బ్రహ్మానందం తోటి అర్చక బృందంతో కలిసి హోమాలు, వ్రతాలు జరుపుతుంటాడు. అతని వద్ద మంచు విష్ణు శిష్యుడిగా కొనసాగుతుంటాడు. ఈ క్రమంలో పెద్దాయన కోటా శ్రీనివాస్‌రావు ఇంట్లో హోమం చేస్తుండగా అమెరికా నుంచి వచ్చిన ప్రగ్యా జైశ్వాల్ ను చూసి మంచు విష్ణు మనసు పారేసుకుంటాడు. ఇంతలో హోమం వద్ద చోటుచేసుకున్న ఓ సంఘటనతో అర్చక బృందం అపాయంలో పడుతుంది. ప్రాణాలు కాపాడుకునేందుకు మంచువిష్ణు తన గురువు బ్రహ్మానందాన్ని ఒప్పించి అమెరికాకు బయలుదేరతాడు. మరి అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? అర్చక బృందం అపాయంలో పడటానికి కారణం ఏంటి? కృష్ణమాచార్య, రేణుక ప్రేమ ఫలించిందా? లేదా? తదితర విషయాలను తెరపై చూడాలి.
నవ్వులు పండేందుకు అణువైన కథ అయినా అందుకు తగ్గట్టుగా మాత్రం హస్యం పండకపోవడంతో సాదాసీదా చిత్రంగా మిగిలిపోతుంది. కథా కథనాల పరంగా కూడా లాజిక్‌లను పట్టించుకోకుండా చిత్రాన్ని రూపోందించాడు దర్శకుడు. ఆరంభ సన్నివేశాలు మామూలుగానే మొదలైనా ఆచారి యాత్ర అమెరికాకు చేరుకున్నాకే నవ్వులు షురూ అవుతాయి.
బ్రహ్మానందం, సత్య కృష్ణన్ ల కామెడీ ట్రాకులతో పాటు విష్ణు, బ్రహ్మానందం, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్ తదితరులు చేసే సందడితో సన్నివేశాలు పరుగుపెడతాయి. ఆచారి బృందం అమెరికాలో ఉందని తెలిశాక వాళ్లను వెంటాడేందుకు ప్రతినాయక బృందం బయలుదేరుతుంది. అక్కడి నుంచి ద్వితీయార్థం మొదలవుతుంది.
రేణుకకి తన వాళ్లతోనే పొంచి ఉన్న ముప్పు నుంచి కృష్ణమాచార్య తన తెలివి తేటలతో కాపాడే విధానం..దేశం కాని దేశంలో ప్రతినాయకుడి నుంచి తప్పించుకునేందుకు ఆచార్య బృందం పడే ఆపసోపాలు నవ్వులు పంచుతాయి. ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థంలో కామెడీ బాగా తగ్గినట్లు అనిపిస్తుంది. పృథ్వీతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు తెరపైకి వచ్చినా నవ్వులు మాత్రం పండవు. పతాక సన్నివేశాలు కూడా పెద్దగా ఆసక్తి కలిగించకుండానే ముగుస్తాయి.
నటీనటుల విషయానికోస్తే..
మంచు విష్ణు తన పాత్రకు తగ్గ న్యాయం చేశారు. కామెడీ పండించే ప్రయత్నం చేశాడు కానీ క్యారెక్టరైజేషన్ బలంగా లేకపోవడంతో ఆ పాత్ర, ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. ఇలాంటి పాత్రలను తెలుగు హీరోలు చాలా సినిమాల్లో చేసేశారు. కాబట్టి ప్రేక్షకుడి ఇందులో కొత్తదనం కనపడదు. ప్రగ్యాజైశ్వాల్ పాత్రలో పెర్ఫామెన్స్‌కు స్కోప్ లేదు. ఆమె పాత్రకు ఆమె న్యాయం చేసింది. ఇక బ్రహ్మానందం కామెడీ నవ్వించేంత సూపర్బ్‌గా లేదు కానీ.. విసుగెత్తించేంతగా ఉంది. సత్య కృష్ణన్ ల కామెడీ ట్రాకు బాగుండి.
టెక్నికల్ అంశాలకు వస్తే..
సాంకేతికంగా సినిమా బాగుంద అని చెప్పడం కన్నా రోటిన్ చిత్రాల మాదిరిగానే వుందని చప్పడం బాగుంది, అయితే అమెరికా, మలేషియా, హైదరాబాద్ లోని పలు సన్నివేశాలను చాయాగ్రహకుడు అందంగా చిత్రీకరించాడు. అయితే కథ, కథనంలో కొత్తదనం లేకపోవడమే అన్నింటికీ కారణమవుతుంది. చిత్రంలో బోర్ కొట్టే సన్నివేశాల నేపథ్యంలో ప్రేక్షకుడు తన దృష్టిని అసాంతం చిత్రంపై నిలువలేకపోతున్నాడు. తమన్ తనదైన బాణీలను, సంగీతాన్ని అందించాడు.
తీర్పు:
సిల్లీ ప్లాట్, లాజిక్ లేని సన్నివేశాలు.. నవ్వించేంత కామెడీ లేకపోవడం పూర్ స్క్రిప్ట్, ఎమోషనల్‌గా, కామెడీ పరంగా ఆకట్టుకునే సన్నివేశాలు లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. ఆచారి అమెరికా యాత్రలో కామెడీ ఆశించిన స్థాయిలో ఉండదు. ఇలాంటి కథ, కథనాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. మరి దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఈ సినిమాను చేయడానికి కారణమేంటో ఆయనకే తెలియాలి. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకుడు ఎలా అదరిస్తారో వేచి చూడాలి.
చివరగా.. కొత్తదనం లేని, నవ్వులు పూయని చిత్రంగా మిగిలింది..