ఆది (సుమంత్ అశ్విన్) అమ్మాయిల మనస్తత్వంపై చాలా పట్టున్న కుర్రాడు. అమ్మాయిలు చేసే తప్పులు, వారి ప్రవర్తన గురించి స్నేహితులకు చెప్తూ వారిని అలర్ట్ చేసే స్వభావం కలవాడు. ఆది సూత్రాలతో అతని స్నేహితులు అమ్మాయి అంటేనే ఆమడ దూరంగా ఉంటారు. వీరి గురించి తెలుసుకున్న అవంతిక (రెహాన) తన ఫ్రెండ్స్ తో కలిసి ఆది గ్యాంగ్ కు బుద్ది చెప్పాలని ప్లాన్ వేస్తుంది. ఆది మైండ్ సెట్ పూర్తిగా మార్చేస్తుంది. ఆది స్నేహితులు కూడా ప్రేమ లోకంలో విహరిస్తుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే కథ థియేటర్ కు వెళ్ళి చూడండి.
‘లవర్స్’ మూవీతో అభిమానులను ఆకట్టుకున్న సుమంత్ అశ్విన్ తాజా చిత్రం ‘చక్కిలిగింత’ విడుదల అయింది. రెహాన హీరోయిన్ గా పరిచయం అయిన ఈ సినిమాను వేమారెడ్డి డైరెక్ట్ చేశాడు. మిక్కిజే మేయర్ అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. యూత్ ఎంటర్ టైనర్ ఫీల్ తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
ప్లస్ పాయింట్స్ :
హీరోగా సుమంత్ అశ్విన్ నటన బాగుంది. తొలి సినిమా అయినా హీరోయిన్ రెహానా చాలాబాగా నటించింది. కళ్ళతోనే హావభావాలను ప్రకటించింది. కాలేజ్ గ్యాంగ్ లో నటించిన వారంతా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. కాలేజీ గ్యాంగ్ తో వచ్చే సీన్లు యూత్ ను ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్ :
అన్ని ఫెయిల్యూర్ సినిమాలను కథ దెబ్బకొడితే ఈ సినిమాను కథ వెళ్లిన విధానం దెబ్బకొట్టింది. డైరెక్టర్ వేమారెడ్డి ఒక కథను రాసుకుని దాన్ని మరొకలా చూపించారు. ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లో సినిమా ట్రాక్ పూర్తిగా మారిపోతుంది. దీంతో ఎందుకిలా జరరగుతుంది అని కథను అర్థం చేసుకోలేక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు.
కళాకారుల పనితీరు :
రాసుకున్న కథను సరిగా చూపించటంలో డైరెక్టర్ విఫలం అయ్యాడు. మిగతా టెక్నీషియన్ల పనితీరు చూస్తే.., సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ కూడా గ్రాండ్ లుక్ తో కలర్ ఫుల్ గా వచ్చింది. మిక్కి జే మేయర్ పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. మహిస్ సంస్థ నిర్మాణ విలువలు పర్వాలేదు. సినిమా రష్ అంతా కథకు సంబంధం లేకుండా ఉండటంతో ఎడిటింగ్ చేసేందుకు ఇబ్బంది అయినట్లు కన్పిస్తోంది.
చివరగా : చక్కిలిగింతలు దారి తప్పాయి.