హనీమూన్... జీవితాంతం గుర్తుండిపోయే తీపి అనుభవాల సుమహారం. ఇలాంటి సుమాల మాల మరొక్కటి ఉంటే... ప్రతి ఒక్కరినీ ఈ కల ఏదో ఒక మూల మదిని తొలుస్తూనే ఉంటుంది. మరి రెండవ హనీమూన్ ఎలా ఉండాలి? మొదటి హనీమూన్‌ను తలపించేదిగా ఉండకూడదు... మరిపించేదిగా ఉండాలి. ఈ ప్రదేశాన్నే ఫ్యాషన్‌కు మరోపేరు అంటాం. సిటీ ఆఫ్ లైట్స్ అని గొప్పగా... సిటీ ఆఫ్ రొమాన్స్ అని గోముగా పిలుస్తాం. మోనాలిసాను మ్యూజియంలో భద్రపరిచిన నగరం... హిట్లర్‌కు అసంతృప్తిని మిగిల్చిన నగరం ఇదే... పారిస్ నగరం. దాని యొక్క విశేషాలు తెలుసుకుందాం.
పారిస్ నగరంలో ప్రతిదీ ఒక అద్భుతమే. ఆర్కిటెక్చర్‌ను స్టడీ చేయడానికి వెళ్లే వాళ్లూ ఉంటారు. నగరాన్ని ఆనుకుని ఉన్న సీనె నదిలో క్రూయిజ్ విహారం, చిరు అలలపై తేలుతూ పారిస్ నగర సౌందర్యాన్ని వీక్షించడం మరిచిపోలేని అనుభూతి. ప్రపంచ వారసత్వ సంపదగా పారిస్ పురాతన ప్రాశస్త్యాన్ని చాటుతున్న సీనె నది మీద భూమి- ఆకాశాల మధ్య సాగే ప్రయాణం... ఏడడుగుల బంధంతో సాగే నూరేళ్ల ప్రయాణంలో తీపి గుర్తు. అలాంటిదే మరొక తీపి గుర్తు ఈఫిల్ టవర్‌ను అధిరోహించడం. ఈ టవర్ ఫ్రాన్స్ దేశాన్ని ప్రపంచపటంలో గర్వంగా నిలబెడుతోంది. దీనికీ వరంగల్ జిల్లా రామప్పదేవాలయానికి ఒక సారూప్యం ఉంది. ఆర్కిటెక్ట్ పేరు మీద ప్రచారంలోకి వచ్చిన కట్టడాలు ఈ రెండూ. దీని నిర్మాణం కోసం వచ్చిన 700 డిజైన్లలో అలెగ్జాండర్ గుస్తేవ్ ఇఫిల్ వేసిన డిజైన్ ఎన్నికైంది.
మూడు వందల మంది రెండేళ్లపాటు శ్రమిస్తే రూపం వచ్చింది. 320 మీటర్ల ఎత్తు, ఏడువేల టన్నుల బరువున్న ఈ టవర్‌ను కట్టినప్పుడు ప్రపంచంలోకి ఎత్తై నిర్మాణం ఇది. ఇది మూడంచెలుగా ఉంటుంది. మొదటి రెండు లెవెల్స్‌కు లిఫ్ట్ లో కానీ, మెట్లెక్కి కానీ చేరవచ్చు. మూడవ అంతస్తుకి లిఫ్టులో మాత్రమే వెళ్లాలి, మెట్లు ఉన్నప్పటికీ అందరినీ అనుమతించరు. రెండు లెవెల్స్ వరకు రెస్టారెంట్లు ఉంటాయి. ఈ టవర్ పై భాగం అబ్జర్వేటరీ డెక్. నాలుగువేల చదరపుటడుగుల విస్తీర్ణం ఉంటుంది. ఒకేసారి ఎనిమిది వందల మంది నగరాన్ని వీక్షించవచ్చు. గంటసేపు వీక్షించే అవకాశం ఇస్తారు.
హిట్లర్‌కి ఇదో చేదు జ్ఞాపకం!
రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ దేశం జర్మనీ స్వాధీనం అయింది. హిట్లర్ ఫ్రాన్స్ లో పర్యటిస్తూ పారిస్ వచ్చాడు. ఫ్రాన్స్ ను స్వాధీనం చేసుకున్న గుర్తుగా ఈఫిల్ టవర్‌ను అధిరోహించాలన్నది హిట్లర్ కోరిక. ఇది నచ్చని ఫ్రెంచ్‌వాళ్లు లిఫ్ట్ వైర్లను కత్తిరించి హిట్లర్‌ను టవర్ పైకి వెళ్లనివ్వకుండా నిరోధించారు. దాంతో నాజీల చిహ్నమైన స్వస్తిక్ పతాకాన్ని టవర్ మీద ఎగురవేయాలన్న జర్మన్ సైనికుల ప్రయత్నం ఫలించలేదు. ఈ సంఘటనకు ‘హిట్లర్ ఫ్రాన్స్‌ను స్వాధీనం చేసుకున్నాడు కానీ ఈఫిల్ టవర్‌ను కాదు’ అని చెప్తారు పారిస్ వాసులు. టవర్‌ను కూల్చేయవలసిందిగా 1944లో హిట్లర్ ఇచ్చిన ఆదేశాన్ని పారిస్ మిలటరీ గవర్నర్ జనరల్ డైట్రిచ్ వోన్ చోల్టిట్జ్ బేఖాతరు చేశాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది.
