`మన్మధుడు` సీక్వెల్ ప్రీక్వెల్ కాని కథతో అదే జోనర్ లో `మన్మధుడు 2` తీస్తున్నామని నాగార్జున ముందే చెప్పారు. ఇదో ఫన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని అన్నారు. లేటు వయసు ఘాటు రొమాన్స్ ను తెరపై వడ్డిస్తున్నామని ఫ్రెంచి సినిమా థీమ్ ని తెలుగైజ్ చేశామని వెల్లడించారు. అయితే తెరపై రకుల్‌తో లేటు వయసు రొమాన్స్ జనాలకు ఎంతవరకూ కనెక్టయ్యింది? సినిమాలో మ్యాటర్ ఎంత? అన్నది తెలియాలంటే డీప్‌గా రివ్యూలోకి వెళ్లాల్సిందే.
పోర్చుగల్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి సామ్ అలియాస్ సాంబశివరావు (నాగార్జున). ప్రేమపై నమ్మకం కోల్పోయిన అతను తన ఆనందం కోసమే జీవిస్తుంటాడు. మరోవైపు వయసు మీద పడటంతో ఇంట్లోవాళ్లు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంటారు. వాళ్ల మాటల్ని పెడచెవిన పెట్టి జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు సామ్.
అయినా కుటుంబం నుంచి ఒత్తిడి తగ్గకపోవడంతో అవంతిక (రకుల్‌ప్రీత్ సింగ్)ని ప్రేమిస్తున్నానని ఆమెని తీసుకొచ్చి పరిచయం చేస్తాడు. పెళ్లి రోజున చెప్పా పెట్టకుండా వెళ్లిపోయేలా ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. తనకున్న సమస్యల కారణంగా అందుకు ఒప్పుకుని ఇంటికొచ్చిన అవంతిక... సామ్ కుటుంబసభ్యులకి దగ్గరవుతుంది. ఆ కాంట్రాక్ట్ ముగిసిన తరువాత అవంతిక సామ్ కు దగ్గరైయ్యిందా.? లేదా.? అన్నది వెండితెరపై చూడాల్సిందే..!
విశ్లేషణ
మన్మధుడు అన్న పేరు వినగానే విజయ్ భాస్కర్ తెరకెక్కించిన క్లాసిక్ గుర్తుకు వస్తుంది. మళ్లీ అలాంటి క్లాసిక్ తీశారా? అన్న ఆశ అభిమానులకు ఉంది. అయితే ఈ విషయంలో కొత్త కుర్రాడు రాహుల్ రవీంద్రన్ తడబడ్డాడనే చెప్పాలి. ఇందులో వెన్నెల కిషోర్ తో ఫన్ ని వర్కవుట్ చేయగలిగినా .. కథాంశాన్ని గ్రిప్పింగ్ గా నడిపించడంలో అతడు తడబడ్డాడు. కథ డ్రైవ్ లో ఫన్నీ సీన్స్ అయితే మాత్రం సినిమా చూసే ప్రేక్షకుడిని ఆధ్యంతం నవ్విస్తాయి.
అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఫర్వాలేదనిపిస్తాయి. పోర్చుగల్ నేపథ్యంలో తీశారు కాబట్టి ఆ బ్యూటీ అబ్బురపరిచింది. పతాక సన్నివేశాల్లో రకుల్- నాగ్ సీన్స్ లో ఎమోషన్ పండింది. కానీ స్క్రీన్ ప్లే పరంగా ఇంకేదో మ్యాజిక్ చేస్తాడని ఆశిస్తే అది కనిపించదు. అయితే నేరేషన్ లో ఏదో మిస్సవుతోంది అన్న భావనా ప్రేక్షకుడిని వెంటాడుతుంది. ఎంచుకున్న లైన్ ఓకే కానీ.. నడిపించిన విధానంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బావుండేది.
నటీనటుల విషాయానికి వస్తే..
