ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు భరత్(ధనుష్). తన ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా గడిపేస్తుంటాడు. అలాంటి సమయంలో అనుకోకుండా హేమ(అమీజాక్సన్)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. హేమను తన ప్రేమలో పడెయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. చివరగా భరత్ తో హేమ ప్రేమలో పడుతుంది. వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ అదే సమయంలో వీరి జీవితాల్లో మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోతారు. దీంతో హేమను అరవింద్(అదిత్ అరుణ్) పెళ్లి చేసుకుంటాడు.
సీన్ కట్ చేస్తే... ఇన్ కమ్ టాక్స్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తుంటాడు భరత్. భరత్ జీవితంలో యమున(సమంత) వస్తుంది. హేమ భర్త అరవింద్ వలన ఇన్ కమ్ టాక్స్ ఆఫీస్ లో పనిచేసే భరత్ తండ్రి(కె.యస్.రవికుమార్) ఒక అనుకోని కేసులో ఇరుక్కొని, ఆత్మహత్య చేసుకుంటాడు. అసలు ఆ కేస్ ఏంటి? భరత్ తండ్రికి, అరవింద్ కు వున్న సంబంధం ఏంటి? భరత్ తండ్రి ఆ కేసులో ఎలా ఇరుక్కుంటాడు? భరత్, హేమలు ఎందుకు విడిపోయారు? తన తండ్రి ఇరుక్కున్న కేసులో వున్న వాళ్ల సమస్యను ఎలా పరిష్కరించాడు? చివరకు ఏం జరిగింది అనే అంశాలను తెలుసుకోవాలంటే వెండితెర మీద ‘నవమన్మధుడు’ చిత్రం చూడాల్సిందే.
‘రఘువరన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన తమిళ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘థంగ మగన్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నవమన్మధుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో ధనుష్ సరసన సమంత, అమీ జాక్సన్ లు హీరోయిన్లుగా నటించారు. డి.ప్రతాప్ రాజు సమర్పణలో బృందావన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎన్.వెంకటేష్, ఎన్.రవికాంత్ నిర్మించిన ఈ చిత్రానికి వేల్ రాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవలే. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ట్రైలర్ అద్భుతంగా వుంది. ఫ్యామిలీ లవ్, ఎంటర్ టైనర్ గా రూపొందింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న గ్రాండ్ లెవల్‌లో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళంలో భాషలలో విడుదల చేసారు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దామా!
ప్లస్ పాయింట్స్:
‘నవమన్మధుడు’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ధనుష్. భరత్ పాత్రలో ధనుష్ ఇరగదీసాడు. లవర్ బాయ్ గా, ఒక భర్తగా, కొడుకుగా మూడు విభిన్న షేడ్స్ లో అదరగొట్టాడు. లవర్ బాయ్ గా ధనుష్ యాక్టింగ్ సూపర్. అలాగే భర్తగా, కుటుంబ సమస్యలను తీర్చే కొడుకు పాత్రలో ధనుష్ నటన చాలా బాగుంది. తన డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ తో ధనుష్ కట్టిపడేసాడు. ఇక గ్లామర్ భామగా అమీ జాక్సన్ హాట్ హాట్ సన్నివేశాలలో అదరగొట్టేసింది. ముఖ్యంగా ధనుష్ తో కలిసి అమీ జాక్సన్ లిప్ లాక్, రొమాంటిక్ సీన్లలో పిచ్చెక్కించేసింది. మధ్యతరగతి ఇంటి కోడలి పాత్రలో సమంత చాలా చక్కగా నటించింది. ధనుష్-సమంతల మధ్య వచ్చే సీన్లు చాలా బాగున్నాయి.
ఇక కె.ఎస్.రవికుమార్, రాధికల నటన చాలా బాగుంది. సినిమాలో పలు ఎమోషనల్ సీన్లు బాగా పండాయి. ధనుష్ ఫ్రెండ్ గా నటించిన సతీష్ మంచి టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేసారు. చివరగా ‘నవమన్మధుడు’ చిత్రం ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా కొనసాగగా... సెకండ్ హాఫ్ ఫ్యామిలీ, ఎమోషనల్ సీన్లతో సాగిపోయింది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో సెకండ్ హాఫ్ కాస్త మైనస్ గా చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ కాస్త స్లో గా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లలో ప్రేక్షకులకు తెగ బోర్ కలుగుతుంది. దాదాపు ఓ 15 నిమిషాలు ఎడిట్ చేసిన కూడా బాగుండేది. అలాగే సెకండ్ హాఫ్ లో కాస్త ఎంటర్ టైన్మెంట్ తగ్గిందని చెప్పుకోవచ్చు.
సాంకేతికవర్గం పనితీరు:
కథ పాతదే అయినప్పటికీ కథనం పరంగా కొత్తగా తీసారు. స్క్రీన్ ప్లే విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకున్నట్లుగానే కనిపిస్తుంది. దర్శకుడిగా వేల్ రాజ్ మరోసారి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ‘రఘవరన్ బిటెక్’ తర్వాత మరోసారి అదే స్థాయిలో విజయం సాధించాడని చెప్పుకోవచ్చు. ఇక కుమారన్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా చూపించారు. అనిరుద్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
‘నవమన్మధుడు’: ఈ మన్మధుడు అందరివాడు