యూపీ యాదవ కుటుంబంలో పోరు తారాస్థాయికి చేరింది. కొంత కాలం నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం ఒక్కసారిగా బద్ధలయ్యింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో పాటు ఆయన బాబాయ్ రాంగోపాల్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్లిద్దరినీ ఆరేళ్ల పాటు వారిద్దరిని బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఇందంతా ఒక ఎత్తు అయితే అవసరమైతే సీఎం స్థానంలో వేరొకరిని కూర్చోబెడతామని ఆయన పేర్కొనటంతో అసలు కలకలం మొదలైంది.
కారణం అదేనా?
కాగా, పార్టీని సంప్రదించకుండా ఇటీవల అఖిలేష్ యాదవ్ ఎన్నికల అభ్యర్థుల జాబితా ప్రకటించారు. 186 మందికి ములాయం సింగ్ యాదవ్ తన జాబితాలో స్థానం కల్పించడం విశేషం. ఇదే జాబితాలో తన బాబాయి శివపాల్ యాదవ్ రికమండేషన్ తో, కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్, 44 కేసుల్లో ప్రధాన నిందితుడైన ఓ వ్యక్తికి సీటివ్వడాన్ని అఖిలేష్ తీవ్రంగా వ్యతిరేకించటడమే ఆ పార్టీలో ముసలానికి కారణమైనట్టు తెలుస్తోంది. రెండో భార్య సాధన, బాబాయ్ శివపాల్ యాదవ్ లకు అఖిలేష్ కు పడకపోవటం తన నిర్ణయాన్ని వత్యికరేంచడం, బహిష్కృత నేతలతో తరచూ సమావేశం అవుతుండటం, పోటీగా మరో లిస్ట్ తయారు చేయటం కోసం యత్నించటం, ఈ వ్యవహారం మొత్తం తీవ్రంగా పరిగణించి ఆయనపై చర్యలు తీసుకుంటున్నానని ములాయం తెలిపారు.
సమాజ్ వాదీ పార్టీలో ముఖ్యమంత్రి అయినా, సాధారణ కార్యకర్త అయినా ఒకటేనని, పార్టీకి నష్టం కలిగించే నిర్ణయాలు ఎవరు తీసుకున్నా సహించబోనని పార్టీ చీఫ్, ‘నేతాజీ’ ములాయం సింగ్ యాదవ్ హెచ్చరించారు. నిన్న అనూహ్య పరిస్థితుల్లో తన కుమారుడు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ను, తన సోదరుడు రాంగోపాల్ యాదవ్ ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్టీని భ్రష్టు పట్టిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించిన ఆయన, 1వ తేదీన పార్టీ అత్యవసర సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలోనే కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని ప్రకటిస్తామని, ఆ వెంటనే ప్రమాణస్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు. "సమాజ్ వాదీ పార్టీని రక్షించేందుకు ఎలాంటి కఠిన చర్యలైనా తీసుకుంటాం. నాకు పదవి, గౌరవం ముఖ్యం కాదు. పార్టీని రక్షించడమే ముఖ్యం. పార్టీ కార్యకర్తలు అందరికీ నా విన్నపం ఒక్కటే. రాజ్యాంగ విరుద్ధమైన సమావేశాలకు హాజరు కాకండి. పార్టీని కాపాడండి. లేదంటే పార్టీ చీలిపోతుంది. నేను అలా జరగనివ్వను" అన్నారు. తాము ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థులతో నేడు ములాయం, అఖిలేష్ లు వేరువేరుగా సమావేశాలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అనుయాయులతో సమావేశం అనంతరం అఖిలేష్ తన భవిష్యత్ అడుగుల గురించి వెల్లడించవచ్చని సమాచారం. దీనిని అవకాశంగా తీసుకునేందుకు ఇతర పార్టీలన్నీ వ్యూహాల్లో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.
నేడు కొత్త సీఎం ఎంపిక?
పార్టీలో చీలిక తప్పనిసరి అన్నట్టు పరిస్థితి కనిపిస్తుండగా, తమ వర్గం ఎమ్మెల్యేలతో నేడు అఖిలేష్, ములాయం విడివిడిగా సమావేశాలు జరపనున్నారు. ఉదయం 9:30 గంటలకు సమాజ్ వాదీ ఎమ్మెల్యేలతో అఖిలేష్ యాదవ్ భేటీ కానుండగా, ఆపై 11:30 గంటల సమయంలో తన వర్గం ఎమ్మెల్యేలతో ములాయం సింగ్ యాదవ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే కొత్త సీఎం ఎంపిక ఉండొచ్చనే సంకేతాలు అందుతున్నాయి.
కాగా, తనకు పదవి ముఖ్యం కాదని, పార్టీలో చీలిక తేబోనని ప్రకటించిన అఖిలేశ్ మరోవైపు ఎమ్మెల్యేలతో మంతనాలు చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సస్పెన్షన్ ప్రకటించాక ఆయన అనుచరులు నినాదాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆయన ఇంటి బయట కోలాహలం నెలకొంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని మాత్రం అధికారంలోకి రానివ్వొద్దన్న కృత నిశ్చయాన్ని అఖిలేష్ ప్రకటించాడు. అంతేకాదు తాను ముఖ్యమంత్రిగా పోటీ చేయబోనని తెలిపాడు. ఈ నేపథ్యంలో అఖిలేష్-కాంగ్రెస్-రాష్ట్రీయ లోక్ దళ్ కూటమిగా ముందుకు సాగే అవకాశాలు లేకపోలేదు.
