తన ముందు మూడు తరాలు పోలీస్ వాళ్లే కావటంతో తాను ఎస్సై అయ్యేందుకు తెగ కష్టపడుతుంటాడు రామారావు (సందీప్ కిషన్). అయితే పోలీస్ అయ్యేందుకు అతను చేసిన ప్రయత్నాలను చివరి నిమిషంలో ఓ వ్యక్తి మూలంగా చేజారుతాయి. అలాంటి పరిస్థితుల్లో జీవితాన్నే చాలించాలనుకున్న అతడు, ఓ కానిస్టేబుల్(శివాజీ రాజా) మూలంగా మనసు మార్చుకుంటాడు. సోసైటీకి సేవ చేయాలంటే పోలీస్ కానక్కర్లేదని డిసైడ్ అయ్యి పోలీస్ యూనిఫామే వేసుకుని డ్యూటీ చేస్తుంటాడు. అయితే ఆ యూనిఫామే అతన్ని చిక్కుల్లో పడవేస్తుంది. ఇంతకీ ఆ డ్రెస్సు వెనకాల ఉన్న కథేంటి? దాని వల్ల రామారావు జీవితం ఎలా మలుపు తిరిగింది? అన్నదే కథ.
సీనియర్ డైరక్టర్లంతా షెడ్డుకు వెళ్లిపోతుంటే ఎలాగైనా హిట్ కొట్టాలన్న తపనతో సినిమాలు తీస్తూనే వస్తున్నాడు కృష్ణ వంశీ. గత చిత్రం పైసా అతి కష్టం మీద రిలీజ్ కాగా, ఇప్పుడు నక్షత్రం
విషయంలోనూ అదే రిపీట్ అయ్యింది. అయితే మొత్తానికి ఎలాగోలో కష్టాల నుంచి బయటపడ్డ ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయ్యింది. ఈ క్లాసిక్ దర్శకుడితోపాటు మిగతా వాళ్లకి కూడా సినిమా హిట్ అవసరం. ఫలితం ఎలా ఉందో రివ్యూ చూద్దాం.
విశ్లేషణ:
ఒక్క గులాబీని మినహాయించి తన సినిమాల్లో పెద్ద ఎత్తున్న కాస్టింగ్; ఎమోషనల్ సన్నివేశాలు, లీడింగ్ కాస్టింగ్ తో ఇలా సాగిపోతూ ఉంటుంది. కానీ, నక్షత్రం మాత్రం ట్రైలర్ తోనే స్టోరీ ఏంటో అర్థమైపోయింది. అలాంటప్పుడు కనీసం ఖడ్గం తరహా ఎమోషనల్ సీన్లు ఏవైనా పెట్టాడా? అన్న ఆశతో వెళ్లిన అభిమానికి అసలు వంశీ ఎలాంటి సినిమా తీశాడో అర్థంకాక తలలు పట్టుకుంటారు. అసలు ఏ మాత్రం విషయం లేని సినిమాను ఎక్స్ పోజింగ్ అనే మసాలా తో పూర్తిగా నింపి పడేశాడు ఈ క్లాసిక్ దర్శకుడు.
ఓ సీన్ లో రామారావు పోలీస్ డ్రెస్ పై నేమ్ ప్లేట్ చూసి అది అలెగ్జాండర్(సాయి ధరమ్ తేజ్) అనుకుని పోలీసులు అతన్ని ట్రేస్ చేయడానికి వెంటపడుతుంటారు. మరో సీన్ లో ప్రకాశ్ రాజ్ పోలీసుల గురించి చెప్పే డైలాగులు వింటే ఇలాంటి అవుట్ డేటెట్ ఫార్ములాను మరి దారుణంగా తీశాడనే ఒపీనియన్ కలుగుతుంది. కేవలం పోటాపోటీ అందాల కోసమే హీరోయిన్లను వాడుకున్నాడేమో అనిపించకమానదు. పోనీ.. కీ రోల్, సంజయ్ దత్ చేయాల్సింది సాయి ధరమ్ తో చేయించామని చెప్పిన పోలీస్ పాత్ర ఏమన్నా పవర్ ఫుల్ గా ఉందా? అంటే అది వర్ణనాతీతం.
సందీప్ కిషన్ తన వరకు పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఒకటి రెండు సీన్లలో అతి లా అనిపించినప్పటికీ ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం బాగా చేశాడు. శివాజీ రాజా అలెగ్జాండర్ పాత్ర గురించి చెప్పే డైలాగులకు, సాయి ధరమ్ తేజ్ పాత్రకు పొంతనే ఉండదు. అంతగా ప్రాధాన్యం లేని పాత్ర అది. ప్రగ్న్యా, రెజీనాలు గ్లామర్ షో కోసమే. అయితే అరుపులతో ప్రగ్య్నా యాక్టింగ్ మాత్రం ఇరిటేట్ చేస్తుంది. ప్రకాశ్ రాజ్ రెగ్యులర్ రోల్. తనీష్ బాగా చేసినప్పటికీ, లీడ్ విలన్ చేసేంత స్కోప్ లేదేమో అనిపిస్తుంది. శ్రీయా ఐటెంసాంగ్, జేడీ చక్రవర్తి గెస్ట్ రోల్స్ వేస్ట్ అయ్యాయి. మిగతా పాత్రలు ఓకే.
టెక్నికల్ అంశాల విషయానికొస్తే... సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు పని చేయడం విశేషం. పాటలు ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. కెమెరా పనితనం అంతా కృష్ణవంశీ శైలికి తగ్గట్లుగా సాగింది. ఎడిటింగ్ విషయంలో బాగా కోతలు పడాల్సిన పని ఉంది. డైలాగులు చెప్పుకోవాల్సిన పని లేదు. నిర్మాణ విలువలు మాత్రం ఏమంత గొప్పగా అనిపించవు.
తీర్పు:
కథ దగ్గర్నుంచి అన్ని విషయాల్లోనూ ఆయన నిరాశ పరిచారు. ఏదో పాత సినిమా చూస్తున్న భావన కలిగిస్తుంది. ఈ పదేళ్లలో వంశీ తీసిన సినిమాల్లో ఇదే దారుణమైన సినిమా అని చెప్పొచ్చు.
చివరగా.. నక్షత్రం మెరుపులు కాదు కదా టోటల్ గా మాడిపోయింది