‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా.. పోగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము’’.. అంటూ ప్రవాసాంద్రులను ఉద్దేశించి 19వ శతాబ్ధము తొలినాళ్లలో నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు రాసిన సూక్తిని అమెరికాలోని ప్రవాసాంధ్రులు మర్చిపోతున్నారా.? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. తమకు అధిపత్యం లభించలేదని.. లేదా తమ కులానికి ప్రాధాన్యత లభించలేదని, ఇవి కాకపోతే తమ ప్రాంతానికి పెద్దపీట దక్కడం లేదనో తెలుగువారి ఐక్యత మధ్య విభేధాలు ప్రస్పూటిస్తున్నాయా అంటే అవునని చెప్పక తప్పదు.
పరాయి దేశానికి వలసవెళ్లినా మనవాళ్లు స్వార్థ చింతనను వీడటం లేదన్న విమర్శలు కూడా షికార్లు చేస్తున్నాయి. పెద్దలు చెప్పిన సూక్తులను కూడా పెడచెవిన పెట్టి.. మీ సంఘంలో చేరితే మాకేంటి.. అన్న దిక్కుమాలిన పరిస్థితి వచ్చేస్తుందన్న అందోళన కూడా వ్యక్తమౌతుంది. అమెరికా లాంటి దేశంలో వుంటూ.. అక్కడి విధానాలను అర్థం చేసుకుని.. అందుకనుగూణంగా మారుతూ.. తమ విధానాన్ని కూడా మార్చుకుని ఏమిరా తెలుగోడి సత్తా అంటూ అగ్రరాజ్య వాసులే అదిరిపోయేలా యుక్తులను చాటుకుంటున్న తెలుగువారు. వారి కోసమే ఏర్పాటు చేసుకున్న సంఘాలలో మాత్రం ఐక్యతను సమాధి చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానలే వస్తున్నాయి.
తెలుగువారు పరాయి దేశానికి వెళ్లి.. అక్కత తమ శక్తియుక్తులను చాటుకుని ఎదిగే క్రమంలో ఉన్నత పదవులను అధిరోహించడం సాధారణమైన విషయమేమీ కాదు. నిత్యవిజేతగా నిలవడం అన్నది చిన్న విషయం కాదు. అలా నిలువలేని వాడికి అగ్రరాజ్యంలో స్థిరపడే అవకాశమూ వుండదు. అయితే నిత్యవిజేతగా నిలుస్తూనూ.. అక్కడికి చేరుకునే తెలుగువారికి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా.. అగ్రరాజ్యంలో నివసించే వారికి ఎలాంటి కష్టం వచ్చినా మేమున్నామని చెప్పేందుకు ఏర్పాటు చేసినవే తెలుగు సంఘాలు.
అయితే ఈ తెలుగు సంఘాలు ఏర్పాటు చేయడం వెనకనున్న ఉద్దేశ్యాన్ని మర్చిపోయి అధిపత్య ధోరణిని అవలంభించడంతో తెలుగువారి ఐక్యత విచ్చిన్నం అవుతుందా..? అన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అమెరికాలో చదువుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు.. సొంతంగా వ్యాపారాన్ని పెట్టుకున్నాడు.. అమెరికాలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు అన్న మాటలు మన తెలుగువారి మనస్సులను సంతృప్తి పరుస్తున్నాయి.
అసలు అమెరికా వెళ్లేందుకు వీసా వచ్చింది అనగానే.. వెళ్లే వ్యక్తి ముఖంలో వేలకాంతు.. వారి తల్లిదండ్రులు హృదయాలు అనందోత్సాహాలు.. ఇక ఆ వీధి వీధంతా సంబరాలే.. అప్పటి వరకు చిన్న చిన్న మనస్పర్థలతో మాట్లాడని వారు కూడా వచ్చి మరీ కంగ్రాట్స్ చెబుతుంటారు. అలాంటి కోటి అశలతో అమెరికాలోకి అగుడుపెట్టి.. ఎదిగి వృద్ది చెందారంటే చాలు మార్పు సహజం అన్నట్లుగా మారిపోతారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న వారిలోని కసి వారి ప్రగతికి నాంది పలుకుతుంది. అయితే ప్రగతి మాటున స్వార్థం, అహం, అధికారం, వ్యాపారం, ఇలా ఒక్కోక్కటిగా అన్ని కాలక్రమంలో చేరడంతో వారు తమంత వారు లేరని భ్రమిస్తుంటారు.