కెమెరా కంటికి చిక్కిన బాబాయ్...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, తనయుడు అఖిలేశ్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు విలేకరుల సమావేశంలో ములాయం ప్రకటించడానికి ముందు చిన్న హైడ్రామా నడిచింది. దీనిని విలేకరులు పసిగట్టడంతో బయటకు వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సోదరుడు రాంగోపాల్ యాదవ్‌ను ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్టు ములాయం ప్రకటించారు. విలేకరుల సమావేశానికి ఆయన మరో సోదరుడు శివపాల్ యాదవ్ కూడా హాజరయ్యారు. రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన మరుక్షణమే కుమారుడు అఖిలేశ్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాలని శివపాల్ యాదవ్.. ములాయం చెవి కొరకడం అందరికీ కనిపించింది.
మరి ఆ విషయం ఉన్న పేపర్ ఏదని ములాయం.. శివపాల్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఆ విషయం టైప్ అవుతోందని, రావడానికి కొంత సమయం పడుతుందని, కాబట్టి అఖిలేశ్ బహిష్కరణ విషయం కూడా ఇప్పుడే చెప్పేయాలని ఆయన పట్టుబట్టారు. దీంతో పేపర్ చేతికి అందకుండానే కుమారుడిని కూడా ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ములాయం ప్రకటించారు. ములాయం, శివపాల్ ముచ్చట కెమెరాలకు చిక్కడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
చిన్నకొడలికి అదృష్టం...
ములాయం సింగ్ యాదవ్ రెండోభార్య సాధనకు తన కొడుకు ప్రతీక్ యాదవ్‌కు పట్టం కట్టాలన్నది ఆశ. వదిన సాధనకు మరిది శివపాల్ యాదవ్ మద్దతు ఉన్నట్టు ప్రచారంలో ఉంది. ఆరు నెలల క్రితం అఖిలేష్, బాబాయ్ శివపాల్ మధ్య ఏర్పడ్డ విభేదాలు ఎన్నో మలుపులు తిరుగుతూ, ములాయం కొడుకును బహిష్కరించేదాకా వెళ్లాయి. ఇదిలా ఉంటే అసెంబ్లీకి పోటీపడనున్న తమ పార్టీ అభ్యర్థులంటూ, 235 మంది పేర్లను అఖిలేష్ యాదవ్ ప్రకటించిన వేళ, అందులో లక్నో కంటోన్మెంట్ సీటుకు మాత్రం ఎవరి పేరునూ ప్రకటించలేదు. ఈ సీటును తన రెండో కొడుకు ప్రతీక్ భార్య అపర్ణా యాదవ్ కు ఇస్తున్నట్టు ఏడాది క్రితమే ములాయం సింగ్ యాదవ్ ప్రకటించిన నేపథ్యంలోనే అఖిలేష్ ఆ సీటును ఖాళీగా ఉంచినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి ఆమె పేరును తదుపరి దశలో చేర్చే ఆలోచనలో అఖిలేష్ ఉండగానే, అఖిలేష్ సస్పెన్షన్ జరిగిపోయింది. ఇక ఈ మొత్తం సంక్షోభం వెనుక అపర్ణ సైతం తనవంతు పాత్రను పోషించినట్టు సమాచారం. ప్రస్తుతం అఖిలేష్ కు వ్యతిరేకంగా ఉన్న శివపాల్, ములాయం రెండో భార్య సాధన గుప్త వర్గంలో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీకి యువ ప్రతినిధిగా అపర్ణను ముందు నిలిపే ఆలోచనలో శివపాల్ వర్గం ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెనే సమాజ్ వాదీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థినిగా ప్రకటించే అవకాశాలూ కనిపిస్తున్నాయి.
కాగా, అపర్ణ భర్త, ములాయం కుమారుడు ప్రతీక్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా, వ్యాపారాలు చేసుకుంటూ ఉండటంతో ఆమెను ముందుంచి ఎన్నికలకు వెళ్లాలన్నది శివపాల్ వర్గం ఆలోచనగా తెలుస్తోంది. తన పేరును లక్నో కంటోన్మెంట్ సీటుకు ప్రకటించినప్పటి నుంచి నియోజకవర్గంలో పర్యటనలు జరుపుతూ, గెలుపునకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్న ఆమె, ఇకపై మిగతా రాష్ట్రంలోనూ పర్యటనలు సాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీతో తన భర్త ప్రతీక్ సెల్ఫీ దిగిన వేళ, ఆయనకు మద్దతు పలుకుతూ అపర్ణ వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడిక తండ్రీ, కొడుకులు ములాయం, అఖిలేష్ మధ్య విభేదాలు పెచ్చుమీరిన వేళ, పార్టీకి యూత్ ఐకాన్ గా నిలిచే ప్రయత్నాల్లో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more