కుటుంబ కథా చిత్రాలంటే.. అందులోనూ పండగ సీజన్లో అంటే తెలుగు ప్రేక్షకులు చాలా బాగా అదరిస్తారు. తెలిసిన కథే అయినా కథనంలో కొత్తదనం వుంటే చాలు.. ఆదరణకు కొదవుండదు. ఫ్యామిలీ అడియన్స్ ను కట్టేయడంతో పాటు తన మార్కు ఆ జోనర్ లో కూడా చూయించాలని భావించిన దర్శకుడు మారుతి.. విజయం కోసం వేచి చూస్తున్న సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తో కలసి చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతిరోజు పండగే ఇవాళ ప్రేక్షకుల ముందకువచ్చింది. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఎలా నటించాడు.. మారుతి ఎలాంటి వైవిద్యం ప్రదర్శించాడు అన్న వివరాల్లోకి ఎంట్రీ ఇచ్చేలోపు అసలు కథ ఏంటంటే..
రఘురామయ్య (సత్యరాజ్)కి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పిల్లలంతా వేర్వేరు చోట్ల స్థిరపడిపోతారు. తాను మాత్రం ఒంటరిగా రాజమహేంద్రవరంలో గడుపుతుంటాడు. అనారోగ్యానికి గురైన రఘురామయ్యకి లంగ్ క్యాన్సర్ అని తేలుతుంది. ఐదు వారాల్లో ఆయన మరణిస్తాడని వైద్యులు చెబుతారు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్న పిల్లలు తాము రెండు వారాల తర్వాత వస్తామని చెబుతారు. కానీ, పెద్ద మనవడైన సాయి (సాయితేజ్) మాత్రం విషయం తెలియగానే తాత దగ్గర వాలిపోతాడు.
మేం ఇప్పుడే రామని చెప్పిన మిగతా కుటుంబ సభ్యులందరినీ ఒప్పించి రాజమహేంద్రవరానికి వచ్చేలా చేస్తాడు. తన తాతయ్య చివరి క్షణాల్లో సంతోషంగా కుటుంబ సభ్యులందరి మధ్య గడపాలని... ఆయన కోరికల్నీ, చేయాలనుకున్న పనులన్నింటినీ పూర్తి చేయించాలని సాయి నిర్ణయిస్తాడు. మరి కుటుంబ సభ్యులు అందుకు సహకరించారా లేదా? తన తాతయ్య కోసం మనవడు ఏం చేశాడు? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
ఆనందంగా.. సంతోషంగా తన వాళ్ల మధ్య తాను ఉన్నప్పుడు మాత్రమే చావును ఆహ్వానించాలని.. చివరి క్షణాలు ఎప్పుడో తెలిపినప్పుడు కూడా ప్రతిరోజును పండగలా గడపాలని భావించే ఒక పెద్దాయన తన కోరికను ఎలా తీర్చుకున్నాడు. తన కోరికను తన మనవడు ఎలా తీర్చగలిగాడు. చివరి రోజులు అనగానే ఎమోషన్స్ తో ముడిపడే సన్నివేశాలు.. వుంటాయని భావిస్తాం. కానీ, దర్శకుడు ఇక్కడే తెలివిగా తన మార్క్‌ని ప్రదర్శించాడు. చావు అంశాన్ని కూడా కామెడీతో ముడిపెట్టి తీశాడు. అదే ఈ సినిమాని ప్రత్యేకంగా మార్చింది.
నిజానికి చాలా సినిమాల్లో చూసిన కథే ఇది. తల్లిదండ్రులు వృద్ధాప్యంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నా, గజిబిజి జీవితాల వల్ల పట్టించుకోని పిల్లల నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. అక్కడ పండింది సెంటిమెంటే. కానీ, మారుతి ఈ సినిమాని వాటికి భిన్నంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ప్రాక్టికల్ మనస్తత్వాల్ని, ‘సంస్కారం’ లేని పాత్రల్ని ప్రవేశపెట్టి వాటి ద్వారా సందర్భోచితంగా కామెడీ రాబట్టే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా రావు రమేష్ పాత్ర సాగే విధానం సినిమాకి ప్రధానబలం. ఫస్టాఫ్‌లో వచ్చే చాలా సన్నివేశాలు అద్భుతంగా వర్కవుట్ అవ్వడమే కాకుండా.. కడుపుబ్బా నవ్వించాయి కూడా.
