మెగా కుటుంబం నుంచి మరో సినీవారసుడు వస్తున్నాడని.. ఆ చిత్రానికి చెందిన పాటలు కూడా సూపర్ హిట్ అయినా.. ఆయన రాకకు మాత్రం కరోనా మహమ్మారి అడ్డుతగిలింది. దీంతో ఇప్పుడిప్పుడే సినీమా ధీయేటర్లు తెరుచుకుంటున్న వేళ.. వేసవిలో రావాల్సిన.. మెగా సినీ వారసుడి చిత్రానికి ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ గా వెల్ కమ్ చెబుతున్నారు మెగా ఫాన్స్. మెగా సినీ కుటుంబలోని ఏ హీరో తొలి చిత్రానికి లేనంత క్యూరియాసిటీ ఈ హీరో పంజా వైష్ణవ్ తేజ్ చిత్రానికి దక్కింది. అటు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు కావడం.. ఇటు దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ ను జాలువారిన కథ కావడం సినిమాపై అంచనాలను బాగా పెంచింది.
కథ
కులం కట్టుబాట్లు, కులాభిమానంతో పాటు పేద, ధనిక మధ్య వత్యాసం ఎలాంటిదో మరోమారు ఈ చిత్రం ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చింది. తన కులమైన వాడు ఏలాంటి తప్పు చేసినా సహించే పెద్ద మనిషి శేషారాయణం (విజయ్ సేతుపతి).. తన కులానికి చెందిన మత్య్సకార కుటుంబాలకు చెందిన వ్యక్తులు అదే తప్పు చేస్తే వారి ప్రాణాలను కూడా తీసేందుకు వెనుకాడడు. అలాటి పెద్ద మనిషి శేషారాయణం కూతురు బేబమ్మ అలియాస్ సంగీత (కృతి శెట్టి) ఓ మత్య్సకార కుటుంబానికి చెందని ఓ పేద యువకుడు అశి (వైష్ణవ్ తేజ్) తో ప్రేమలో పడుతుంది.
పెద్దలకు తమ ప్రేమ తెలియడంతో తన తండ్రి ఎలా స్పందిస్తాడోనన్న భయంలో ఇద్దరు ఊరి నుంచి వెళ్లిపోతారు. ఈ విషయం ఊళ్లో తెలియకుండా తన కూతురు ఇంట్లోనే వుందని నమ్మించే ప్రయత్నం చేస్తాడు శేషారాయణం. ఆ తరువాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. వారి ప్రేమకు శేషారాయణం అంగీకరిస్తాడా.? బేబమ్మ ఇంటికి తిరిగివస్తుందా.? మత్స్యకార కుటుంబానికి చెందిన యువకుడితో తన కూతరు వివాహానికి శేషారాయణం అంగీకరిస్తాడా..? ఈ క్రమంలో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకున్నదే ఉప్పెన కథ.
విశ్లేషణ
పెద్దింటి అమ్మాయి... పేదింటి అబ్బాయి మధ్య ప్రేమ ఎప్పుడూ ఆసక్తికరమే. అలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేం కాదు. అంతస్తుల్లో గడిపే అమ్మాయి... పూరి గుడిసె నుంచి వచ్చిన అబ్బాయి మనసులు ఇచ్చి పుచ్చుకోవడం చూడటానికి ఎప్పుడూ ప్రత్యేకమే. ఆ జంట ప్రేమలో పడ్డాక డబ్బు, పలుకుబడి ప్రభావంతో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లేకొద్దీ కథ రక్తి కడుతుంటుంది. ‘ఉప్పెన’ కూడా అలాంటి కథతోనే తెరకెక్కింది. ప్రథమార్ధంలో సింహభాగం సన్నివేశాలు ఆశి, సంగీత ప్రేమ ప్రయాణం నేపథ్యంలోనే సాగుతాయి. వాళ్లిద్దరూ ఒకనొకరు చూసుకోవడం, మనసులు ఇచ్చి పుచ్చుకోవడం, ఆ ప్రేమ గురించి ఇంట్లో తెలియడం వంటి సన్నివేశాలతో ప్రథమార్ధం సాగుతుంది.
ఈ ప్రేమకథ సముద్రం నేపథ్యంలో సాగడం మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రేమజంట పారిపోవడం, వాళ్ల కోసం శేషారాయనం మనుషులు వెదకడం కోసం బయల్దేరడంతో ద్వితీయార్ధం మొదలవుతుంది. మధ్యలో చెప్పేందుకు కథేమీ లేక... కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మళ్లీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. సంగీత ఇంటికి రావడం, తండ్రితో మాట్లాడే సన్నివేశాలు రక్తికట్టిస్తాయి. అయితే అప్పటివరకూ కర్కశంగా కనిపించిన రాయనం... చివరిలో కూతురు చెప్పే మాటల్ని వింటూ నిలబడటం చూస్తుంటే ఒక్కసారిగా ఆ పాత్ర తేలిపోయినట్టు అనిపిస్తుంది. దర్శకుడు తన ప్రత్యేకతని ప్రదర్శిస్తూ క్లైమాక్స్‌లో కథనాన్ని మలిచిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది. తెరపై సుఖాంతమయ్యే ప్రేమకథల్ని చూస్తుంటాం, విషాదాంతంగా మారే ప్రేమకథల్నీ చూస్తుంటాం. వాటికి భిన్నమైన ముగింపున్న చిత్రమిది.
నటీనటుల విషాయానికి వస్తే..
పంజా వైష్ణవ్ తేజ్ ఇలాంటి సినిమాను అరంగేట్రానికి ఎంచుకున్నందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో ఎవరూ ఇలాంటి పాత్ర చేయడానికి సాహసించరు. సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ కు గురవడానికి ఆస్కారమున్న పాత్ర చేయడానికి సిద్ధ పడటం గొప్ప విషయం. లుక్స్ పరంగా కూడా చాలా యావరేజ్ గా కనిపించే డీగ్లామర్ పాత్ర అతడిది. ఎక్కడా కూడా హీరోలా అనిపించకుండా ఒక ముఖ్య పాత్రధారిలాగే కనిపించాడతను. వైష్ణవ్ నటనలో పరిణతి కనిపిస్తుంది. కొత్త వాడైనా చాలా త్వరగా అతడి పాత్రకు అలవాటు పడిపోయేలా చేయగలిగాడు.
హీరోయిన్ కృతి శెట్టి తన అందంతో నటనతో కట్టి పడేసింది. కొన్ని సన్నివేశాల్లో లుక్స్ పరంగా తేడాగా అనిపించినా.. ఓవరాల్ గా మెప్పించింది. పతాక సన్నివేశంలో ఆమె నటనకు క్లాప్స్ పడతాయి. ఇక విజయ్ సేతుపతి గురించి చెప్పేదేముంది? సినిమాను తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లాడు. అతడి కోసమే ఈ సినిమా చూడొచ్చు అనిపించాడు. రాయణం పాత్రలోకి అతను పరకాయ ప్రవేశం చేసిన తీరు ఎలాంటిదో తెరమీదే చూసి తెలుసుకోవాలి. ఐతే సేతుపతి వాయిస్ అందరికీ బాగానే పరిచయం కాబట్టి అతడికి రవిశంకర్ వాయిస్ సూట్ కాలేదు. ఇదొక్కటే ఈ పాత్ర విషయంలో ఇబ్బంది పెట్టే విషయం. హీరో తండ్రిగా సాయిచంద్ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. సేతుపతి తండ్రిగా మహదేవన్ కూడా బాగా చేశాడు.