మంత్ర (ఛార్మీ) ఓ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్. ఆమెకు హైదరబాద్ లో జాబ్ రావడంతో నగరానికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ తను ఒక ఓల్డ్ కపుల్ ఉన్న ఇంట్లో గెస్ట్ గా ఉంటుంది. ఎంచక్కా ఉద్యోగం చేసుకుంటూ మంత్ర తన జీవితాన్ని ఎంజాక్ చేస్తుంటుంది. ఇలాంటి సమయంలో ఈమె కెరీర్ లో అనుకోని మలుపులు చోటు చేసుకుంటుంటాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మంత్రని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. ఆమెను చంపే ప్రయత్నంలో చాలాసార్లు విఫలమవుతారు.
అప్పుడే కథలోకి పోలీస్ ఆఫీసర్ విజయ్ (చేతన్ చీను) ఎంటర్ అవుతాడు. మంత్రని చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారన్న అంశంపై ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఈ విచారణలో భాగంగానే విజయ్ మరో నలుగురు వ్యక్తులతో కలిసి.. మంత్ర ఉండే ఇంటికి వెళతారు. అలా వాళ్లు మంత్రి ఇంటికి వెళ్లినప్పటికీ నుంచి అనుకోని పరిణామాలు ఎదురవుతుంటాయి. ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్లకి షాకింగ్ న్యూస్ లు తెలుస్తుంటాయి. అంతేకాదు.. ఒక్కొక్కరు వరుసగా చంపబడుతూ ఉంటారు.
అసలు వాళ్లు ఎందుకు చంపబడుతున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటి.? అసలు మంత్ర ఎవరు.? మంత్రని చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు..? మంత్రి వుండే ఇంట్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..? అసలు మంత్రకి ఆ ఇంటికి ఉన్న సంబంధం ఏమిటి..? అనే విషయాలు తెలుసుకోవాలంటే.. వెండితెరపై సినిమా చూడాల్సిందే.
ఛార్మింగ్ గర్ల్ ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మంత్ర2’. ఎస్.వి.సతీష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గ్రీన్ మూవీస్ పతాకంపై శ్రీనివాస నాయుడు చామకూరి సమర్పణలో పి.శౌరిరెడ్డి, వి.యాదగిరిరెడ్డి నిర్మించారు. గతంలో వచ్చిన ‘మంత్ర’ చిత్రం కంటే మరింత ఎక్కువ హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ చిత్రం గతకొద్ది రోజులుగా విడుదల కాకుండా వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ చిత్రాన్ని జులై 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా వుండబోతుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమా మేజర్ ప్లస్ పాయింట్ ఎవరంటే.. చార్మింగ్ గర్ల్ ఛార్మీయేనని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆమె తన పెర్ఫార్మన్స్ తో సినిమాకి వెన్నముకలా నిలిచింది. మొదటి పాటలో తన స్టెప్పులతోనే కాకుండా తన అందంతోనూ ఛార్మీ ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో చార్మీ చూపిన హావభావాలు చాలా బాగున్నాయి. ఇక హీరోగా చేసిన చేతన్ చీను కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ప్రత్యేక పాత్రలో నటించిన తనికెళ్ళ భరణి పెర్ఫార్మన్స్ బాగుంది. తన పాత్రే కథలో మంచి ఆసక్తిని తీసుకువస్తుంది. ఇక సినిమా పరంగా చెప్పుకుంటే.. మొదటి ఐదు పది నిమిషాల్లో వచ్చే థ్రిల్స్ ని చాలా బాగా షూట్ చేసారు. అలాగే చివరి 5 నిమిషాలలో వచ్చే ఎమోషన్స్ ని బాగా చూపించారు.
మైనస్ పాయింట్స్ :
‘మంత్ర’ చిత్రం అంచనాలకు ఈ సీక్వెల్ మూవీ అందుకోలేకపోయింది. స్టొరీ పరవాలేధనిపించినా నేరేషన్ మాత్రం చాలా వీక్ గా వుంది. ఒకే సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ని టచ్ చెయ్యాలనే ఉద్దేశంతో ఏవేవో జోడించి డైరెక్టర్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తంలో అసలు కథ అనేది మొదలు కాదు. సెకండాఫ్ లోనే ఈ సినిమా కథని రివీల్ అవుతుంది. ఇందులో హర్రర్ ఎలిమెంట్స్ లేకపోవడం ఆడియన్స్ ని నిరాశపరుస్తుంది. సినిమాలో చూపించే కొన్ని మరణాలు ఆడియన్స్ లో సస్పెన్స్, ఆసక్తిని క్రియేట్ చెయ్యలేకపోయాయి. ఇదొక హర్రర్ థ్రిల్లర్ సినిమా కానీ ఆడియన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఈజీగా ఊహించేస్తారు.
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రాఫర్.. ఇచ్చిన లొకేషన్స్ ని బాగా ఉపయోగించుకొని హర్రర్ సినిమా అనే ఫీలింగ్ ని కలిగించాడు. ఇక హర్రర్ సినిమాలకు హార్ట్ అని చెప్పుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతబాగా లేదు. ఎడిటింగ్ యావరేజ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ ని చాలా చాలా ఎడిట్ చేయవచ్చు. ఈ సినిమాలో ఉంది ఒకే ఒక్క పాట అయినా దాని చాలా బాగా షూట్ చేసారు. కెమెరా వర్క్ బాగుంది. ఎస్.వి సతీష్ ఎంచుకున్న కథలో పెద్దగా కిక్ లేకపోవడం, స్క్రీన్ ప్లే బాగాలేకపోవడం ఈ సినిమాని మరింత బోరింగ్ గా చేస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ – క్లైమాక్స్ లని సరిగా రాసుకోలేదు, తీయలేదు. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి.
చివరగా :
మంత్ర 2 : నో హార్రర్.. నో థ్రిల్.. ఓన్లీ బోరింగ్