భాగ్యనగరానికి తలమానికంగా... నిజాం రాజుల రాజసానికి చిహ్నంగా... నాలుగు శతాబ్దాల వైభవాన్ని తనలో పదిలపరుచుకొని తిరుగులేని చారిత్రక కట్టడంగా వెలుగొందుతోన్న రాజసౌధం చౌమహల్లా ప్యాలెస్. అంతర్జాతీయ ఖ్యాతినార్జించి 2010 లో ప్రఖ్యాత ‘యునెస్కో ఏషియా పసిఫిక్ హెరిటేజ్’ అవార్డును సొంతం చేసుకున్న ఈ అద్భుత కట్టడం విశేషాలు.నాలుగు వందల ఏళ్లకు పైగా ఘనమైన చరిత్ర భాగ్యనగరం సొంతం. నవాబుల కాలంలో నిర్మించిన అపురూప కట్టడాలు... అద్భుత శిల్ప నైపుణ్యంతో పర్యాటకులను ఆకట్టుకునే నిజాం కళాసౌధాలెన్నో ఇక్కడ గత చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వందల ఏళ్ల చరిత్రకు నిలువుటద్దంగా నిలుస్తూ... పర్యాటకులను ఆకర్షిస్తున్న టూరిజం స్పాట్‌లకు ఇక్కడ కొదువే లేదు. అలాంటి వాటిలో... హైదరాబాద్ కీర్తికిరీటంలో ఓ కలకితురాయిగా వెలుగొందుతున్న అద్భుత సౌధం చౌమహల్లా ప్యాలెస్.
నిజాం పాలనకు కేంద్ర బిందువు... నిజాం నవాబుల అధికారిక నివాసంగా చౌమహల్లా ప్యాలెస్ నుండే ఆసఫ్‌జాహి వంశస్తుల పాలన కొనసాగేది. నగరానికి వచ్చే దేశవిదేశీ ప్రముఖులు తప్పకుండా ప్యాలెస్‌ను సందర్శించేవారు. అరేబియన్ నైట్స్ కథల్లో వర్ణించినట్లుండే ప్యాలెస్ ఆవరణ ఎంతో ప్రసిద్ధి చెందిన హైదరాబాదీ సంస్కృతిని చాటేందుకు దోహదపడేది. నిజాంల హయాం ఎంతో ఖరీదైన సమయంగా ఉండేది. 270 సంవత్సరాల క్రితం నిర్మించిన చౌమహల్లా ప్యాలెస్ 1948 నుంచి దాదాపు 45 సంవత్సరాల పాటు పాడుపడి ఉంది. తరువాత ఈ అద్భుత కట్టడం పూర్వవైభవాన్ని సంతరించుకుంది.చార్మినార్ సమీపంలోని లాడ్‌బజార్‌కు సమీపంలో, మక్కా మసీదు నుంచి ఖాజీపురా వరకు సుమారు 2,90,000 గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో చౌమహల్లా ప్యాలెస్‌ను నిర్మించారు. నాలుగు ఉన్నతమైన, అందమైన భవన సముదాయాల ప్రాంగణంగా, నిజాం ప్రభువుల నివాస గృహంగా చౌమహల్లా భాగ్యనగర చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకుంది. రెండవ అసఫ్‌జాహీ కాలంలో ఖిల్వత్ ప్యాలెస్‌ను నిర్మించారు. ‘ఖిల్వత్’ అంటే ఏకాంత ప్రదేశం అని అర్థం. అసఫ్‌జాహీలు నిర్మించిన అనేక కట్టడాలలో చౌమహల్లా మొట్టమొదటిది.
