అర్జున్ అలియాస్ రామకృష్ణ(గోపీచంద్) ఒక బ్యాంకు ఉద్యోగి. పైకి బ్యాంకు ఉద్యోగిలా కనిపించే రామకృష్ణ విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడే ‘రా’ ఏజెంట్. అర్జున్‌తో పాటు మరో నలుగురు ఒక బృందంగా అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటారు. కరాచీలో దాక్కొని, భారతదేశంపై దాడి చేయాలనుకుంటున్న ఒక తీవ్రవాదిని పట్టుకోవడానికి అర్జున్ అతని టీమ్ ప్రయత్నిస్తుంటుంది.
అయితే, ఆ విషయాన్ని ముందే గమనించి, తీవ్రవాదులు అర్జున్ టీమ్ లోని మిగిలిన నలుగురిని కిడ్నాప్ చేస్తారు. ఆ నలుగురిని రక్షించడానికి అర్జున్ ఒక్కడే కరాచీ వెళ్తాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి, వారిని ఎలా రక్షించాడు? ఆ తీవ్రవాది నుంచి దేశాన్ని ఎలా కాపాడాడు? అన్నదే ‘చాణక్య’ కథ. మరి ‘చాణక్య’ ఆకట్టుకుందా? గోపిచంద్‌కు హిట్ ఇచ్చిందా?, ఈ స్పై థ్రిల్లర్ ఎలా ఉంది? అన్న విషయం వెండితెరపైనే చూడాలి.
విశ్లేషణ
ఇదో స్పై థ్రిల్లర్. ‘రా’ అధికారుల పనితీరు ఎలా ఉంటుంది? వాళ్ల గూఢచార్య నైపుణ్యాలు ఏంటి? దేశాన్ని కాపాడటానికి వాళ్లు ఏం చేస్తారు? ఎంతకు తెగిస్తారు? అన్న అంశాలను స్పృశిస్తూ, ఒక కమర్షియల్ సినిమాను తీసే ప్రయత్నం చేశారు. గూఢచారి తరహా కథలు ఎప్పుడూ ఉత్కంఠ కలిగిస్తాయి. సరైన స్క్రీన్‌ప్లే, మలుపులు తోడైతే, ఆ ప్రయత్నం మరింత ఆకట్టుకుంటుంది. చాణక్యలోనూ అలాంటి అంశాలు కనిపిస్తాయి. ఈ కథను ఒక యాక్షన్ ఎపిసోడ్‌తో ప్రారంభిస్తారు.
కరాచీలో బంధించబడిన నలుగురు స్నేహితులను కాపాడటానికి హీరో చేసే ప్రయత్నాలు ఈ కథకు మూల స్తంభాలుగా నిలుస్తాయి. అయితే, వాటి చుట్టూ, సన్నివేశాలను ఆసక్తిగా, ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బాగుండేది. ప్రథమార్ధంలో బ్యాంకు ఉద్యోగి రామకృష్ణ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడికి బోరు కొట్టిస్తాయి. మెహరీన్‌తో లవ్ ట్రాక్, వినోదం కోసమే సృష్టించిన ఆయా సన్నివేశాలు ఇబ్బంది కలిగిస్తాయి. కామెడీ లేకపోగా పంటి కింద రాయిలా తగులుతాయి. విశ్రాంతి ముందు వరకూ కథలో ఎలాంటి అలజడి ఉండదు. విశ్రాంతి తర్వాత దర్శకుడు కథను ట్రాక్ ఎక్కించాడు.
కరాచీ వెళ్లి తన స్నేహితులను ఎలా కాపాడాడన్నది ద్వితీయార్ధం. అక్కడ ఆపరేషన్ ఆసక్తికరంగా ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్లేది. ఈ చాణక్య టైటిల్ కు తగ్గట్టు కథానాయకుడు తన తెలివితేటలను ఎలా ప్రదర్శించాడు. ఎలా కిడ్నాప్ అయిన అధికారులను అక్కడి నుంచి తప్పించాడన్న విషయంలో మాత్రం హీరోయిజం కానీ, కనీసం టైటిల్ ను సార్థకం చేసుకున్నది మాత్రం ఏమీ లేదన్నట్లుగానే సాగింది.
కాగా, చాణక్య పేరు పెట్టుకున్నతరువాత కూడా హీరో తెలివి తేటలు ప్రదర్శించకపోవడంతో ఆ సన్నివేశాలన్నీ కాస్త దారి తప్పాయి. అయితే, పతాక సన్నివేశాలు మాత్రం థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. అక్కడ దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ ఈ చిత్రానికి ఆయువు పట్టు, ఆయా సన్నివేశాలు ప్రేక్షకుడిని ఉత్కంఠతో ఊపేస్తాయి. యాక్షన్ సన్నివేశాలు, వాటిని తెరకెక్కిన విధానం, లొకేషన్‌లు ఇవన్నీ మాస్‌కు బాగా నచ్చుతాయి.
నటీనటుల విషాయానికి వస్తే..
యాక్షన్ హీరో ఇమేజ్ ఉన్న గోపీచంద్ కు మరోసారి తన శైలికి తగిన పాత్ర దొరికింది. ‘రా’ అధికారిగా చాలా నిజాయతీగా కనిపిస్తారు. బ్యాంకు ఉద్యోగిగా అమాయకత్వం ప్రదర్శిస్తారు. యాక్షన్ సీన్లను ఎప్పటిలాగే చురుగ్గా చేశారు. పెద్ద పెద్ద స్టార్లే కమర్షియల్ హంగులు వీడి కొత్త తరహా కథల వైపు అడుగులేస్తుంటే గోపీచంద్ ఇంకా ఇలాంటి కథలే ట్రై చేయడం ఆశ్చర్యకరం. ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే.. రా ఏజెంట్ గా గోపిచంద్ లుక్ కూడా పెద్దగా సెట్ కాలేదు.
మెహ్రీన్ పిర్జాదా పాత్ర పరమ రొటీన్ గా అనిపిస్తుంది. ఒక క్యారెక్టరైజేషన్ అంటూ ఏమీ లేని పాత్రలో ఆమెను ఎంతమాత్రం గుర్తుంచుకునే అవకాశాలు లేవు. పాటల్లో కొంచెం గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆమె పాత్ర పరిమితం. ఆమె ఒక లవ్ ట్రాక్, పాటలకే పరిమితం అయింది. కథానాయిక పాత్రకంటే జరీన్‌ఖాన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అర్జున్ కు సహకరించే ఆ పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంటుంది.
విలన్ పాత్రలో రాజేష్ ఖట్టర్ చేసిందేమీ లేదు. ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేనివారు కావడంతో ఆయా పాత్రల్ని ప్రేక్షకులు ఆకళింపు చేసుకోవడం కష్టమవుతుంది. అతడితో పోలిస్తే ఉపేన్ పటేల్ పర్వాలేదనిపించాడు. నాజర్ స్థాయికి తగ్గ పాత్ర దక్కలేదు. సునీల్ ఉన్న కాసేపట్లో అసలేమాత్రం నవ్వించలేకపోయాడు. రఘుబాబు పర్వాలేదు. ఆలీ తన మార్కు డబుల్ మీనింగ్ డైలాగులతో రొటీన్ కామెడీ చేశాడు.
టెక్నికల్ అంశాలకు వస్తే..
దర్శకుడు తిరు ఎంచుకున్న నేపథ్యం కొత్తది. అయితే, దానికి బలం చేకూర్చే సన్నివేశాలు ఇంకొన్ని రాసుకుని ఉంటే బాగుండేది. ‘చాణక్య’ టైటిల్ కు తగినట్లు సన్నివేశాలు లేవు. చాణుక్యుడి చాతుర్యం (తెలివితేటు) ప్రధర్శించకపోవడం కొంత మైనస్. ఒకటి రెండు ట్విస్ట్‌లు మినహా మిగిలిన సన్నివేశాలు సాదాసీదాగా, ముందుగా ప్రేక్షకుడి ఊహించినట్లుగానే సాగుతాయి. నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం.
ప్రేమకథలకు మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ చేసే విశాల్ చంద్రశేఖర్ ను ‘చాణక్య’ లాంటి కమర్షియల్ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాదు. అతను తన శైలిలోనూ పాటలు చేయలేదు. అలాగని మంచి మాస్ పాటలూ ఇవ్వలేదు. రెంటికీ చెడ్డ విధంగా ఇచ్చిన పాటల్లో ఏదీ అంతగా ఆకట్టుకోలేదు. శ్రీచరణ్ పాకాల.. ‘గూఢచారి’.. ‘ఎవరు’ స్టయిల్లోనే మ్యూజిక్ చేశాడు కానీ.. అది ఈ సినిమాలో సింక్ అవలేదు.
వెట్రి ఛాయాగ్రహణం సినిమాకు అదనపు బలం. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. అనిల్ సుంకర బాగానే ఖర్చు పెట్టాడు. నిర్మాణ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెరపై భారీదనం కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల కోసం, లొకేషన్ల కోసం చాలా ఖర్చు పెట్టారు. అబ్బూరి రవి తన మాటల గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఇవ్వలేదు. ఇక గోపిచంద్ కు రాసిన డైలాగ్స్ కూడా పెద్దగా పేలలేదు.
తీర్పు..
‘చాణక్య’ స్పై థ్రిల్లర్ చిత్రానికి కావాల్సిన ఉత్కంఠ.. మాస్ డైలాగ్స్, ఎత్తుకు పైఎత్తు వేసే తెలివితేటలు లేని చిత్రం..
చివరగా... చాతుర్యం ప్రదర్శించిన ‘చాణక్య’..!