగోగులు చూడటంలో తల్లికి అనిర్వచనీయమైన ఆనందం లభిస్తుంది.  

ఇది ప్రకృతిలో ప్రతి ప్రాణికీ ఉన్న లక్షణమే కానీ పరిణితి చెందిన మానవ జాతిలో అది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది.  

అమ్మా నాకు భయమేస్తుందమ్మా అని పిల్లవాడంటే రాత్రంతా మేలుకునివుంటుంది తల్లి.  తల్లి దగ్గరున్న భద్రతాభావం పిల్లలకు వేరెక్కడా కలగదు.  తనలో భాగమని అనుకోబట్టే పిల్లల కడుపు నిండితే తల్లికీ ఆనందం కలుగుతుంది.  

అయితే తల్లి పంచిచ్చే ప్రేమకు ప్రతిగా ఏమీ కోరుకోకపోయినా, పిల్లలు కూడా ప్రేమ చూపించినప్పుడు ఆ తల్లి తన పడ్డ కష్టమంతా మరిచిపోతుంది.  కానీ ప్రస్తుతమున్న జీవనవేగంలో, ఆధునిక జీవన శైలిలో, సాంకేతికాభివృద్ధిలో, పిల్లలు తల్లిదండ్రుల ఎడ అంత ప్రేమను కలిగించుకోలేకపోతున్నారు.  వాళ్ళకీ పిల్లలు కలిగినప్పుడు ఆలోచిస్తే అప్పుడు నిజంగా తమ తల్లి ఎంత ఓర్పుతో తమను పెంచిందో అర్థమౌతుంది.  అప్పుడు నిజంగానే వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది.  

ఇది ఈ కాలంలోనే కాదు ఎప్పుడూ ఉండేదే.  ప్రతి తరం అనుభవపూర్వకంగా చూసేదే.  కానీ చదువులు, ఉద్యోగాలలో పోటీల వలన తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ప్రేమలను లేకుండా యాంత్రికంగా జీవితాన్ని నడుపుతున్నవాళ్లే ఈకాలంలో చాలామంది కనిపిస్తారు.  

అందుకే, ఓర్పు, సహనం, ప్రేమ, వాత్సల్యం, మమకారాలతో తన సంతానం సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడే తల్లి గురించి ఒక్కసారైనా తలుచుకోవటానికి, వీలైతే సంవత్సరంలో ఈ ఒక్క రోజైనా వాళ్ళతో మాట్లాడటమో, ప్రేమగా పలకరించటమో, వీలైతే ఏమైనా బహుమతిగా తీసుకెళ్ళటమో చెయ్యటం కోసం ఒక సందర్భాన్ని రూపొందించి దానికి మదర్స్ డే అని పేరు పెట్టారు.  దీన్ని కూడా యాంత్రికంగా ఒక తంతు లా కాకుండా నిజంగా తల్లి ఋణాన్ని తీర్చలేనిదే అయినా కనీసం ఆమె పట్ల తమకున్న ప్రేమ, శ్రద్ధలను చూపించటం వలన ఆమెకు ఆనందాన్ని అందించినవారవుతారు.  

హ్యపీ మదర్స్ డే అని నోటితో అనటం కాదు హృదయపూర్వకంగా అనగలిగినప్పడు ఆ తల్లికి కృతజ్ఞత చూపించటం జరుగుతుంది.  

ఆదివారం మే 11, 2014 న జరుపుకుంటున్న మదర్స్ డే సందర్భంగా-

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles