మన అఖండ భారతదేశంలో గర్వించదగ్గ నాయకులలో సరోజినీ నాయుడు ఒకరు. భారతదేశాన్ని బ్రిటీష్ వారు పరిపాలిస్తున్న కాలంలో వారికి వ్యతిరేకంగా తనదైన కృషిని అందించిన స్వాతంత్ర్య సమరయోధురాలు. ఆమె మొదటిసారిగా 1905లో గోల్డెన్ త్రెషోల్డ్ అనే కవిత్వాన్ని రచించారు. తద్వారా ఆమెకు ‘‘భారత కోకిల’’ (నైటింగేల్ ఆఫ్ ఇండియా)గా ప్రపంచ ప్రఖ్యాతిని సొంతం చేసుకుంది. మగవారిలాగే మహిళలకు కూడా సమాజంలో సమాన హక్కులు కల్పించాలనే దృఢ సంకల్పంతో మహిళా సమావేశాలను ఏర్పాటు చేసి, వారిలో చైతన్యం తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. బ్రిటీషు వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి, అనేక సభలలో పాల్గొన, ప్రజలలో విప్లవాన్ని తెచ్చింది.
బాల్యం - విద్యాభ్యాసం :
క్రీ.శ.1879వ సంవత్సరంలో బ్రాహ్మణుడైన అఘోరనాథ్ చటోపాథ్యాయ, బెంగాలీ అయిన శ్రీమతి వరద సుందరి దంపతులకు పిబ్రవరి 13వ తేదీన సరోజినీ నాయుడు జన్మించారు. ఈమె తండ్రిగారయిన అఘోరనాథ్ గారు నేటి నిజాం కాలేజీలో మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అంతేకాదు.. సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, గ్రీకు, జర్మనీ, హిబ్రూ, ఫ్రెంచ్, ఆంగ్లం వంటి భాషలలో మహా పండితుడు కూడా. అలాగే తల్లి అయిన శ్రీమతి వరద సుందరిగారు ఒక మంచి రచయిత్రి. ఈమె తన చిన్నతనం నుంచే బెంగాలీ భాషలో కావ్యాలు, కథలు రాయడం మొదలుపెట్టారు.
తల్లిదండ్రులు విద్యను అభ్యసించిన సభ్యులు కావడం వల్ల సరోజినీ నాయుడుగారికి చిన్నతనం నుంచే పట్టుదల, శ్రమ, కార్యదీక్షా, విద్యపై ఆసక్తి వంటి అభిప్రాయాలు ఏర్పడటం జరిగాయి. చిన్నతనం నుంచే ఈమెకు ఇంగ్లీషు మాట్లాడాలని చాలా మక్కువ వుండేది ఆ పట్టుదలతోనే ఆమె పదకొండేళ్లకే ఎటువంటి తడబాటు లేకుండా ఇంగ్లీషు మాట్లాడటం నేర్చుకుని, అందరినీ ఆశ్చర్య చికితుల్ని చేసింది. అప్పటి నుంచి ఆమె ఇంగ్లీషులో రచనలు రాయడం ప్రారంభించింది.
అంతేకాకుండా ఈమె తన పన్నెండవ ఏట రాగానే మద్రాసు విశ్వవిద్యాలయంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేయగలిగారు. అంతటి తెలివితేటలు కలిగిన శ్రీమతి సరోజినీనాయుడుగారు ప్రతిఒక్కరికి ఒక ఆదర్శమూర్తిగా నిలబడింది.
సరోజినీనాయుడుగారు తన పదమూడవ ఏట రాగానే 1300 పంక్తులతో కూడిన ‘‘సరోవరరాణి’’ (Lady Of Lake) పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో ఆమె ఇతరుల హావాభావాలను, మనసుకు హత్తుకునేలా అనిపించే శైలిలో రచించడం వల్ల... ఈమె ప్రత్యేకతల్ని గ్రహించిన ఆనాటి నిజాంనవాబు, ఆమె పెద్ద చదువులకోసం విదేశాలకు పంపించి.. అక్కడే వివిధ శాస్త్రాలలో పరిశోధనలు చేసేందుకు ఆమెను ప్రోత్సాహిస్తూ... ప్రతి సంవత్సరం 4200 రూపాయల వరకు విద్యార్థి వేతనాన్ని ఇచ్చేవాడు. లండన్ లోని కింగ్స్ కాలేజీలోను, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో వున్న గిర్టన్ కాలేజీలో విద్యను అభ్యసించారు.
