ఈ నగరం బెల్జియం రాజధాని... మధ్యయుగపు రాజరిక వైభవానికి చిహ్నం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ రాజకీయ వేదిక యూరోపియన్ యూనియన్ కేంద్రం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కేంద్ర కార్యాలయానికి నెలవు. ఇక్కడ పర్యటిస్తే యూరప్‌లో సుడిగాలి పర్యటన చేసినట్లే...లండన్‌లోని ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్, బిగ్‌బెన్ గడియారం... పారిస్‌లోని ఈఫిల్ టవర్...ఇటలీలోని పిసా టవర్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూరప్ మాన్యుమెంట్‌ల నమూనాలకు వేదిక ఈ నగరం... క్రీ.శ పదవ శతాబ్దం వరకు ఆనవాలుకు నోచుకోని ఈ ప్రదేశం ఇప్పుడు అభివృద్ధి చెందిన నగరం బ్రసెల్స్ గురించి ఈ వారం మనం తెలుసుకుందాం.
బ్రసెల్స్ లో ప్రతి ఇల్లు అందంగా అల్లుకున్న పొదరింటిని తలపిస్తుంది. పూలమొక్కలను అమర్చిన విధానంలో చక్కటి కళాభిరుచి వ్యక్తం అవుతుంది. ఇక్కడ మనకు గొప్పగా అనిపించేది ఏమిటంటే... నగరం పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి పథంలో ఉన్నప్పటికీ సంప్రదాయ రీతులను వదులుకోవడం లేదు. ప్రార్థన మందిరాలు, రాజభవనాలు, మ్యూజియం వంటివన్నీ గోథిక్ స్టైల్ నిర్మాణాలు. భవనం పై శిఖరం చెక్కిన పెన్సిల్‌లాగ ఉంటుంది. పాత కట్టడాలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ చక్కగా మెయింటెయిన్ చేస్తారు. అవసరమైన మార్పులు చేసుకున్నప్పటికీ స్థూలంగా భవనం ఆర్కిటెక్చర్ స్వరూపాన్ని పోనివ్వరు.
నగరంలో పర్యటిస్తుంటే మధ్యయుగం రోజులు గుర్తొస్తాయి. మనుషుల జీవనశైలి క్రమబద్ధంగా ఉన్నట్లనిపిస్తుంది. ఇక్కడ దాదాపుగా అందరూ ఉద్యోగం చేస్తారు కానీ ఉద్యోగమే జీవితం అన్నట్లు అంకితమై పని చేయరని చెబుతారు. ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తుంది. ఉద్యోగం ఉన్నా లేకపోయినా జీవనస్థాయిలో పెద్ద మార్పు ఉండదన్నట్లు ఉంటుంది వీళ్ల ధోరణి. నగరంలో కళాకారులు, కళ మీద ఆధారపడి జీవించేవాళ్లు చెప్పుకోదగినంత మంది ఉంటారు. వాళ్లు ఇతరుల నుంచి డబ్బు ఆశిస్తారు కానీ వీళ్లను బెగ్గర్స్ అనరాదు, వాయిద్యాలతో తమ కళను ప్రదర్శించి ఊరుకుంటారు. జనం తమకు తోచింది ఇస్తారు.
ఇక్కడ మనుషుల్లో పరిశుభ్రత ఎక్కువ. రోడ్లు కూడా సర్ఫ్‌తో కడిగినంత శుభ్రంగా ఉంటాయి. రోడ్ల గురించి చెప్పుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే... స్ట్రీట్‌లైట్లు మనకు ఉన్నట్లు తెల్లగా కాంతులు విరజిమ్మవు, ఆరెంజ్ కలర్‌లో డిమ్‌గా వెలుగుతుంటాయి. ఇక్కడి వాళ్లు రోడ్డు రూల్స్ ను క్రమశిక్షణతో పాటిస్తారు. ఎంత రద్దీ ఉన్నా వాహనానికీ - వాహనానికీ మధ్య 15 - 20 అడుగుల దూరాన్ని మెయింటెయిన్ చేస్తారు. ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించరు. నగరంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకి ట్రామ్‌లు ఎక్కువగా ఉన్నాయి. సిటీబస్సులు తక్కువ. ఎక్కువమంది సొంతవాహనాలనే వాడుతుంటారు. సైకిళ్లు, కార్లు ఎక్కువ, టూ వీలర్‌లు చాలా తక్కువ. రోడ్డు మీద సైక్లిస్ట్ లేన్‌లు ఉంటాయి.