పూర్తిస్థాయి ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఫస్టాఫ్ తీర్చిదిద్దాడు మారుతి. సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ సీన్.. కుటుంబంలో వచ్చే కామెడీ సన్నివేశాలన్నీ బాగానే అల్లుకున్నాడు మారుతి. అన్నింటికంటే హైలైట్ రాశి ఖన్నా ఏంజిల్ ఆర్నా ట్రాక్. కమెడియన్స్ అవసరం లేకుండా పూర్తిగా రాశిపైనే కామెడీ ట్రాక్ రాసుకున్నాడు మరుతి. రావు రమేష్ కూడా ఈమెకు తోడయ్యాడు. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేకుండా ఇద్దరూ సినిమా అంతా బాగానే నవ్వించారు. కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రం బాగానే వర్కవుట్ అయ్యేలా కనిపిస్తుంది. క్లైమాక్స్ ఎమోషనల్ గా కనెక్ట్ చేశాడు మారుతి కానీ రొటీన్ కథ కావడంతో ఎంతవరకు పాస్ మార్కులు వేయించుకుంటుందనేది చూడాలిక.
నటీనటుల విషాయానికి వస్తే..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఎన్నారై మనవడిగా, తాతని ప్రేమించే కుర్రాడిగా ఆయన పాత్రలో ఒదిగిపోయి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఓ వైపు కామేడిని పండించడంతో పాటు మరోవైపు ఎమోషన్స్ ను కూడా క్యారీ చేశాడు. అప్పుడప్పుడూ వద్దన్నా మెగాస్టార్ ను తలపించాడు. రాశీఖన్నా టిక్ టాక్ సెలబ్రిటీగా అందంగా కనిపించింది. ఆమె పాత్ర చేసే సందడి కూడా ఆకట్టుకుంటుంది.
సాయిధరమ్ తేజ్ హీరో అయినా.. తాత పాత్రలో నటించిన సత్యరాజ్ చుట్టూనే కథ మొత్తం తిరగడంతో ఆయనే పాత్రే ఈ చిత్రంలో కీలకంగా మారింది. ఆ పాత్రకు తగ్గట్టుగా సత్యారాజ్ ప్రేక్షకులను మెప్పించాడు. ఎదిగిన మనవళ్లు వున్న తాత.. ఎలా వ్యవహరిస్తాడో అలానే పాత్రోచితాన్ని పండించాడు. ఇక రావు రమేష్ అయితే కడుపుబ్బా నవ్వించాడు. ప్రథమార్ధంలోనూ, ద్వితీయార్ధంలోనూ ఆయన పాత్రే హైలైట్. మరో విధంగా చెప్పాలంటే ఈయనే సినిమాకు ప్రధానబలం కూడా. మహేష్, ప్రవీణ్, సుహాస్, హరితేజ తదితరులు చేసే సందడి కూడా ఆకట్టుకుంటుంది.
టెక్నికల్ అంశాలకు వస్తే..
థమన్ మరోసారి మంచి సంగీతమే అందించాడు. ముఖ్యంగా తకిట తకిట పాట అయితే థియేటర్స్‌లో గోల చేయించింది. మరో రెండు పాటలు కూడా బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. కాకపోతే సెకండాఫ్ ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. అక్కడక్కడా బలవంతపు సన్నివేశాలు వచ్చినట్లు అనిపించాయి. జయకుమార్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాకు ప్రధాన బలం అదే. ఇక దర్శకుడు మారుతి మరోసారి రొటీన్ కథతోనే వచ్చాడు కానీ ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. తన మార్కుకు భిన్నంగా కుటుంబ కథతో వచ్చినా కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా గతంతో పోలిస్తే ఎమోషనల్ సీన్స్ బాగా వర్కవుట్ చేసాడు. అయితే సెకండాఫ్ ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే సినిమా రేంజ్ మారిపోయుండేది. ఓవరాల్‌గా యావరేజ్ ఫ్యామిలీ డ్రామా దగ్గరే ఆగిపోయాడు మారుతి.
తీర్పు..
ఫ్యామిలీ ఆడియన్స్ కు పండుగ వాతావరణాన్ని ముందే తీసుకొచ్చిన కుటంబకథా చిత్రం.. ‘ప్రతిరోజు పండగే’
చివరగా.. ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ప్రతిరోజు పండగే‘.!