గత కొన్నేళ్లుగా చెత్త సినిమాలు తీస్తున్నాడంటూ సీనియర్ నటుడు రాజశేఖర్ పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేయటం చూశాం. మిగతా హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న సమయంలో కూడా ఈ యాంగ్రీ యంగ్ మెన్ మాత్రం ఇంకా హీరోగానే ప్రయత్నాలు చేసి బోల్తా పడ్డాడు. అలాంటి సమయంలో పీఎస్ వీ గరుడ వేగ చిత్రం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్.. దానికి తోడు రాజశేఖర్ కాన్ఫిడెంట్ కూడా కాస్త నమ్మకం కలిగించాయి. మరి చిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న ప్రవీణ్ సత్తారు అందించిన ఈ స్పై థ్రిల్లర్ ఏ మేర అలరించిందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.
విశ్లేషణ
జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు తెలుగులో చాలానే వచ్చినప్పటికీ.. ప్రేక్షకులను అందులో లీనం అయ్యేలా చేసినవి చాలా అరుదనే చెప్పాలి. పీఎస్ వీ గరుడ వేగ కూడా ఆ కోవలోనిదే. మూల కథలోకి ప్రవేశించాక తర్వాత ఏం జరగబోతుంది? అన్న ఎగ్జయిట్ మెంట్ ప్రేక్షకుడిలో పెరిగిపోతుంది. సెకండాఫ్ లో కథ నిదానించినప్పటికీ, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో దర్శకుడు మళ్లీ పీక్స్ లోకి తీసుకెళ్లాడు. అయితే ముగింపు పరమ రోటీన్ గా ఉండటమే కాస్త నిరాశ పరుస్తుంది.
దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ అధికారులు ఎలా ఉంటారు? వారి మిషన్లు ఎలా కొనసాగిస్తారు? అణు ఆయుధాలు.. వాటికి ఉపయోగించే పరిజ్నానం తదితర విషయాలను దర్శకుడు ప్రవీణ్ చాలా అధ్యయనం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. టెక్నికల్ అంశాల పరంగానే కాదు.. హీరో-విలన్ మధ్య జరిగే గేమ్ ను కూడా ఆద్యంతం ఆసక్తికరంగా మలిచాడు. అయితే అన్నీ హీరోకే అనుకూలంగా జరుగుతుండటం.. పైగా కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఇరికించకపోవటం గరుడ వేగలో మైనసలనే చెప్పాలి. కానీ, స్పై థ్రిల్లర్ ను ఇష్టపడే వాళ్లకి మాత్రం ఖచ్ఛితంగా చూడాల్సిన సినిమా ఇది.
నటీనటుల విషయానికొస్తే... రాజశేఖర్ కు ఇది ముమ్మాటికీ కమ్ బ్యాక్ సినిమానే. ఇలాంటి సమయంలో అసలు ఆయన నుంచి ఇలాంటి సినిమా ఆశించటం చాలా కష్టం. యాక్షన్ సీన్లలో ఆయన చాలా కష్టపడ్డాడు. పోలీస్ పాత్రలంటే చెలరేగిపోయే రాజశేఖర్ గత చిత్రాలతో పోలిస్తే ఇందులో చాలా మంచి నటనే అందించారు. హీరోయిన్ పూజా కుమార్ ది పరిమితమైన పాత్ర. అప్పుడెప్పుడో జెనీలియాతో కథ అనే ఓ చిత్రంలో నటించిన హీరో అదిత్ ఓ కీలక పాత్రలో నటించాడు. నాజర్, రవివర్మ, చరణ్ దీప్ పాత్రలు ఓకే. అయితే సినిమాకు హైలెట్ అవుతుందనుకున్న విలన్ కిషోర్ ఫాత్ర మాత్రం పెద్దగా పేలకపోవటం విశేషం. సన్నీ ఐటెం సాంగ్ కూడా అంత బాగా లేదు. పైగా సినిమా ఫ్లోకు అడ్డుగా మారింది. పోసాని, అలీ, థర్టీ ఇయర్స్ పృథ్వీ కామెడీ ఫర్వాలేదు.
టెక్నికల్ విషయానికొస్తే... ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఉనప్పటికీ చిత్రంలో కేవలం రెండే పాటలు ఉన్నాయి. అవి ఫర్వాలేదనిపిస్తాయి. కానీ, చిత్రానికి కీలకంగా మారిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం శ్రీచరణ్ పాకాల-భీమ్స్ చెలరేగిపోయారు. ఛాయాగ్రహణం కొన్ని చోట్ల ఫర్వాలేదనిపించింది. రాజశేఖర్-ప్రవీణ్ సత్తార్ కాంబోపై నమ్మకంతో ముందుకొచ్చి భారీ బడ్జెట్ పెట్టిన నిర్మాతను అభినందించాలి. హాలీవుడ్ సినిమాను తలపించే యాక్షన్ సన్నివేశాలు అందించటంలో టెక్నీషియన్ల పనితీరు అద్భుతం.
తీర్పు..
దర్శకుడు ప్రవీణ్ సత్తార్ హై వోల్డేజ్ యాక్షన్ థ్రిల్లర్ ను అందించాడు. స్క్రీన్ ప్లే విషయంలోనూ ఆకట్టుకున్నప్పటికీ అక్కడక్కడా ఆ స్థాయి అందుకోలేకపోయింది. ఓవరాల్ గా అన్ని వర్గాల ప్రేక్షకుడికే కనెక్ట్ అయ్యే థ్రిల్లర్ మూవీనే అందించాడు.
చివరగా.. గరుడ వేగ... హై ఎమోషనల్ థ్రిల్లర్