బ్రసెల్స్ లో భారతీయ ఆహారంలో అన్ని రకాలూ దొరుకుతాయి. రాజస్థాన్, పంజాబ్ వాళ్లు నిర్వహించే హోటల్స్ ఉన్నాయి. స్థానికుల ఆహారం పూర్తిగా బ్రెడ్ ఆధారితమే. వీరి ఆహారంలో చాక్లెట్లు, బీర్‌లది ప్రథమస్థానం. మనం తిన్నట్లు ఎప్పుడో ఒకటి రెండు చాక్లెట్లు కాదు ఇది కంపల్సరీ మీల్ అన్నట్లు రోజూ తింటారు, చాక్లెట్ డ్రింకులు తాగుతారు. పాలు, పాల ఉత్పత్తుల వాడకమూ ఎక్కువగానే ఉంటుంది. మనం కాఫీ, టీలు తాగినంత మామూలుగా బీర్ తాగుతుంటారు, రోడ్డు పక్కన చిన్న రెస్టారెంట్‌లలో కూడా బీర్ సప్లయ్ చేస్తారు. పబ్ కల్చర్ కూడా ఎక్కువే. ఇక్కడి వాళ్లు ఫ్రెండ్లీ పీపుల్. సంతోషంగా జీవిస్తారు కానీ తాము ఆనందించే క్రమంలో ఇతరులకు ఇబ్బంది కలిగించరు, మిస్ బిహేవ్ చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్ నుంచి దైనందిన జీవితంలో పాటించాల్సిన నియమాల వరకు చట్టబద్ధంగా నడుచుకోవడానికే ఇష్టపడతారు. తమ పని తాము చేసుకుంటూ గడిపేస్తారు. మరొకరిని పట్టించుకోవడం కానీ, ఎదుటి వాళ్లు తమను పట్టించుకోవాలన్న భావన కానీ కనిపించదు. బ్రసెల్స్ లో డచ్, ఫ్రెంచ్ మాట్లాడతారు. ఇంగ్లిష్ పెద్దగా వినిపించదు. టూరిస్ట్ గైడ్‌లు చక్కటి ఇంగ్లిష్ మాట్లాడతారు, చిన్న దుకాణదారులు, ఉద్యోగులు స్థానిక భాషలనే మాట్లాడుతుంటారు.
నగరం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది. నగర శివారుల్లో పరిశ్రమలు ఎక్కువ, ఆడి కార్ల ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది. ఇక్కడ వ్యవసాయంలో యాంత్రికీకరణ ఎక్కువగా కనిపిస్తుంది. విండ్‌మిల్స్ (పవన విద్యుత్తు తయారీ పరికరం) ఎక్కువ. వ్యవసాయం కార్పొరేట్ స్థాయిలో జరుగుతుంది. ఎటు చూసినా విశాలమైన పంట భూములు ఉంటాయి. పంట కోసిన తర్వాత మనం కుప్పలు వేస్తాం కదా! ఇక్కడ కోసిన పంటను మిల్లులకు తరలించడానికి సిద్ధంగా పాలిథిన్ వంటి తెల్లటి షీట్‌తో ప్యాక్ చేస్తారు. వ్యవసాయరంగం పూర్తిగా అధునాతన పద్ధతుల్లో ఉన్నట్లనిపిస్తుంది. ఇక్కడ జనావాసాలు నదీ తీరాన విస్తరించాయి. మన దగ్గర కూడా అంతే కానీ, మనం నదులను ఫ్యాక్టరీల వ్యర్థాలు, నగరంలోని మురుగునీటిని వదిలి నదిని నిరుపయోగంగా మార్చేశాం. ఇక్కడ సిన్నె నది కూడా పూర్తిగా కలుషితమైంది కానీ త్వరగా శుభ్రపరిచి దాని స్వచ్ఛతను పరిరక్షించుకుంటున్నారు. స్వచ్ఛమైన నీటి వనరులతోనే అభివృద్ధి చెందుతున్నారు. మనం ఒకసారి పరిశీలిస్తే... నాగరకతకు, సంస్కృతికి చిహ్నమైన ప్రాచీన నిర్మాణాలు నది ఒడ్డునే ఉంటాయి.
దేశానికి చిహ్నం!
