‘‘శమి శమి యతే పాపం.. శమే శత్రు వినాశనం !
అర్జునస్య ధనుర్ధారి.. శ్రీరామస్య ప్రియదర్శనం’’ !!
ముందుగా ‘తెలుగు విశేష్’ వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. పేరులోనే విజయంను పెట్టుకున్న ఈ పండగకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పురాణాల్లో.., ఇతిహాసాల్లో విజయదశమి పండగ గురించి ప్రత్యేకంగా వివరించబడింది. మహావిష్ణువు పది అవతారాల్లోనూ ఈ పండగ రోజున ఏదో విజయం సాధించిన ఆనావళ్ళు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవలసింది రాముడి గురించి. ఏకపత్నీవ్రతుడుగా పేరుగాంచిన దేవదేవుడు... సుగుణవంతుడు అయిన రాముడు రావణుడితో యుద్ధం చేసి విజయదశమి రోజు విజయం సాధించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజున రావణవధకు గుర్తుగా పదితలల రాక్షసుడి ప్రతిమలను దహనం చేస్తుంటారు.
ఇక మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే దుర్గాదేవి మహిషాసుర రాక్షసుడిని వధించటం. ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తూ రాక్షసానందం పొందే మహిషితో 9రోజల పాటు పగలు, రాత్రి యుద్ధం చేసి 10వ రోజు రాక్షసవధ జరిగిందని చరిత్ర చెప్తోంది. ఈ విజయానికి గుర్తుగానే విజయ దశమి జరుపుకుంటారని కొన్నిచోట్ల స్థల పురాణాలు కూడా ఉన్నాయి. ఇక మరొక కధ కూడా ఇక్కడ చెప్పుకోవలసి ఉంది అదేమంటే... భూమికి ప్రుభువుగా భావించే దక్షుడికి సతి అనే కూతురు ఉండేది. చిన్నప్పటి నుంచే శివుడిని పూజించేది. త్రినేత్రుడే తన భర్తగా భావించి ఆరాదించేది. ఈ భక్తికి మెచ్చిన శివుడు సతిని పెళ్లి చేసుకుంటాడు. అయితే దక్షుడికి ఈ పెళ్లి ఇష్టం ఉండదు అయినా ఏమి చేయలేకపోతాడు. ఓ రోజు శివుడిని తప్ప మిగతా దేవతలందర్నీ పిలిచి యజ్ఞం చేయిస్తాడు. అయితే తన భర్తను మాత్రమే కార్యానికి దూరంగా ఉంచటాన్ని అవమానంగా భావించిన సతి ఆత్మత్యాగం చేసుకుంటుంది.
తన భక్తురాలి బలిదానంపై ఆగ్రహంతో ఊగిపోయిన పరమశివుడు.., సతి మృతదేహంను తీసుకుని విలయతాండవం అన్నట్లుగా ఆగ్రహంతో నృత్యం చేస్తాడు. ఈ ఆగ్రహజ్వాలకు నలుదిక్కులు గజగజా వణికిపోతాయి. శివుడిని శాంతింపచేసి ప్రపంచాన్ని కాపాడేందుకు నారాయణుడు వచ్చి తన చక్రంతో సతి శరీరాన్ని ఖండిస్తాడు. అప్పుడు ఆమె పద్దెనిమిది భాగాలుగా అయి ఒక్కోచోడ పడిపోతుంది. అవే ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాలుగా మారాయని పురాణాల్లో ఉంది. అంతేకాకుండా తర్వాతి జన్మలో సతియే పార్వతిగా జన్మించి తిరిగి మనసుమెచ్చిన శివుడిని మనువాడిందట. అలా అమ్మ ఆత్మత్యాగం, మహిషిపై విజయంకు గుర్తుగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోందని పూర్వికులు చెప్తున్నారు. దేశంలోని పద్దెనిమిది శక్తిపీఠాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మన తెలుగు రాష్ర్టాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కనకదుర్గగా అమ్మవారు శక్తిపీఠమై వెలిశారు. ఇక్కడ కూడా ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి.
ఇక ప్రముఖంగా విన్పించే మరొక కధ ఏమిటి అంటే పాండవ వనవాసంలో అజ్ఞాతవాసం ముగింపు. ద్వాపరయుగంలో కౌరవులు, పాండవుల మద్య జరిగిన పాచికల పాడు ఆటలో శకుని చేసిన కుట్రకు పాండవులు బలి అయ్యి అడవుల పాలవుతారు. ఓటమికి గాను 12ఏళ్లు వనవాసం, 1సంవత్సరం అజ్ఞాతవాసం గడుపుతారు. ఈ సమయంలో ఐదుగురు అన్నదమ్ములు వారి ఆయుధాలను శమి చెట్టు (జమ్మి చెట్టు)పై దాచి ఉంచుతారు. విజయదశమిరోజున వారి అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని జమ్మిచెట్టుపై ఉంచిన ఆయుధాలు తీసుకుని తమను తాము నిరూపించుకుని కౌరవులతో పోరాటానికి వెళ్తారు. ఈ యుద్దంలో పాండవులు విజయం సాధిస్తారు. అందువల్లనే దసరా పండగ రోజు జమ్మి చెట్టును పూజించటంతో పాటు, ఆయుధాలకు పూజ చేస్తే మంచి జరుగుతుందని అంతా నమ్ముతారు. తప్పక పాటిస్తారు కూడా.
ఇలా దేశమంతా జరుపునే విజయదశమి పండగకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పురాణగాధ ఉంది. అయితే అన్నింటిలో మనకు కన్పించేది విజయమే. పండగ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ‘‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే విజయదశమి’’ ఈ పండగను ఉత్తర భారత దేశంలో ఒకవిధంగా.., దక్షిణ భారత దేశంలో మరొక విధంగా ఎవరి ఆచారాలు, సాంప్రదాయాలకు తగ్గట్లు జరుపుకుంటారు. దక్షిణంలోనే కాకుండా దేశం మొత్తంమ్మీద కర్ణాటకలోని మైసూర్ లో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ముఖ్యంగా తెలంగాణలో దసరాగా విజయదశమి పండగను ప్రధానంగా నిర్వహిస్తారు. పది రోజుల పాటు దేవీ శరన్నవరాత్రులతో పాటు ‘‘బతుకమ్మ’’ ఉత్సవాలు నిర్వహించటం ఇక్కడి ప్రత్యేకత. విద్య, ఉద్యోగాలు, ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లినవారంతా ఇంటికి వచ్చి అంతా కలిసి సంతోషంగా దసరాను జరుపుకుంటారు. సరదాలకు.., సంతోషాలకు మారుపేరైన దసరా పండగ మీ అందరి జీవితాల్లో కొత్త సంతోషాలు తేవాలని ‘తెలుగువిశేష్’ ఆకాంక్షిస్తోంది. మరోసారి అందరికి దసరా (విజయదశమి) శుభాకాంక్షలు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more