జీవనశైలి!
ఇక్కడ అందరూ ఏదో ఒక పనిలోనే ఉంటారు. ఉద్యోగం, సాయంత్రానికి రెస్టారెంట్‌లో భోజనం చేసి ఇంటికి వెళ్లడం దినచర్య. చిన్న- పెద్ద, ముసలి- ముతక అందరూ స్ట్రీట్‌ఫుడ్‌తోపాటు రెస్టారెంట్, బేకరీల్లో తెచ్చుకుని ఫుట్‌పాత్‌ల మీద కూర్చుని తింటుంటారు. ఆఫీసులు, దుకాణాలు ఐదున్నరకే మూసివేస్తారు. ఇక్కడ రాత్రి ఎనిమిది దాటినా వెలుతురు ఉంటుంది. కానీ ఆరు తర్వాత పని చేయరు. డ్రైవర్లు కూడా ఎనిమిది గంటల డ్యూటీ అవర్స్ పాటించాలి. కార్లకు, ట్యాక్సీలకు స్పీడోమీటర్‌లాంటి పరికరం ఉంటుంది. అందులో డ్రైవర్ ఎన్ని గంటలకు డ్యూటీ ఎక్కాడు, విరామాన్ని తీసివేయగా మొత్తం ఎన్ని గంటలసేపు వాహనాన్ని నడిపాడు అనే సమాచారం రికార్డు అవుతుంది. చెక్‌పోస్టుల దగ్గర పోలీసులు డ్రైవర్ పని గంటలను కూడా గమనిస్తుంటారు. ఎనిమిది గంటలకంటే ఎక్కువ టైమ్ నడిపితే ఫైన్ వేస్తారు. ఇక్కడ ఎక్కువ మంది సైకిళ్లు వాడతారు. కార్ల వాడకమూ ఎక్కువే, దాదాపుగా న్యూక్లియర్ కుటుంబాలే కావడంతో అన్నీ చిన్నకార్లే. ఇక్కడ టూ వీలర్‌లకు పోలీస్ బైకుల్లాగ ముందు ఫైబర్ షీట్ ఉంటుంది. మనదగ్గర కూడా ఈ విధానం వస్తే యాక్సిడెంట్ల నుంచి రక్షణ కలుగుతుందనిపిస్తుంది. ఇక్కడ మందుల దుకాణాలు కూడా చట్టాన్ని కచ్చితంగా పాటిస్తాయి. పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలకు సిరంజ్, చాలా రకాల మందులను అమ్మరు. ఇక్కడ హోటళ్లలో భోజనంతో మంచినీరు ఇవ్వరు, విడిగా కొనుక్కోవాలి. ఇక్కడి వాళ్లు భోజనం చేస్తూ రెడ్‌వైన్ తాగుతారు. చాలా మామూలుగా తింటూ తాగుతారు కానీ తాగి మిస్ బిహేవ్ చేయడం ఉండదు. హుందాగా వ్యవహరిస్తారు.
నది తీరాన నగరం!
పారిస్‌లో సియెన్ నదిలో క్రూయిజ్ ప్రయాణం చాలా బాగుంటుంది. ఒడ్డున ఉన్న వాళ్లు క్రూయిజ్‌లో ఎక్కే వాళ్లకు టాటా చెప్తూంటారు. తెడ్డు వేసుకుంటూ వెళ్లే సంప్రదాయ పడవలు కూడా ఉన్నాయి. పారిస్ పూర్తిగా నదీ తీరాన విస్తరించిన నగరం కావడంతో ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు చేరడానికి మొత్తం 37 బ్రిడ్జిలు ఉన్నాయి. వీటిలో అలెగ్జాండర్ బ్రిడ్జి అందమైన బ్రిడ్జి. నగరంలోని ప్రముఖ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా నది తీరానే ఉన్నాయి. భారతీయ సంస్కృతి సింధు లోయలో విలసిల్లినట్లు పారిస్ నాగరికత, చరిత్ర ఈ నదితీరాన అభివృద్ధి చెందింది.పారిస్ అభివృద్ధి చెందిన చారిత్రక నగరం కావడంతో ఆధునిక నిర్మాణాలు, సంప్రదాయ నిర్మాణాలు కూడా ఉంటాయి. ఇక్కడికి భవనాల నిర్మాణశైలిని అధ్యయనం చేయడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువే. పారిస్ గొప్పతనానికి నిదర్శనంగా అద్భుతమై పురాతన కళాఖండాలతో మ్యూజియాలు, చారిత్రక కట్టడాలన్నీ 70 వరకు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ దుస్తుల తయారీ కంపెనీలు ఉన్నాయి. పారిస్ అంటే ఫ్యాషన్, అక్కడి వాళ్లకు ఫ్యాషన్ అంటే పాషన్. అక్కడ పర్యటించడం పర్యాటకులకు మధురానుభవం.