నగరంలో ఉన్న అటోమియమ్ దేశానికి చిహ్నం. అల్యూమినియం, ఉక్కు మిశ్రమాల సమ్మేళనంతో రూపొందించిన నిర్మాణాన్ని 1958లో వరల్డ్ ఫెయిర్ సందర్భంగా నిర్మించారు. అణునిర్మాణాన్ని సూచించే ఈ నిర్మాణం బెల్జియం లోహ అభివృద్ధికి ప్రతీక. ఇలాంటిదే మరొకటి మన్నెకెన్ పైస్. ఇది నాలుగైదేళ్ల పిల్లాడు వాటర్‌పాండ్‌లోకి మూత్రవిసర్జన చేస్తున్న శిల్పం. పారిస్‌కి ఈఫిల్ టవర్, న్యూయార్క్‌కు స్టాట్యూ ఆఫ్ లిబర్టీలాగ బ్రసెల్స్ చిహ్నం ఇది. ఈ శిల్పానికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఒక వర్తకుడు కుటుంబంతో నగర పర్యటనకు వచ్చినప్పుడు అతడి నాలుగేళ్ల కొడుకు తప్పిపోయాడు. వెతగ్గా వెతగ్గా కొన్ని రోజులకు ఆ పిల్లవాడు ఒక పార్కులో మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. కొడుకు దొరికిన ఆనందంతో వర్తకుడు ఈ ప్రతిమను బహూకరించాడట.
బ్రసెల్స్‌లో 13వ శతాబ్దం నాటి వర్తక కేంద్రం గ్రాండ్‌ప్లేస్. ఇప్పుడు ఇది నగర ప్రధానకేంద్రం, ఏడాది పొడవునా ఇక్కడ ఏదో ఒక వేడుక జరుగుతూనే ఉంటుంది. డిసెంబర్‌లో క్రిస్టమస్ చెట్లు, శాంటా ఇల్లు, లైట్ అండ్ సౌండ్ షోలు ఏర్పాటు చేస్తారు.సంప్రదాయ చెక్కబండ్లు, పూల మార్కెట్, యూరప్ హస్తకళల దుకాణాలు వెలుస్తాయి. అన్నింటిలోకి ఫ్లవర్ కార్పెట్ అందంగా ఉంటుంది. ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పూలను రకరకాల డిజైన్లలో అమరుస్తారు. యునెస్కో గ్రాండ్‌ప్లేస్‌ను వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చింది. గ్రాండ్ ప్లేస్‌లో తొలి భవనం టౌన్‌హాల్. మరో ప్రధాన ఆకర్షణ రాయల్ ప్యాలెస్. ఏ దేశంలోనైనా రాజభవనం ప్రత్యేకమైనదే అయి ఉంటుంది. రాజభవనాన్ని చూడాలన్న సామాన్యుల ఆసక్తి దృష్ట్యా ఇక్కడ కూడా వేసవిలో అనుమతిస్తారు. కౌడెన్ బర్గ్‌లో ఐదవ చార్లెస్ ప్యాలెస్ ఉంది. గ్యాలరీ స్ట్రీట్ అద్దాల పై కప్పు నిర్మాణం. దీనిని రాయల్ గ్యాలరీ అని కూడా అంటారు. ఇందులో విలాసవంతమైన అలంకరణ వస్తువుల దుకాణాలు ఉంటాయి. నగరంలో అనేక సంప్రదాయ నిర్మాణాలు, ఒపేరా హౌస్ ఉన్నాయి. మినీ యూరప్ పెద్ద పార్కు. ఇది యూరప్‌దేశాల్లోని ప్రముఖ నిర్మాణాల నమూనాల వేదిక. యూరప్ మొత్తం చూడలేని వారికి ఇదొక వెసులుబాటు.బెల్జియం కరెన్సీ యూరో... దాదాపుగా 69 రూపాయలకు సమానం.
రాయల్ మ్యూజియం!
బ్రసెల్స్ డౌన్‌టౌన్ ఏరియాలో రాయల్ మ్యూజియం ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్ ఉంది. మ్యూజియం ఆఫ్ ఏన్షియెంట్ ఆర్ట్, మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్ విభాగాలు ప్రధానభవనంలో ఉన్నాయి. కాన్‌స్టాటిన్ మ్యూనియర్ మ్యూజియం, ఆంటోయినె విర్ట్జ్ మ్యూజియం కొంచెం దూరంగా వేరే భవనాల్లో ఉన్నాయి. ఇవి బెల్జియం కళాకృతులు, సూక్ష్మ కళాఖండాలకు వేదికలు. ఈ మ్యూజియాల్లో 15 నుంచి 18వ శతాబ్దానికి చెందిన కళాఖండాలు ఉన్నాయి. నగరంలో మ్యూజియం ఆఫ్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, మ్యూజియం ఆఫ్ హోర్టా, రాయల్ బెల్జియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ సెన్సైస్, సెంటర్ ఫర్ కామిక్ స్ట్రిప్ ఆర్ట్ కూడా ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more