సుధీర్ (సుధీర్) ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోయి చివరికి చనిపోదామని అనుకుంటాడు. నందిత(నందిత) ఈమె కూడా ప్రేమలో విఫలం అయిన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ప్రవీణ్ (ప్రవీణ్) కూడా చిన్న కారణంతో ఆత్మచేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. వీరు ముగ్గరు చనిపోదామనుకొని వెళతారు. అక్కడ మరోకరు (సప్తగిరి) కూడా వీళ్లకు తోడవుతాడు. అక్కడ వీరు ఏ కారణాలతో చనిపోదానుకుంటారో చెప్పుకుంటారు. ఇంతలో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ నలుగురిలో ప్రేమలో విఫలం అయిన సుధీర్, నందితలు ఎవర్ని ప్రేమిస్తారు ? వీరి మధ్య ఓ దెయ్యం ప్రవేశిస్తుంది ? ఆ దెయ్యం ఎవరు ? చివరికి చనిపోదామనుకున్న వారు చనిపోతారా ? వారికి ఎదురైన సంఘటన నుండి వారికి వారు ఎలా కాపాడుకుంటారు అనేది మిగతా కథ.
ప్రేమకథా చిత్రమ్ రివ్యూ
దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి యూత్ ని ఆకట్టుకునే విధంగా ‘ఈరోజుల్లో, బస్ స్టాప్ ’ చిత్రాలు మంచి హిట్ సాధించమే కాకుండా పేరు ప్రఖ్యాతలతో పాటు బూతు చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్న దాసరి మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో, కథ, మాటలు, నిర్మాతగా వ్యవహరిస్తూ జె. ప్రభాకర్ రెడ్డిని దర్శకుడిగా పెట్టి దెయ్యం కథను తీసుకొని దానికి రొమాన్స్, కామెడీ అనే అంశాలను మిక్స్, చేసి తీసిన ‘ప్రేమకథా చిత్రమ్ ’ ప్రేక్షకుల్ని ఏ మాత్రం అలరించిందో ఈ రివ్యూలో చూద్దాం.
ఓ హారర్ స్టోరీని తీసుకొని దానికి అనేక హంగులు జోడించి సినిమా ప్రారంభం నుండి ఇంటర్వెల్ వరకు ఓ ప్రేమకథా చిత్రాన్ని చూపిస్తున్నామన్న ఫీలింగ్ ను కలుగ జేసి, ఇంటర్వెల్ లో ట్విస్టుతో ఈ సినిమా లవ్ స్టోరీ కాదు... హారర్ పిక్చర్ అని ప్రేక్షకులకు షాక్ ఇస్తాడు దర్శకుడు. చాలా సాదాసీదాగా మొదలై నెమ్మదిగా ఊపందుకొని ఓ చిన్న ట్విస్టుతో రెండో భాగంలో ప్రవేశించి, సీన్ తరువాత సీన్ వస్తూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తూ కథను ముందుకు నడిపాడు దర్శకుడు. పతాక సన్నివేశాలు కాస్తంత రొటీగా ఉన్నా మొత్తంగా సినిమా చూస్తే ఓ భిన్నమైన సినిమాను చూసిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు ఉంటాయి కానీ, ఈ మధ్యలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే కాన్సెప్టును దర్శకుడు బాగా చూపించాడు. ఈ "ప్రేమ కథా చిత్రం". ఎక్కడా బోర్ కొట్టకుండా అడుగడుగునా ఆసక్తిని రేకెత్తిస్తూ, కడుపుబ్బా నవ్విస్తూ హాయిగా సాగిపోతుంది
ఈ చిత్రంలో నటించిన సుధీర్ బాబు తన మొదటి సినిమా కన్నా ఈ సినిమాలో ఇంకాస్త ఫర్వాలేదనిపించాడు. మిగతా నటులు అయిన ప్రదీప్, సప్తగిరి తన హావభావాలతో చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. నటనతో పాటు కామెడీని కూడా బాగా పండించారు. ‘నీకు నాకు డాష్ డాష్ ’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నందిత ఆ సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఇందులో మెయిన్ రోల్ పోషించిన ఈమె ఫెర్మామెన్స్ లో ఏ మాత్రం బెరుకుదనం కనబర్చలేదు. ఈ చిత్రానికి నందిత పూర్తి న్యాయం చేసిందని చెప్పవచ్చు. ప్రియురాలిగానూ, కాలేజ్ గర్ల్ గానూ, దెయ్యం పాత్రలోనూ ఇలా మూడు రకాల పాత్రల్లో చక్కటి అభినయం ప్రదర్శించింది. ప్రధానంగా ఈ నలుగురి చేట్టే కథ నడుస్తుంది.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకు ముఖ్యంగా మారుతి రచన, దర్శకత్వ ప్రర్యవేక్షణ కలిసొస్తే, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు అయిన జే. ప్రభాకర్ రెడ్డి కావడం సినిమాకు ప్రాణం పోసింది. ప్రతి సన్నివేశాన్ని తనదైన శైలిలో బాగా చూపించాడు. జె.బి. సంగీతం ఆకట్టుకునే విధంగా లేకపోయినా, ఫర్వాలేదనిపిస్తుంది. బడ్జెట్ పరంగా ఈ సినిమాను ఉన్నంతలో బాగా తీశారు. మారుతి దర్శకత్వ పర్యవేక్షణ చేశారో లేక వెనక దర్శకత్వం చేశారో కానీ ఆయన మార్క్ సినిమాలో కచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు రచన కూడా చేసిన మారుతి తన బూతు బుద్దిని పోనిచ్చుకోలేదు. గులాబ్ జాములు పగిలిపోతాయి, క్రికెట్ ఆడటం మొదలు పెడితే ఇక మరిచిపోరు... లాంటి రెండు మూడు సంభాషణలతో తన పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఒకే కథలో రెండు మూడు కోణాలు ఉంటాయి కాబట్టి దర్శకులు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. మారుతీ ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకొని పని చేసినట్టు అర్థం అవుతుంది. దర్శకుడిగా ప్రభాకర్ రెడ్డి, రచయితగా, మారుతి తన ప్రతిభను చూపించారు.
ఈ వేసవి సీజన్ ని ఓ మంచి సినిమాతో ముగించాలనుకునే సినిమా ప్రేమికులకు ‘ప్రేమకథా హాస్యమ్ ’ బాగా పనికొస్తుంది.