మొగల్ శైలికి ప్రతిరూపం... ఇక్కడ నాలుగు ప్యాలెస్‌ల నిర్మాణం ఐదవ నిజాం ప్రభువు అఫ్జల్-ఉద్-దౌలా బహదూర్ పాలనాకాలంలో (1857-69) జరిగిందని చరిత్రకారుల చెబుతున్నారు. అసఫ్‌జాహి నవాబుల రాజసానికి, గాంభీర్యానికి, సౌందర్యానికి ప్రతీకలు ఈ భవనాలు. దేశవిదేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించేందు కోసం నిర్మించిన ఈ భవనాలు మొగల్ శైలి ప్రతిబింబించేలా, ఎంతో అద్భుతంగా, గొప్ప రాజఠీవితో ఆకర్షణీయంగా ఉంటాయి. ఎందరో పర్యాటకులను, చరిత్రకారులను ఆకర్షించేలా ఉన్న ఈ భవన సముదాయాలు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి.నాలుగు భవనాలు -
నాలుగు ప్రత్యేకతలు... చౌమహల్లా అంటే నాలుగు భవనాలు అని అర్ధం. 1857-1869 మధ్యకాలంలో ఐదో నిజాం నవాబ్ అఫ్జలుద్దౌలా బహద్దూర్ కాలంలో ఆఫ్తబ్ మహల్, మహలత్ మహల్, తహనియత్ మహల్, అఫ్జల్ మహల్ నిర్మాణం జరిగింది. మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఈ భవనాలలో ఉండేవారు. ఉద్యానవనానికి నాలుగు వైపులా ఉన్న ఈ సుందర భవనాలను వేరు వేరు రాచకార్యాలకు కేటాయించేవారు. ఈ నాలుగు భవనాలు నాలుగు వర్ణాలలో ఒకటి కెంపు-పసుపు రంగులో, మరొకటి నీలం-పసుపు రంగులో, ఇంకొకటి గులాబి-పసుపు రంగులో, వేరొకటి ఆకుపచ్చ-పసుపు రంగులో ఉన్నాయి. భవనాల రంగులలో కలిసిపోయే వర్ణాలలో షాండ్లియర్లు, అదే రంగులో ఇతర విద్యుద్దీపాలు అందంగా ఏర్పాటుచేశారు. గోడల రంగుకు సరిపోలిన విలువైన కర్టెన్లు, ఫ్రెంచి ఫర్నీచర్‌తో ఈ భవనాల అలంకరణ ఎంతో ఆకట్టుకుంటుంది. భవనాల పైకపపై లతలు రంగురంగుల పుష్పాకౄఎతులు నాటి రాజుల కళాదృష్టికి ప్రతీకలుగా చెక్కబడ్డాయి. ఈ నాలుగు భవనాల వాకిళ్ళు నలుమూలలా ఉద్యానవనంలో కలిసి ఉంటాయి. ఎంతో సుందరంగా ఉండే ఈ తోటను ‘అరేబియన్ నైట్స్’లో పేర్కొనే ఉద్యానవనంతో పోలుస్తుంటారు. ఇందులో ఫౌంటెన్‌లు, ఎత్తయిన పాలరాతి కుండీలు, వాటిపై ఆకర్షణీయమైన అలంకరణ మంత్రముగ్ధులను చేస్తాయి. ఉద్యానవనంలో రంగురంగుల పూలచెట్లు సువాసనలను వెదజల్లుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆవిష్కరిస్తాయి.
షాహిరాయల్ ఖిల్వత్... ఈ భవనాల సముదాయంలో షాహిరాయల్ ఖిల్వత్ ప్రముఖమైనది. ఈ రాజభవనాన్ని రెండో నిజాం అలీఖాన్ కాలంలో నిర్మించారు. ఆ తరువాత దీన్ని తిరిగి 1911లో ఆప్పటి ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ హయాంలో పునర్నిర్మించారు. దక్షిణ దిక్కున గల భవనంలో ఉన్నతాధికారులు, రాయబారులు, ఇతర పెద్దలకు విందు ఇచ్చేవారు. పడమట గల భవనాన్ని నిజాం ప్రైవేట్ నివాసంగా ఉపయోగించేవారు. కేవలం మొగల్ పనితనమే కాకుండా ఎన్నో వాస్తురీతులకు ఈ భవన సముదాయం ప్రతీక. ఇక్కడి ఖిల్వత్‌లోనే రాజదర్బారులు జరిగేవి. మొగల్ పద్ధతిలో చలువరాయి సింహాసనంపై కూర్చుని నిజాం కోర్టు నిర్వహించేవాడు. రాత్రిపూట మాత్రమే ఈ దర్బారు జరిగేది. ఇందులో టర్కీ, వెన్నీస్ నుంచి దిగుమతి చేసుకున్న విలువైన, విశేషమైన షాండ్లియర్స్ ఉన్నాయి. ఈ భవనంలో రాజుకే కాకుండా దర్బారుకు హజరయ్యేవారి కోసం ప్రత్యేకం ఏర్పాట్లు ఉండేవి. ప్రేక్షకులకు విడిగా గ్యాలరీ, అందులో రేలింగ్స్ వీటి వెనకాల ఒక పలచని తెరను ఏర్పాటుచేసేవారు. ఆ తెర వెనక స్ర్తీలు కూర్చుని దర్బారు జరిగే తీరును చూసేలా ఏర్పాటు చేశారు. ఈ భవన సముదాయంలో మొదటి అసఫ్‌జాహీ కాలంలో 1724-1748లో జిలూఖానా, దౌలత్ ఖాన్-ఇ-ఆలీని నిర్మించారు. దివాన్-ఇ-ఆమ్, ఖ్వాలిగానఖర్ ఖానా, రోషన్ బంగ్లా, రోషన్‌మహల్, గుల్షన్ మహల్, షాదీఖానా రెండో ఆసఫ్‌జా నవాబ్ మీర్ నిజాం అలీఖాన్ కాలంలో 1763-1803 మధ్య నిర్మించారు.