ఏ పని చేసినా తమకు స్వార్థ కోణంలోనే కనిపిస్తుంది. పచ్చ కామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. అవతలి వారు ఏ కార్యం చేసినా.. దాని వెనుక ఎలాంటి స్వార్థం లేకపోయినా.. అతనిపై బురదజల్లే ప్రయత్నాలు ప్రారంభమౌతాయి. ఇక స్వార్థకోణం కూడా లేకపోలేదని చెప్పలేము. ఇలా అమెరికాలోని తెలుగు సంఘాలు తాము నిర్వహించే సభలు, ఇత్యాధ కార్యక్రమాలలో స్వార్థపూరితంగాను, స్వయంవృద్ది కార్యక్రమాలుగాను మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదాలు తారాస్థాయికి చేరి.. అటు పిమ్మట ముష్టిగాతల వరకు వెళ్తున్నారు. దాడులకు పాల్పడుతున్నారు. తమ పరువు మర్యాదలను.. కాదు కాదు తెలుగువారి గౌరవాన్ని అబాసుపాలు చేస్తున్నారు. తెలుగువారంటే అగ్రరాజ్యంలో వున్న మర్యాదకు భంఘం వాట్టిల్లేలా చేస్తున్తున్నారు. పరిస్థితి ఎలా మారిందంటే చిన్నతనంలో చెప్పుకునే నీతి కథలుగా మారింది. అంటే బావిలో ముగ్గురు తెలుగువారు పడిపోతే.. ఒకరినోకరు లాగేసుకుంటూ వారు ఎంతకీ బావిలోంచి బయటకు రారన్న గుర్తుందిగా.. సరిగ్గా అలాగే..
ప్రవాసంలో స్థిరంగా వుంటున్నాం.. హుందాతనంగా వ్యవహరించాలని, మన గౌరవ మర్యాదలను ఇనుపడింపజేసుకోవాలి.. దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు, ఖ్యాతిని అందించాలన్న తాపత్రయం ఇసుమంత కూడా లేకుండా పరాయి దేశంలోనూ అసభ్యపదజాలం వాడుతూ.. పరువు మర్యాదలను మంటగడుపుతున్నారు. అందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యుల మధ్య జరిగిన ఘర్షనే నిదర్శనం.
ఆటాలో అసలేం జరిగింది..?
అమెరికాలోని తెలుగు అసోసియేషన్ కు ప్రతి రెండేళ్లకు ఓ పర్యాయం జరిగే ఎన్నికలలో భాగంగా సంఘం యొక్క నియమనిబంధనల ప్రకారం అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల కో-ఆర్డినేటింగ్ అధికారి పర్యవేక్షణలో తమ కార్యాలయాలకు తీసుకువెళ్తారు. ఈ ప్రక్రియను ఆటా సభ్యులు కూడా పరిశీలించే అవకాశం వుంటుంది. వారందరి సమక్షంలోనే నామినేషన్లను ఆట కార్యాలయానికి తీసుకెళ్లి, స్ర్కూట్నీ చేసి తరువాత స్కాన్ చేస్తారు. అయితే అంతకన్నా ముందు ఎన్ని అప్టికేషన్లు, ఎక్కడెక్కడి నుంచి, ఎవరెవరు నుంచి వచ్చాయన్న వివరాలు ఆట సభ్యలకు వెలువరిస్తారని తెలుస్తుంది. కానీ అలా కాకుండా కేవలం సంఘం ఏర్పాటు చేసిన వ్యక్తులు మాత్రమే వచ్చి అటా నామినేషన్లు తీసుకెళ్లడంతో వాగ్వాదం ప్రారంభమై.. ఏకంగా ఘర్షణకు దారితీసింది.
ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు వచ్చిన సంఘం ఏర్పాటు చేసిన వ్యక్తులు హనుమంత్ రెడ్డి, డాక్టర్ మెహర్ మేధావరం, శ్రీమతి భారతి పుల్లూర్లే పోస్టాఫీసుకు చేరుకున్నారు. నామినేషన్లను పరిశీలించేందుకు వచ్చిన మాజీ ట్రస్టీ హరిందర్ రెడ్డి, మాజీ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డీలు వారిని నామినేషన్ల వివరాలను అడిగారు. అయితే వివరాలను వెల్లడించేందుకు నిరాకరించిన హన్మంత్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవాలని అదేశించారు. అయితే అందుకు నిరాకరించిన హరించర్ రెడ్డి హనుమంత రెడ్డిని అసభ్యపధజాలంతో దూషించాడు. అంతే దానిని ప్రతిగా హన్మంతరావు కూడా హరిందర్ రెడ్డిని దుర్భాషలాడారు. అవి క్రమంగా పెరుగుతూ పెరుగుతూ ఒకరిపై మరోకరు చేయిచేసుకునే స్థాయికి చేరాయి.