కళాకారుల నగరం!
నగరంలో కళాకారులు, కళాప్రియులు కూడా ఎక్కువే. రోడ్ల పక్కన, పర్యాటక ప్రదేశాల్లో మన కళ్ల ముందే చకచకా బొమ్మలు వేసి అమ్మేస్తుంటారు. ఈఫిల్ టవర్ దగ్గర మన పేరుని బొమ్మలతో రాస్తారు చాలా చిత్రంగా ఉంటుంది. పేరులో ఇంగ్లిష్ అక్షరం ‘ఎ’ కి ఈఫిల్ టవర్ బొమ్మ వేస్తారు. పేరుకు ఐదు యూరోలు. బేరమాడితే తగ్గిస్తారు కానీ ఇండియన్స్ బార్గెయిన్ చేస్తారనే అభిప్రాయం ఉంది. పారిస్‌లో ఇంగ్లిష్ వచ్చిన వాళ్లు తక్కువ. వీళ్ల మాతృభాష ఫ్రెంచ్. పర్యాటకులకు ఏదైనా అవసరం ఏర్పడి స్థానికులను అడిగితే వాళ్లు తమలోనే ఇంగ్లిష్ వచ్చిన వారితో కలుపుతారు.
మోనాలిసాకు వేదిక ఈ రాజభవనం!
పారిస్‌లో లోరె మ్యూజియం ఫ్రాన్స్ రాజకుటుంబాన్ని, రాజకుటుంబ జీవనశైలిని కళ్ల ముందు నిలిపే వేదిక. ఇది ఒకప్పటి ఫ్రాన్స్ రాజప్రాసాదం. ప్రస్తుతం ఫ్రాన్స్ నగరానికి ల్యాండ్‌మార్కు. రక్షణ నిలయంగా మొదలై రాజనివాసంగా ప్రసిద్ధికెక్కి మ్యూజియంగా స్థిరపడిన కట్టడం. ప్రపంచప్రసిద్ధి చెందిన మోనాలిసా చిత్రం ఇక్కడే ఉంది. లియోనార్డో డావిన్సీ వేసిన ఈ పెయింటింగ్ బుల్లెట్‌ప్రూఫ్ అద్దాల రక్షణలో ఉంది.వీటినీ చూడాలి... ట్రింఫస్ ఆర్చ్... ఇదిఫ్రెంచ్ విప్లవం, మొదటి ప్రపంచ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు వదిలిన వారి స్మారక ప్రదేశం. చాంప్స్ ఎలిసీస్ అందమైన అవెన్యూ. సినిమా థియేటర్లు, కేఫ్‌లు, దుకాణాలు, ఫ్రెంచ్ మాన్యుమెంట్స్, ట్రింఫస్ ఆర్చ్, కాంకర్డ్ స్క్వేర్ ఈ వీధిలోనే. 21 ఎకరాల కాంకర్డ్ స్క్వేర్ ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ప్రాధాన్యం సంతరించుకున్న ప్రదేశం. పారిస్‌లో అందమైన ప్రదేశం కూడ.
యూరప్‌లో తొలి డిస్నీల్యాండ్!
పిల్లలతో పారిస్‌కు వచ్చిన వాళ్లు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం డిస్నీల్యాండ్. అమెరికా, టోక్యో తర్వాత నిర్మించిన డిస్నీల్యాండ్ ఇదే. యూరప్‌లో మొదటి డిస్నీల్యాండ్ కావడంతో యూరో డిస్నీల్యాండ్ అనేవారు, ఇప్పుడు డిస్నీల్యాండ్ పారిస్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ యూరప్‌లోకి అతి పెద్ద థీమ్‌పార్క్ ఇదే.నగరంలో...
లా డిఫెన్స్ వ్యాపార లావాదేవీల కేంద్రం, యూరప్‌లోకి పెద్ద బిజినెస్ డిస్ట్రిక్ట్. స్టేడ్ ద ఫ్రాన్స్... ఎనభై వేల మంది వీక్షించగలిగే స్టేడియం. అమెరికాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ లిబర్జీ నమూనా ఫ్లేమ్ ఆఫ్ లిబర్జీ పారిస్‌లో ఉంది.ఫ్రాన్స్ కరెన్సీ యూరో. ఒక యూరో 70.44 రూపాయలకు సమానం.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more