ఆరు పదుల వయస్సు దగ్గర పడుతున్నా హాండ్సమ్ లుక్ ను మెంటెయి్ చేసే కొద్ది మంది హీరోలలో అగ్రనటుడు నాగార్జున ఒకరని చెప్పక తప్పదు. ఈ సినిమాలోనే ఆయన టైటిల్ కు తగ్గట్టుగానే స్మార్ట్ గా కనిపించి మరోమారు అమ్మాయిల కలల వీరుడు తానేనని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ చిత్రంలో ఆయన నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ.
ఆయన మధ్య వయస్కుడిని అని గుర్తు చేస్తూనే ప్లేబాయ్ పాత్రలో ఆకట్టుకున్నారు. లేటు వయస్సులో ఘాటు ప్రేమను తెరపై పండించడంలో ఆయన నటన సహజంగానే ప్రేక్షకులను అకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, భావోద్వేగాలు కూడా చక్కగా పండించారు. వెన్నెల కిషోర్ కథానాయకుడితోపాటే కనిపిస్తూ చక్కటి వినోదాన్ని పండించారు. కామెడీ విషయంలో ఆయనకే ఎక్కువ మార్కులు పడతాయి.
స్వతంత్రంగా బ్రతికే ఒక బలమైన యువతిగా రకుల్ నటన ఆకట్టుకుంటుంది. మునుపటితో పోలిస్తే ఎంతో పరిణతితో నటించింది. ఆమె నేటితరం అమ్మాయిగా కామెడీ పండిస్తూనే, అందులో భావోద్వేగాల్ని కూడా చక్కగా పండించారు. ఇక గ్లామర్ పరంగానూ యూత్ కి ట్రీటిచ్చిందనే చెప్పాలి. వెన్నెల కిషోర్ అద్భుతమైన టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించాడు. అతిథి పాత్రల్లో కీర్తి సురేశ్, సమంత మెరుస్తారు. లక్ష్మి, ఝాన్సీ, దేవదర్శిని పాత్రల పరిధి మేరకు నటించారు. రావు రమేష్ తమ పరిధికి తగినట్లుగా నటించి మెప్పించారు.
టెక్నికల్ అంశాలకు వస్తే..
నిర్మాణ విలువల పరంగా క్వాలిటీగా ఉంది. చైతన్ భరద్వాజ్ సంగీతం, సుకుమార్ కెమెరా పనితనం చిత్రానికి ప్రధానబలం. ముఖ్యంగా పోర్చుగల్ అందాల్ని సుకుమార్ కెమెరాలో బంధించిన తీరు ఆకట్టుకుంటుంది. దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ తొలి సినిమా కావడం.. అందులోనూ నాగార్జున వంటి అగ్రహీరోతో చిత్రీకరణ చేయడంలో కాసింత తగబడ్డాడని చెప్పక తప్పదు. తనది కాని కథ అయినప్పటికీ దాన్ని బాగా అర్థం చేసుకున్నారు.
అయితే సినిమాకు నాగార్జున- వెన్నెల కిషోర్ మధ్య నడిచే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుబుబ్బ నవ్విస్తుంది. సున్నితమైన అంశాల్ని డీల్ చేయడంలోనూ తానెంత పర్‌ఫెక్టో చాటిచెప్పారు దర్శకుడు. అక్కడ ఈ సినిమాకి దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్‌ని నాగ్ ఎందుకు ఎంచుకున్నారో మరింత బాగా అర్థం అవుతుంది. సుకుమార్ సినిమాటోగ్రఫీ ప్లస్. మిగతా విభాగాలు ఓకే. దర్శకుడిగా రాహుల్ మరింత బెటర్‌మెంట్ చూపించాల్సి ఉంటుంది.
తీర్పు..
లేటు వయస్సులో ఘాటు ప్రేమను అందుకున్న మన్మథుడు పర్వాలేదనిపించాడు..
చివరగా... ముదిరిన బెండకాయ రోమాన్స్ ఆకట్టుకుంటుంది..!