అసలు అనుమానం.. ఉత్పన్నమైంది ఎందుకు..?
హన్మంత్ రెడ్డి నామినేషన్ల వివరాలు చెప్పకపోవడంతో.. అయన పై అనుమానం వుందని అందుచేతనే తాను వివరాలు అడుతున్నానని హరిందర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నీ పైనే డౌట్ వుంది..? నువ్వు నా నామినేషన్ పత్రాలు చించేస్తావన్న అనుమానంతోనే వివరాలను అడిగేందుకు ఇక్కడకు వచ్చానని హరిందర్ రెడ్డి.. హన్మంత్ రెడ్డితో అనడం వీడియోలో మనకు స్పష్టంగా వినబడుతుంది. అయితే అమెరికాలోని తెలుగు సంఘంలో నామినేషన్ పత్రాలను చించేస్తారా..? నామినేషన్ పత్రాలు మెయిల్ ద్వారా దాఖలు చేసినా.. వాటికి అక్నాల్జెడ్ మెంట్ ఏమీ వుండదా..? అలా వుంటే అసలు ఘర్షణకు పరిస్థితులు దారితీయవు కదా అన్న సందేహాలు ఉత్పన్నమవతున్నాయి.
హరిందర్ రెడ్డిపై అధ్యక్షులు ఫైర్..
ఆటా గొడవలను తమ సంఘం తీవ్రంగా పరిగణిస్తుందని అధ్యక్షుడు సుధాకర్ పేర్కారి అన్నారు. సంఘం అదేశాల మేరకు వ్యవహరించిన తమ సంఘం మాజీ అధ్యక్షులు హన్మంత్ రెడ్డి సహా ఇతర సభ్యులతో అనుచిత ప్రవర్తనకు పాల్పడిన సభ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తూ తమ ప్రవర్తనను కప్పి పుచ్చుకోవడానికి యత్నించిన వీరి వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి అవసరాలకు అనుగుణంగా పని చేసే సీనియర్ సంస్థ తమదని అన్నారు. ప్రతి రెండేళ్ళ కొకసారి కొత్త ట్రస్టీ బోర్డు సభ్యులను మేం ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.
యూఎస్ సర్వీస్ మెయిల్ బ్రాంచ్ నుంచి నామినేషన్ ఫారాలతో కూడిన మెయిల్ ను తీసుకునే అధికారం ముగ్గురు సభ్యులకు ఉంటుందన్నారు. బోర్డు నియమించిన ఆటా రిజిస్టర్డ్ ఏజంట్ హనుమంత రెడ్డి, ట్రస్టీ బోర్డు సభ్యుడు డాక్టర్ మెహర్ మేడివరం, నామినేటింగ్ కమిటీ మెంబర్ భారతీ పుల్లూర్లను సంఘం మెయిల్ కలెక్షన్ చేసుకున్నారని చెప్పారు. అయితే హరీందర్ రెడ్డి, చంద్రశేఖర రెడ్డి పాల్వాయి, మరికొందరు పోస్టాఫీసుకు వెళ్లి, మెయిల్ ఓపెన్ చేసి చూపాలని డిమాండ్ చేశారని తెలిపారు. ఆ సందర్భంలో హరీందర్ రెడ్డి మరికొందరు పరస్పరం దాడులకు దిగారాని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామని సుధాకర్ పేర్కొన్నారు. ఇకపై సంస్థలో ఇలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా చూస్తామన్నారు.
మంటగలుస్తున్న ఐక్యత.. గ్రూపులుగా తెలుగు సంఘాలు
ఇదిలా వుంటే అమెరికాలోని తెలుగువారికి సంక్షేమం కోసం, వారి అభయహస్తం కోసం ఏర్పడిన తెలుగు సంఘాలు అనేకం.. వాటన్నింటినీ ఒక్కటిగా చేసి మనం తెలుగువాళ్లం.. మనది ఒక్కటే సంఘం. మన ఐక్యతే మన బలం అని నిరూపించాలని అగ్రరాజ్యంలో అప్పటికే వున్న పలు తెలుగుసంఘాలన్నింటినీ ఏకం చేసి 1977లో తానాను ఏర్పాటు చేశారు. ఈ తెలుగు సంఘం ఏర్పాటులో గుట్టుగుళ్ల రవింద్రనాథ్, బండారు శివరాం రెడ్డి, తుమ్మల మాధవరావు, మన్నె రమణారావులు కీలక భూమిక పోషించారు. అయితే ఇది అవిర్భవించిన కొన్నాళ్ల వరకు బాగానే వుంది. తెలుగువారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అదుకునేలా చర్యలు తీసుకుంది.
