గౌతమ్ (నాని) ఓ సరదా కుర్రాడు. తొలి చూపులోనే కేథరిన్ (నివేదా థామస్) ప్రేమలో పడతాడు. కేథరిన్ కూడా గౌతమ్‌ని ప్రేమిస్తుంది. విఎఫ్‌ఎక్స్ నిపుణురాలైన కేథరిన్ తన ఉద్యోగం రీత్యా ఒక నెలలో తిరిగొస్తానని చెప్పి లండన్‌కి వెళుతుంది. తిరుగు ప్రయాణంలోనే ఐశ్వర్య (సురభి)ను కలుస్తుంది. ఆమెకు అప్పటికే పెళ్లి నిశ్చయమై ఉంటుంది. ఇద్దరూ ఒకరి ప్రేమకథని మరొకరు చెప్పుకొంటారు.
అయితే, ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే నాని వెళ్లి ఐశ్వర్యని రిసీవ్ చేసుకొంటాడు. ఐశ్వర్య నాక్కాబోయేవాడు జై రామ్ (నాని) అని చెప్పాను కదా, ఇతనే అని కేథరిన్‌కి పరిచయం చేస్తుంది. మరి గౌతమ్‌కి (నాని) కి కేథరిన్ పై ఉన్న ప్రేమ ఎలాంటిది ? కేవలం టైం పాస్ ప్రేమా ? లేక నిజంగా ఐశ్వర్యని రిసీవ్ చేసుకొంది గౌతమేనా అదే పోలికలతోనే ఉన్న మరో వ్యక్తినా ? గౌతమ్‌కి, జైకీ మధ్య ఏమైనా సంబంధముందా? అసలు గౌతమ్ ఎవరు ? జై రామ్ ఎవరూ ? ఇద్దరూ వేరు వేరా ? లేక ఒకరేనా అనే సస్పెన్స్ ని తెరపైనే చూడాలి.
ఒక రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సీరియస్‌గా సాగే సగటు థ్రిల్లర్ చిత్రాలకి భిన్నంగానే ఉంటుంది. తొలి సగభాగం రెండు ప్రేమకథలతో హాయిగా సాగిపోతుంది. కథ చెప్పకపోయినా ఫస్ట్ హాఫ్ అంతా ఎంటరైటైనింగ్ గా ఉంటుంది. ఒకే పోలికలతో ఇద్దరిని చూపించడం.. అసలు వీళ్లు ఇద్దరా ఒకరా? కాదా ? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో రేకెత్తించడం మినహా తొలి సగభాగంలో కథ ముందుకు కదలదు. విరామం ముందు వచ్చే సన్నివేశాలతోనే అసలు కథ మొదలవుతుంది.
నాని డ్యూయల్ రోలా ? సింగిలేనా అని తెలిసిన తర్వాత ప్రేక్షకులు కథలో లీనమవుతారు. తొలి సగభాగం వచ్చే సన్నివేశాల్లో గౌతమ్.. కేథరిన్‌ల మధ్య ప్రేమకథ చాలా బాగుంటుంది. ఐశ్వర్య-జైల ప్రేమకథే కాస్త నత్తనడకన సాగినట్టు అనిపిస్తుంటుంది. అక్కడక్కడ సున్నితమైన మాటలతో వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు.
ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్ టైనింగ్ గా సినిమాని తీశాడు దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. సినిమాలో కథలో లీనమయ్యే దశలో ఖచ్చితంగా కథవైపుకి నడిపించాడు దర్శకుడు. కొడైకెనాలో సన్నివేశాలను చాలా అందంగా చిత్రీకరించారు. సినిమాలో నాని యాక్టింగ్ ప్లస్ పాయింట్. సురభి చాలా చక్కగా నటించింది. అందంగా కనిపిస్తుంది. జర్నలిస్ట్ పాత్రలో శ్రీముఖి జీవించేసింది. హీరోయిన్ కి , శ్రీముఖి కి వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకే మంచి ప్లస్ పాయింట్.
మైనస్ పాయింట్స్ :
సినిమా కథలోకి డైరెక్టర్ నేరుగా ప్రవేశించకుండా అక్కడక్కడే కథని తిప్పుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలకి ఉత్కంఠభరితమైన సన్నివేశాలను వేసుకోవాలి. కానీ ఆ విషయంలో డైరెక్టర్ పట్టు తప్పిందనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సీన్స్ కదులుతుంటాయి. సినిమాలో మ్యూజిక్ మరింత బాగుంటే సినిమాకి మంచి బలాన్నిచ్చి ఉండేది. ఇలాంటి ధ్రిల్లింగ్ సినిమాలు తీసేటపుడు ప్రేమకథలను ఎక్కువసేపు చెప్పకూడదు. కానీ, దర్శకుడు లవ్ ట్రాక్ పైనే సినిమాని నడిపించాడు. ఆ ఎపిసోడ్స్ ప్రేక్షకులను కొంచెం బోర్ ని కలిగించాయి. దీనిపై మరింత హోమ్ వర్క్ చేస్తే బాగుండేదనిపిస్తుంది.
విశ్లేషణ :
ఓవరాల్ గా సినిమా ప్రేక్షకులను థియేటర్స్ లో కట్టిపారేస్తుందనే చెప్పాలి. ప్రచార చిత్రాల్లో హీరోనా? విలనా? అన్న ప్రశ్నకు తగ్గట్టుగానే నాని పాత్ర సాగుతుంది. అతనిలో అసలు కోణమేంటో చివరిదాకా తెలియదు. ఆ విషయాన్ని గుప్పెట్లో ఉంచుతూ కథని నడిపిన విధానంలోనే దర్శకుడి పనితనం తెలుస్తుంది. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాథ లాంటి సినిమాల తర్వాత నాని అభిమానులు బాగా పెరిగిపోయారు. అలాంటి అంచనాలతో ఈ సినిమాకి వెళ్లకుండా ఒక మంచి సినిమా చూడాలంటే మాత్ర ఖచ్చితంగా వీకెండ్ లో చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా కంప్లీట్ దర్శకుడి ధ్రిల్లింగ్ ప్రేమకథ.
- పరిటాల మూర్తి