మరమ్మత్తులు... 1912లో చౌమహల్లా భవనాలకు మరమ్మతులు చేపట్టారు. 1926లో కొత్త నిర్మాణాలను ఏడో నిజాం ప్రారంభించారు. 1915లో ఖిల్వత్‌పై గడియారం పెట్టారు. వీటికి దక్షిణంలో నిర్మించిన ఐదు అపార్ట్‌మెంట్‌ల భవనం పంచమహల్. ప్రస్తుతం ఇది కూడా చౌమహల్లా భవనాల సముదాయంలో వుంది. ఈ ప్రాంతాన్ని ఖిల్వత్ అనే వ్యవహరిస్తున్నారు. ఈ భవన సముదాయాల్లో ఇంకా చాందినీ బేగంకీ హవేలీ, భక్షీబేగంకి హవేలీ, మంజిలీ బేగంకీ హవేలీ, మోతీబంగ్లా, తోషాఖానా-మహల్ కుల్-ఇ-పిరాన్, రసగ్ మహల్ లాంటి మరికొన్ని భవనాలు వున్నాయి. ఐదవ నిజాం నవాబ్ అఫ్జల్-ఉద్-దౌలా బహదూర్ పాలనా కాలంలో ఖిల్వత్ ప్యాలెస్ ప్రాంగణంలో అనేక అపురూప కట్టడాల నిర్మాణం చేపట్టారు. టెహ్రాన్‌లోని షా ప్యాలెస్‌ను పోలిన ఆర్కిటెక్చర్‌తో చౌమహల్లాలో ఐదవ నిజాం ఆఫ్తాబ్ మహల్, మహ్తాబ్ మహల్, తనియత్ మహల్, అఫ్జల్ మహల్‌ల నిర్మాణం చేపట్టారు. టెహ్రాన్‌లోని షా ప్యాలెస్ కంటే ఎన్నోరెట్లు మిన్నగా నిజాం ప్రభువు ఈ ప్యాలెస్‌లను నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు.
విదేశీ సొబగులు... ఈ షాండ్లియర్‌లు చాలా మటుకు నిజాంకు బహుమతిగా లభించాయని, మరికొన్ని టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పుసుల్తాన్-1799 ప్రాంతంలో జరిగిన యుద్ధంలో నిజాంకు బహూకరించాడు. కరెంటు లేని ఆ రోజుల్లో షాండ్లియర్‌లలో వెలుగు కోసం మైనపు వత్తులు, పొగరాని క్రొవ్వొత్తులను లండన్ నుంచి దిగుమతి చేసుకుని ఉపయోగించేవారు. దర్బార్ హాల్ (తహనియత్ మహల్) తెల్లని పాలరాతితో మొగల్ శైలిలో నిర్మించిన ఈ భవనంలో ఐదవ, ఆరవ, ఏడవ, ఎనిమిదవ నిజాంలు సందర్శకుల దగ్గర్నుంచి ఫిర్యాదులు, అర్జీలు అందుకుని వారి సమస్యలను పరిష్కరించేవారు. తమ ఆస్థానానికి వచ్చే విదేశీ ప్రముఖులకు స్టేట్ రిసెప్షన్ ఇక్కడే ఇచ్చేవారు. 1905లో కింగ్ జార్జ్-వి, క్వీన్ మేరీలు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నిజాం వారికి చౌమహల్లాలోనే స్వాగతం పలికారు.
రాచరిక గురుతులు... సుమారు రెండువందల సంవత్సరాలు పైబడిన చరిత్ర గల ఈ ప్యాలెస్ నేడు నిజాం ట్రస్టు నిర్వహణలో ఉంది. ఇప్పుడు మహలత్ దర్బార్‌లో ఆనాటి వైభవాన్ని చాటే ఫోటోప్రదర్శన సందర్శకులను ఆకర్షిస్తోంది. వారి అలంకరణ, రాజసం ఫోటోల రూపంలో చూడవచ్చు. నిజాం కాలంలో వాడిన అరుదైన వసువులు, కళానైపుణ్యాన్ని చాటే పరికరాలు, ఆయుధాలు, గుర్రపు బగ్గీలు ప్రదర్శనలో ఉన్నాయి. 1906లో నవాబు కొనుగోలు చేసిన వాహనాలు, నిజాం ఆరవ నవాబు ఉపయోగించిన వింటేజ్ కార్లు ఇక్కడ భద్రపరిచారు.
|