ఇంగ్లాండ్ లోని ఆంగ్లభాష విమర్శకులైన ‘‘ఆర్థర్ సైమన్స్’’, ‘‘ఎడ్వర్ గూస్’’లు.. సరోజినీ రచించిన కవిత్వాలను చదివి, ఆమెను ఎంతగానో అభినందించారు. అలాగే పాశ్చాత్య విధ్వాంసులతో స్నేహాలను పెంచుకుని, వారి పాండిత్య సలహాల ప్రకారం ఇంగ్లీషులో అనేక గ్రంధాలను రచించారు. ఆమె రచించిన కావ్యాలలో ‘‘కాలవిహంగం’’(Bird of time), ‘‘స్వర్గ ద్వారం’’ (the Golden Threshold) , ‘‘విరిగిన రెక్కలు’’ (the broken wings) అనేవి చాలా ప్రసిద్ధమైనవి.
వివాహం - బాధ్యతలు :
సరోజినీ నాయుడుగారు విదేశాలలో తమ విద్యాను పూర్తి చేసుకుని 1898 భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆమె దేశానికి రాగానే బలిజ వంశీయులు అయిన శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడుగారిని పెళ్లి చేసుకున్నారు. గోవిందరాజులుగారు అప్పట్లో హైదరాబాద్ ప్రధాన ఔషధ ఆరోగ్యాధికారిగా వుండేవారు. సరోజినీ నాయుడుగారికి కుల, మత, జాతి, నిరుపేదలు, ధనవంతులు వంటి వర్గభేదాలు తేడా లేకుండా ప్రముఖ సంఘ సంస్కర్త అయిన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారి ఆధ్వర్యంలో తన కులం కాకపోయినప్పటికీ గోవిందరాజులుగారిని వివాహం చేసుకున్నారు.
కులాంతర వివాహం చేసుకోవడం వల్ల సరోజినీ నాయుడుగారికి ఎన్నో విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. అయినా ఆమె వాటిని పట్టించుకోకుండా... ‘‘జీవిత మనుగడకు మనసు, మానవతా ముఖ్యం కాని... అర్థంలేని నమ్మకాలను ప్రోత్సహించి జాతిని పతనం చేసే కులం కాదు’’ అని నినాదాలు చేస్తూ... ఇతరులలో వున్న కుల, మత, జాతి, నిరుపేదలు, బలవంతులు వంటి వర్గవిభేదాలను తొలగించి, వారిలో చైతన్యాన్ని పెంపొందించారు.
సరోజినీ నాయుడు, గోవిందరాజులు నాయుడుగారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఇద్దరు కుమార్తెలలో ఒకరైన పద్మజాగారు బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. వివాహం అయిన తరువాత కూడా సరోజినీ నాయుడుగారు తన జీవితంలో సంతోషాలను వదిలిపెట్టి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా గళం ఎత్తారు. బ్రిటీష్ వారి పాలనలో భారతదేశంలో శాంతి, స్వాతంత్ర్యం లేకపోవడానికి సహించలేకపోయిన సరోజినీనాయుడుగారు ప్రజల్లో విప్లవ భావాలను రేకెత్తించడానికి అనేక ఉద్యమాలను, సమావేశాలను సాగించారు. ఆనాడు జాతీయ కాంగ్రెస్ సంస్థలో గోపాల కృష్ణ గోఖలే నాయకత్వంలో సరోజినీ నాయుడుగారు ఉద్యమాలను నిర్వహించారు.
