మెడిసిన్ చదవడానికి ఇండియాకు వచ్చిన ఎన్నారై కుర్రాడు రిషి(అడవి శేష్), అదే కాలేజ్ లో చదువుతున్న శ్వేత(ఆదాశర్మ)తో ప్రేమలో పడతాడు. తనను ప్రేమించిన విషయాన్ని ఆమె తండ్రి ముందే శ్వేతకు చెబుతాడు. దీంతో రిషి పద్దతి శ్వేత తండ్రికి నచ్చదు. వీరి ప్రేమను అంగీకరించడు. శ్వేతను కార్తీక్(సత్యదేవ్)కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. దీంతో తన చదువు మధ్యలోనే ఆపేసి రిషి అమెరికా వెళ్లిపోతాడు. సీన్ కట్ చేస్తే నాలుగేళ్ల తర్వాత రిషికి ఫోన్ చేసి తనని కలవాలని అంటుంది శ్వేతా. ఇండియాకు వచ్చిన రిషితో తన కూతురు రియా కిడ్నాప్ అయ్యిందని, తనను వెతకడానికి సాయం చేయాలని రిషిని అడుగుతుంది. అందుకు రిషి అంగీకరిస్తాడు.
సీన్ కట్ చేస్తే... రియాను వెతికే క్రమంలో రిషికి కొన్ని షాకింగ్ వార్తలు తెలుస్తాయి. అసలు రియా అనే అమ్మాయి లేదని, శ్వేత మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అందుకే తనకు ఓ కూతురు వున్నట్లుగా వుహించుకుంటుందని రిషి విచారణలో తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు శ్వేతకు కూతురు వుందా లేదా? వుంటే ఎవరు కిడ్నాప్ చేసారు? రియాను వెతకడానికి రిషి ఏం చేసాడు? రిషికి తెలిసిన ఆసక్తికర విషయాలేంటి? చివరకు ఏం జరిగింది? అనే ఆసక్తికర అంశాలను వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
అడవిశేష్,ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా ప్రముఖ భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై నిర్మాత పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె సంయుక్తంగా నిర్మించిన తాజా చిత్రం ‘క్షణం’. రవికాంత్ పేరెపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అనసూయ, సత్యదేవ్, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్, రవివర్మ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నేడు(ఫిబ్రవరి 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.
ప్లస్ పాయింట్స్:
‘క్షణం’ సినిమాకు అడవి శేష్, అదాశర్మల నటన ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. అడవి శేష్ కాలేజ్ స్టూడెంట్ గా, ఆ తర్వాత జీవితంలో స్థిరపడ్డ వ్యక్తిగా చాలా చక్కగా నటించాడు. రిషి పాత్రలో అడవి శేష్ అద్భుతంగా నటించాడు. ఎక్కడా కూడా ఓవర్ గా కాకుండా జాగ్రత్తపడ్డాడు. ముఖ్యంగా ఎమోషనల్, థ్రిల్లింగ్ సీన్లలో బాగా చేసాడు. ఇక శ్వేత పాత్రలో అదాశర్మ యాక్టింగ్ సూపర్బ్. ఇప్పటివరకు కేవలం గ్లామర్ పాత్రలలోనే నటించిన అదాశర్మ.. తొలిసారిగా ‘క్షణం’ చిత్రంలో తనలోని నటిని ఆవిష్కరించింది. కాలేజ్ స్టూడెంట్, లవర్, భార్య, తల్లి, మానసికంగా కృంగిపోయే వ్యక్తిగా.... ఇలు పలు షేడ్స్ లలో అదా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా రియాను వెతికే ప్రయత్నంలో అదా ఎమోషన్, థ్రిల్లింగ్ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక తొలిసారిగా ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించిన అనసూయ పర్వాలేదనిపించింది. తన పాత్ర మేరకు న్యాయం చేసింది. ఎక్కడా ఓవర్ చేయకుండా బాగా చేసింది. ఇక సత్యదేవా, సత్యం రాజేష్ తదితరులు వారి వారి పాత్రల మేరకు బాగా నటించారు.
ఈ సినిమా ప్రారంభమైన క్షణం నుంచే సినిమాలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. తర్వాతీ సీన్ ను ప్రేక్షకులు ఊహించే విధంగా లేకపోవడం, ట్విస్టులతో మెప్పించడం బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కాస్త కలర్ఫుల్ గా కొనసాగినప్పటికీ.. సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులను సినిమాలో పూర్తిగా లీనమయ్యే విధంగా చేస్తుంది. సినిమా అంతా కూడా ఎమోషన్, థ్రిల్లింగ్, సస్పెన్స్ లతో ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్:
‘క్షణం’ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమి లేవని చెప్పుకోవచ్చు. కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు, ఎంటర్ టైన్మెంట్, కామెడీ, మాస్ మసాలా, యాక్షన్, డాన్సులు వంటి అంశాలను కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమా చూసి కాస్త నిరుత్సాహపడతారు.
సాంకేతికవర్గం పనితీరు:
‘క్షణం’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కథ, కథనం. ఇందులో నటుడిగానే కాకుండా సినిమాకు కథ, స్ర్కీన్ ప్లేను అందించాడు అడవి శేష్. అడవి శేష్ అందించిన కథ చాలా బాగుంది. ఇలాంటి కథకు అడవిశేష్ మరియు దర్శకుడు రవికాంత్ లు కలిసి అద్భుతంగా స్ర్కీన్ ప్లే ను సమకూర్చారు. కథను చాలా ఆసక్తికరంగా ప్రజెంట్ చేయగలిగారు. ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తూ, ట్విస్టులతో ఆసక్తికరంగా రూపొందించారు. మొత్తానికి అడవిశేష్ అదరగొట్టేసాడు. ఇక స్ర్కీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలను చేపట్టిన రవికాంత్ పేరేపు దర్శకుడిగా సక్సెస్ సాధించాడని చెప్పుకోవచ్చు. నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. కథలో ప్రేక్షకులను లీనమయ్యే విధంగా రవికాంత్ తొలిసినిమాతోనే సక్సెస్ అయ్యాడు.
ఇక షానిల్ డియో అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. పాకల శ్రీ చరణ్ పాటలు పర్వాలేదు కానీ.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్, డైలాగ్స్ బాగున్నాయి. పివిపి సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
‘క్షణం’: ఊహించలేని ట్విస్టుల థ్రిల్లర్.
- Sandy