Narendra modi speaks kashmir issue in united nations

Narendra Modi, United nations, General assembly, kashmir issue

:narendra modi speaks kashmir issue in united nations

ఆ అంశాన్ని లేవనెత్తేందుకు ఇది వేదికే కాదు..

Posted: 09/28/2014 12:45 PM IST
Narendra modi speaks kashmir issue in united nations

కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తేందుకు యునైటెడ్ నేషన్స్ సరైన వేదిక కాదని, భారత వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి వేదికగా స్ప ష్టం చేశారు. పాకిస్థాన్‌తో మనఃపూర్వక ద్వైపాక్షిక చర్చలకు భారత్ సిద్ధమని.. అయితే, అందుకు ఉగ్రవాద నీడ లేని.. అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పాకిస్థాన్ పై ఉందని కుండబద్దలు కోట్టారు. సమస్యల పరిష్కారం దిశగా పురోగతి సాధించాలనుకుంటే.. ఈ వేదికపై వాటిని లేవనెత్తడం సరైన పని కాదన్నారు. పాకిస్థాన్ సహా పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకునేందుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.  ఐక్యారాజ్య సమితి సభలో సమస్యలను లేవనెత్తే బదులు.. వరద బాధిత కాశ్మీర్‌లో సహాయ చర్యల గురించి ఆలోచిస్తే మంచిదని షరీఫ్‌కు చురకలంటించారు. వరద బాదితులకు భారత్‌లో భారీ స్థాయిలో సహాయ చర్యలు చేపట్టామని, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ సాయమందిస్తామన్నామని గుర్తుచేశారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగిస్తూ కాశ్మీర్ అంశాన్ని లెవనెత్తిన నేపథ్యంలో భారత ప్రధాని మోడీ ధీటుగా జవాబిచ్చారు.

 ఉగ్రవాద కేంద్రాలకు ఆశ్రయమిస్తున్నారు
 
 ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వివిధ పేర్లతో, వినూత్న రూపాలతో ఉగ్రవాదం విస్తృతమవడాన్ని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని దేశాలకు ఉగ్రవాదం ప్రమాదకరంగా మారిందన్నారు. ‘ఈ ఉగ్రవాద శక్తులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా, సమైక్యంగా, నిజాయితీగా ప్రయత్నిస్తున్నామా? లేక మన రాజకీయాలు, మన విభేదాలు, దేశాల మధ్య మన వివక్షలు, మంచి ఉగ్రవాదం.. చెడ్డ ఉగ్రవాదం అంటూ నిర్వచనాలు.. వీటిలోనే కొట్టుకుపోతున్నామా?’ అని ప్రపంచ దేశాలను మోదీ సూటిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో పాకిస్థాన్ పై మోడీ పరోక్ష ఆరోపణలు చేశారు. పాక్ పేరెత్తకుండానే నేటికీ కొన్ని దేశాలు తమ భూభాగంపై ఉగ్రవాద కేంద్రాలకు అనుమతించడమో లేక తమ విధానంలో ఉగ్రవాదాన్ని కూడా భాగం చేసుకోవడమో చేస్తున్నాయన్నారు.
 
 ఐరాసలో సంస్కరణలు
 
193 సభ్య దేశాల ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభను ఉద్దేశించి తొలిసారిగా మోడీ ప్రసంగించారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు అవసరమని, 2015లోగా భద్రతామండలి సహా ఐరాసలో అవసరమైన సంస్కరణలన్నింటినీ చేపట్టాలని పిలుపునిచ్చారు. 21 శతాబ్దపు ఆకాంక్షలను ఐరాస ప్రతిఫలించాలన్నారు.  ఐరాసలో సంస్కరణలపై మాట్లాడుతూ.. ప్రపంచదేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థగా ఐక్యరాజ్య సమితి మరింత ప్రజాస్వామికంగా రూపొందాలన్నారు. 20వ శతాబ్దపు అవసరాల ప్రాతిపదికగా ఏర్పడిన సంస్థలు.. 21వ శతాబ్దపు ఆకాంక్షలను ప్రతిఫలించలేవన్నారు. సమయానుకూలంగా మార్పు చెందకపోతే.. ఆ సంస్థల్లో ఎవరూ పరిష్కరించలేని స్థాయిలో అసంబద్ధత, గందరగోళం నెలకొంటాయని హెచ్చరించారు. ఐరాస భద్రతామండలిలో వచ్చే సంవత్సరం నాటికి అవసరమైన మార్పులు చేయాలని కోరారు. ఐరాస 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్న 2015 సంవత్సరంలో.. భద్రతామండలిలో అత్యంతావశ్యక సంస్కరణలను చేపట్టాలన్నారు. ఏ ఒక్క దేశమో, లేక కొన్ని దేశాల బృందమో ప్రపంచ గతిని నిర్ధారించలేవని, ప్రపంచ దేశాలన్నింటికీ  నిజమైన ప్రాతినిధ్యం లభించాలని మోదీ స్పష్టం చేశారు. దాదాపు 35 నిమిషాల పాటు హిందీలో మోదీ చేసిన ప్రసంగంలో పశ్చిమాసియాలో ఉగ్రవాదం, భద్రతామండలిలో సహా ఐరాసలో సంస్కరణలు, సమ్మిళిత అంతర్జాతీయ అభివృద్ధి.. తదితర అంశాలను ప్రస్తావించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  United nations  General assembly  kashmir issue  

Other Articles