రాజకీయ రంగప్రవేశం :
ఆనాడు మహిళల మీద జరుగుతున్న అన్యాయాలను, ఆగడాలను చూసి సహించలేకపోయిన సరోజినీ నాయుడుగారు... వారికి కూడా సమాజంలో సమాన గౌరవం లభించాలనే దృఢ సంకల్పంతో అనేక సమావేశాలను నిర్వహించి, మహిళల్లో చైతన్యం పెంపొందించడానికి పాటుపడ్డారు. అలాగే బ్రిటీష్ వారి ఆగడాలను అణిచివేయాలనే కసితో జాతీయ కాంగ్రెస్ సంస్థలో చేరి, స్వాతంత్ర్య సాధనలో పాలుపంచుకున్నారు. అందులో ముఖ్యంగా 1915వ సంవత్సరంలో ముంబయిలో జరిగిన మహాసభలకు, 1916వ సంవత్సరంలో లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభలలో సరోజినీ నాయుడుగారు పాల్గొన్నారు. అలాగే అనేక ముఖ్యనగరాలకు, పట్టణాలకు పర్యటిస్తూ.. ప్రజలలో భాషా విప్లవాన్ని తెచ్చేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారు.
‘‘జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా వుండకు... నీకు అన్యాయం జరిగితే దేశానికి జరిగినట్టే.. దేశం అనుభవించే బానసత్వాన్ని నువ్వు అనుభవించాల్సిందే’’ అంటూ విప్లవాత్మకమైన నినాదాలతో దేశమంతా తిరిగి, తనలో వున్న దేశభక్తిని చాటుకున్నారు సరోజినీ నాయుడుగారు. అయితే ఆమె విశ్రాంతి లేకుండా ప్రయాణాలు, ఉపన్యాసాలు చేయడంతో అనారోగ్యానికి గురయ్యారు.
1919 సంవత్సరంలో పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ లో బ్రిటీష్ వారు హత్యాకాండను సృష్టించారు. అప్పటి పంజాబ్ గవర్నర్ అయిన డయ్యర్ లక్షలాదిమంది ప్రాణాలను దారుణంగా హింసించి, చంపించాడు. ఆ సమయంలో ఆమె లండన్ నగరంలో చికిత్స పొందుతోంది. అప్పటికే ఈ హత్యాకాండ వార్త ఆమెకు తెలియగానే... గుండె జబ్బుతో బాధపడుతున్నప్పటికీ తన ఆరోగ్యం గురించి లెక్క చేయకుండా పంజాబ్ గవర్నర్ అయిన డయ్యర్ మీద తిరుగుబాటు ఆందోళనను లేవదీసింది. వారిని ఎలాగైన భారతభూమి నుంచి తరిమికొట్టాలనే నెపంతో గాంధీజీకి ఆమె ఉత్తరం కూడా రాసింది.
యూపీ గవర్నర్ గా బాధ్యతలు :
సరోజినీ నాయుడుగారు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా చేసిన ప్రచారాలకు, ఉపన్యాసాలకు మెచ్చి, ఆమెకు దేశం మీద వున్న భక్తిని గ్రహించి కాంగ్రెస్ జాతీయ సంస్థ ఆమెను ఉత్తరప్రదేశ్ కు గవర్నర్ పదవిని ఇచ్చి, సత్కరించారు. ఇలా ఈమె మొట్టమొదటి మహిళా గవర్నర్ గా పేరుపొందింది.
సరోజినీ నాయుడుగారికి ఎదురైన కొన్ని సమస్యలు :
సరోజినీ నాయుడుగారు పుస్తకాలు స్వాతంత్ర్యోద్యంతో కూడినవి కాబట్టి బ్రిటీష్ ప్రభుత్వం ఆనాడు ఆ పుస్తకాలను అమ్మకూడదని ఆజ్ఞ వేసింది. దాంతో ఆ పుస్తకాలు మార్కెట్లో అమ్మడం మానేశారు. కానీ గాంధీజీ సలహాలమేరకు సరోజినీ నాయుడుగారు ఆ స్వాతంత్ర్యోద్యమ పుస్తకాలను ప్రతివీధులో అమ్మి... శాసన ధిక్కారం జరిపారు. ఆ సమయంలోనే ఆమె ఒక బహిరంగ సభలో ఉపన్యసిస్తూ... ‘‘బ్రిటీష్ పాలకులు భారతదేశాన్ని సొంతంగా భావించడం అపరాధం. భారతీయుల హక్కులను బానిసలుగా మార్చుకుని, వారి ప్రాణాలను తీసుకోవడం క్షమించరాని నేరం’’ అంటూ గర్జించింది.