అయితే వరుసగా రెండో పర్యాయం నల్లా మధు సత్యనారాయణ తానా అధ్యక్షుడిగా గెలుపొందారు. బలరామ్ రెడ్డిపై అయన విజయం సాధించారు, అయితే ఆయన విజయాన్ని జీర్ణించుకోలేని పలువరు బయటకు వచ్చి తానాలో కొన్ని కులసంఘాలకు మాత్రమే అదరణ పెరుగుతుందని, మిగిలినవారిని సంఘం సభ్యులు పట్టించుకోవడం లేదని బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో తానా తెలుగు సంఘం నిట్టనిలువునా చీలిపోయింది. దశాబ్దమున్నర కాలం తిరిగకముందే చీలికతో మరో తెలుగు సంఘం అవిర్భవించింది. అదే అటా. అమెరీకన్ తెలుగు అసోసియేషన్.
ఇలా ప్రారంభమైన చీలికలు అటాను కూడా చీల్చాయి. ఏ కారణం చేత తానా నుంచి బయటకు వచ్చారో అదే కారణాన్ని పేర్కోంటూ తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదంటూనో, లేక తమ ప్రాంతానికి పెద్దపీట లేదనో అటా నుంచి కొందరు బయటకు వచ్చాశారు. ఇలా వచ్చిన వారు మరో గ్రూప్ ను ఏర్పాటు చేసి దానికి నాటా అని నామకరణం చేశారు. ఆ తరువాత మరోమారు తానాలో విభేదాలు తలెత్తి కొందరు బయటకు వచ్చి నాట్స్ తెలుగు సంఘాన్ని స్థాపించారు, ఇలా చిన్న చిన్న గ్రూపులు బోలెడు ఏర్పడ్డాయి, సిలికానాంద్ర, తాజాగా గత ఏడాది టాటా తెలుగు సంఘం కూడా ఏర్పడింది.
అగ్రరాజ్యాన్ని చూసైనా నేర్చుకో్రా..?
అగ్రరాజ్యంగా వెలుగోందుతున్న అమెరికా లాంటి దేశంలోనే వారి అద్యక్ష ఎన్నికల బరిలో నిల్చిన పార్టీలనే చూసి మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం వుంది. మనం కాకపోయినా అమెరికాలో వున్న తెలుగువారు, తెలుగు సంఘాలు చాలా అధ్యయనం చేయాల్సిన అవసరం వుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలోనే కేవలం రెండు పార్టీలు మాత్రమే పాల్గోంటున్న క్రమంలో అమెరికాలోని తెలుగువారికి మాత్రం ఎందుకిన్నీ సంఘాలు. ఈ సంఘాలతో ఏం మేలు చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నం కాక తప్పవు.
ఒకటి రెండు సంఘాలు చేస్తున్న సంఘసేవతో మిగతా వారు సంఘాలను స్థాపించి.. ధనార్జన కేంద్రాలుగా, తమ వ్యాపార, వాణిజ్యాల పురోగతికి వీటిని కీలక భూమికలుగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. ప్రవాసంలో వుంటున్నాం.. ఒకరికి ఒకరు తోడుగా వుండాలని అనుకోవాలే కానీ..గ్రూపులు, రాజకీయాలు, సామాజిక వర్గం పెత్తనాలు, ప్రాంతీయ విద్శేషాలతో అమెరికాలోనూ తెలుగువారంటే తెలుగువారికే పడని స్థాయికి రాగద్వేషాలను పెంపోందించుకోవడం అవసరమా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఇదే కొనసాగితే గ్రూపులుగా వున్న తెలుగు సంఘాలు.. ఒకరిని మరోకరు టార్గెట్ చేసుకునే స్థాయికి వెళ్తాయేమోనన్న అందోళన కూడా వ్యక్తం అవుతుంది. ఇప్పటికే తమ సంఘంలో వుండాలంటే తమ సంఘంలో చేరాలని వినతులు తారా స్థాయికి చేరాయన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. ఈ మేరకు అమెరికాకు వెళ్లే కోత్తవారిని టార్గెట్ చేస్తూ ఒత్తిళ్లు కూడా కోనసాగుతున్నయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికైనా తెలుగు సంఘాలన్నీ ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా వుందని తెలుగు విశేష్ భావిస్తుంది. ఐక్యమత్యమే మహాబలం.. విడదీసీన తప్పదు పతనం అని తెలుగు విశేష్ బలంగా విశ్వసిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more