అనంతపురం జిల్లా బ్యాక్ డ్రాప్ లో జరిగి కథే ఈ ‘రాయుడు’ సినిమా. రాయుడు(విశాల్) ఒక కూలీ. చిన్నప్పుడే తల్లితండ్రులు చనిపోవడంతో తన అన్నమ్మ(అమ్మమ్మ) దగ్గర పెరుగుతాడు. వీళ్ల గ్రామం వున్న ఏరియాలో రోలెక్స్ బాచి అనే పెద్ద రౌడీ వుంటాడు. అతడిని భైరవుడు అనే బిజినెస్ మ్యాన్ పెంచి పోషించి లీడర్ ను చేస్తాడు. జనాల నుంచి అన్యాయంగా మాములు వసూలు చేస్తుంటాడు బాచి. ఓరోజున గుళ్లో భాగ్యలక్ష్మి(శ్రీదివ్య)ను చూసి రాయుడు ఇష్టపడతాడు. అన్నమ్మ కూడా భాగ్యలక్ష్మీని ప్రేమించి, పెళ్లి చేసుకొమ్మని రాయుడుపై ఒత్తిడి చేస్తుంది. చివరకు భాగ్యలక్ష్మీని రాయుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సీన్ కట్ చేస్తే బాచి చేసిన ఒక మర్డర్ కేసులో అతనిపై చార్జిషీట్ దాఖలు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? బాచిపై ఛార్జిషీట్ దాఖలు చేసారా? అసలు భాగ్యలక్ష్మీని పెళ్లిచేసుకొమ్మని అన్నమ్మ ఎందుకు ఒత్తిడి చేసింది? బాచికి, భాగ్యలక్ష్మీ కుటుంబానికి, అన్నమ్మకు ఏంటి సంబంధం? అనే అంశాలను వెండితెర మీద చూడాల్సిందే.
మాస్ హీరో విశాల్ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్‌టైనర్ ‘రాయుడు’. విశాల్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. పూర్తిస్థాయి లవ్, మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో విశాల్ కు జోడిగా శ్రీదివ్య హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్:
రాయుడు పాత్రలో విశాల్ సరిగ్గా ఒదిగిపోయాడు. కూలీగా చాలా మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు. తన నటన, డైలాగ్స్ తో ఇరగదీసాడు. ఇక యాక్షన్ సీన్లలో దుమ్ముధులిపేసాడు. భాగ్యలక్ష్మీ పాత్రలో శ్రీదివ్య చాలా బాగుంది. సినిమాకు కాస్త గ్లామర్ ను తీసుకురావడంతో పాటుగా ముఖ్యంగా తన నటనతో బాగా ఆకట్టుకుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం వున్న అమ్మాయిగా బాగుంది. అన్నమ్మ పాత్రలో లీల సినిమాకే హైలెట్ అని చెప్పుకోవచ్చు. తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగా చేసారు.
మైనస్ పాయింట్స్:
తమిళ డబ్బింగ్ సినిమా కాబట్టి.. అక్కడక్కడా కాస్త తమిళ సినిమా అన్నట్లుగా కనిపిస్తుంది. ఇక డి.ఇమాన్ సంగీతం అందించిన పాటలు అంతగా ఆకట్టుకోలేవు. కామెడీ కూడా అంతంత మాత్రంగానే అనిపించింది. పూర్తిస్థాయి మాస్ యాక్షన్ సినిమాగా రూపొందడంతో ఫ్యామిలీతో చూడాలనుకునే ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. మాస్ బాగా ఎక్కువయ్యింది.
సాంకేతికవర్గం పనితీరు:
సింపుల్ స్టోరీ లైన్ ను తీసుకుని పూర్తిస్థాయి కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడు దర్శకుడు ముత్తయ్య. మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చే విధంగా ‘రాయుడు’ను తీర్చిదిద్దారు. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందించి అదరగొట్టేసాడు. కానీ కథలో కాస్త ట్విస్టులు పెట్టి వుంటే సినిమా రేంజు మరింత పెరిగిపోయేది. సినిమాటోగ్రఫి బాగుంది. ఇమాన్ అందించిన పాటలు పర్వాలేదు. కానీ రీరికార్డింగ్ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
‘రాయుడు’: పక్కా మాస్ యాక్షన్ సినిమా.