ఆమె చేసిన ఉపన్యాసాలు, ప్రచారాలకు, తిరుగుబాటును చూసి లండన్ కామన్స్ సభలో భారతదేశ మంత్రి చలించిపోయాడు. ఇంకొకసారి ఇటువంటి ఉద్వేగభరితమైన ప్రచారాలు చేయకూడదని బ్రిటీష్ ప్రభుత్వం ఆమెపై తీవ్రమైన ఒత్తిడి చేసింది. కానీ అటువంటి బెదిరింపులను సరోజినీనాయుడు పట్టించుకోకుండా తన ప్రచారాన్ని కొనసాగించింది. ఊరూరా, ప్రతి వీధిలో తిరుగుతూ స్వాతంత్ర్య ప్రబోధం చేసింది. విరామ సమయంలో దేశ ప్రజల భవిష్యత్ గురించి, బ్రిటీష్ వారి ఘోర పరిపాలన గురించి రచనలు రచించారు.
స్వాతంత్ర్యం కోసం విదేశీ పయనం :
అప్పటిరోజుల్లో దక్షిణాఫ్రికాలో వున్న భారతీయులు కూడా అనుభవిస్తున్న దుర్భర పరిస్థితిని తెలుసుకున్న సరోజినీనాయుడుగారు... 1926వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడున్న భారతీయుల హక్కుల కోసం పోరాడి, ఎన్నో సేవలు అందించింది. స్వాతంత్ర్యానికి సంబంధించిన ఎన్నో ఉపన్యాసాలను బోధించి లక్షలాది ప్రజలను స్వాతంత్ర్య పిపాసులుగా మార్చేసింది సరోజినీ నాయుడు.
అలాగే 1928వ సంవత్సరంలో కెనడా, అమెరికా దేశాలకు వెళ్లి.. అక్కడ బానిసత్వాన్ని అనుభవిస్తున్న భారతీయులకు ఆసరాగా వుంటూ.. వారి ఆశయాల గురించి ప్రచారం చేసింది. 1929లో తూర్పు ఆఫ్రికాలో కూడా ప్రచారం చేయడానికి పర్యటించింది. గాంధీజీగారు అరెస్టయినప్పటినుంచి విశ్రాంతి లేకుండా దేశవిదేశాలకు తిరుగుతూ, భారత ప్రజలకు స్వాతంత్ర్యాన్ని కల్పించడం కోసం అనేక కష్టాలు అనుభవించారు సరోజినీ నాయుడుగారు.
ఒక భారతీయ మహిళ స్వాతంత్ర్యం కోసం ఈ విధంగా ఉద్యమాలను నిర్వహించడం చూసి బ్రిటీషు ప్రభుత్వం ఒక్కసారిగా బెంబెలెత్తపోయింది. ఆమెకు భయపడి 1930వ సంవత్సరం మే 23వ తేదీన బ్రిటీషువారు సరోజినీ నాయుడుగారిని అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గాంధీజీ ఎంతో బాధపడ్డాడు.
తరువాత 1931వ సంవత్సరంలో భారతీయ ప్రతినిధిగా లండన్ రౌండ్ టేబుల్ కు వెళ్లారు సరోజినీనాయుడుగారు. 1942 వ సంత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటీష్ ప్రభుత్వాన్నే ఎదురించి, ఎన్నోరకాలుగా పోరాటాలు జరిపారు. దాంతో ఆమెను 1945సంవత్సరం వరకు దుర్బర కారాగార శిక్షను విధించారు బ్రిటీష్ ప్రభుత్వంవారు. అయితే కొన్నాళ్లకే అనారోగ్య కారణాలవల్ల ఆమెను విడుదల చేశారు.
చివరగా...
దేశం మీదున్న భక్తితో ఎటువంటి బేధభావాలు లేకుండా రాజకీయ, సాంఘిక, సాహిత్య రంగాలలో రకరకాలుగా సేవలందించి, అందరికీ మార్గదర్శకురాలుగా నిలిచిపోయింది శ్రీమతి సరోజినీ నాయుడు. తన జీవితమంతా దేశసేవకే అంకితం చేసేసి.. ఆమె తన 70వ ఏట 1949 మార్చి 2వ తేదీన లక్నోలో కన్నుమూశారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more