జర్మనీ అంటే బెర్లిన్ గుర్తొస్తుంది... మ్యూనిక్ గుర్తొస్తుంది... ఫ్రాంక్‌ఫర్ట్ గుర్తొస్తుంది...
కానీ... కలోన్ పేరు తక్కువగా వినిపిస్తుంది. అయితే కలోన్ నగరానికి రెండువేల ఏళ్ల చరిత్ర ఉంది... వందల ఏళ్ల కెథడ్రాల్... రాయల్ గేట్... చారిత్రక వంతెనలు...యూరప్‌కు తలమానికంగా విశ్వవిద్యాలయం... పరిశ్రమలు ఈ నగరానికి కీర్తికిరీటాలు.
కలోన్... అంటే మనకు గుర్తొచ్చేది పెర్‌ఫ్యూమ్... యు డి కలోన్... యు డి పెర్‌ఫ్యూమ్...
పరిమళానికి పర్యాయపదంగా మారిన పేరు ఇది. సౌరభాల కలోన్... యొక్క విశేషాలు తెలుసుకుందాం....
జర్మనీలో వాయువ్య దిక్కున ఉన్న నగరం కలోన్. దేశంలో పురాతన నగరం కూడ. రైన్‌నదికి ఇరువైపులా విస్తరించింది. రెండు వేల ఏళ్ల క్రితం రోమన్లు గుర్తించే వరకు ఇక్కడ పురాతనమైన జర్మన్ నివాస ప్రదేశం ఉందని ప్రపంచానికి తెలియదు. రోమన్లు నిర్మించిన ఈ నగరం మధ్యయుగంలో మత ప్రధాన ప్రదేశంగా విలసిల్లింది. కలోన్ నగరంలో రైన్ నదికి ఇరువైపులా తీరం వెంబడి పర్వత సానువులు, ఈ కొండల వాలులో ఇళ్లు ఉంటాయి. కొండవాలును అక్కడ అక్కడ చదును చేసి వ్యవసాయం కూడా చేస్తుంటారు. నదిలో క్రూయిజ్‌లో విహరిస్తూ ఉంటే రెండు వైపులా... భూమిని ఆకాశాన్ని కలుపుతూ పచ్చని గోడ కట్టినట్లు, ఆ పచ్చని గోడకు అలంకరణ కోసం బొమ్మ ఇంటిని తగిలించినట్లు ఉంటుంది. రాజమందిరం కూడా ఈ కొండవాలులో ఉంది. ఇక్కడ దాదాపుగా మధ్యయుగం నాటి నిర్మాణాలే.
చెట్లు... ఫుట్‌పాత్... రోడ్డు!
నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు ట్రామ్‌లు, లోకల్‌రైళ్లు ఎక్కువ, బస్సులు కూడా ఉంటాయి. సొంత కార్ల వాడకమూ ఎక్కువే. ఇక్కడ అన్నీ చిన్న కార్లే. ఇక్కడ రోడ్ల నిర్మాణం అంటే... రోడ్డు, వెడల్పాటి ఫుట్‌పాత్, దారి పొడవునా చెట్లు. ఒక్క రోడ్డు మార్జిన్ కూడా చెట్లు లేకుండా కనిపించదు. ఎంత చిన్న రోడ్డయినా సరే ఫుట్‌పాత్ ఉంటుంది. ప్రధాన రహదారికి ఎనిమిది అడుగుల ఫుట్‌పాత్ ఉంటుంది. పైగా ఫుట్‌పాత్‌ని పాదచారులు నడవడానికి మాత్రమే ఉపయోగించడం కూడా ఇక్కడి వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన మంచి లక్షణం. ఇళ్ల లేఅవుట్‌లు వాలు కప్పుతో ప్రణాళికబద్ధంగా ఉంటాయి.
కలోన్ భారతీయత!
వేసవి కాలంలో ఇక్కడ పర్యాటక ప్రదేశాల్లో భారతీయులు ఎక్కువగా కనిపిస్తారు. టూరిజం ఆధారంగా విస్తరించిన వ్యాపారాలు కూడా ఎక్కువే. కలోన్ మాత్రమే కాకుండా యూరప్ అంతా ఇండియన్ రెస్టారెంట్లు ఉంటాయి. అయితే ఇక్కడ కనిపించే ఇండియన్‌రెస్టారెంట్లలో పంజాబీ, కాశ్మీరీ వాళ్లవే ఎక్కువ. నార్త్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఈ రెస్టారెంట్ల నిర్వహకులు కూడా టూరిజం సీజన్‌కు ఇక్కడికి వచ్చి, సీజన్ అయిపోగానే ఇండియాకు వెళ్లిపోతారు. గైడ్‌లు కూడా అంతే. గోవా తదితర ప్రదేశాల నుంచి యూరప్ వచ్చి సీజన్ అయిపోయేటప్పటికి వెళ్లిపోతుంటారు. పర్యాటక ప్రదేశాల్లో కొందరు ఒంటికి సిల్వర్ కలర్ రాసుకుని బ్లాక్ సూట్‌లో, కౌబాయ్ హ్యాట్ పెట్టుకుని కదలకుండా విగ్రహాల్లా నిలబడి ఉంటారు. మనం ఒక యూరో ఇస్తే ఆశీర్వదించి వాళ్లతో ఫొటో తీసుకునే అవకాశం ఇస్తారు. డబ్బివ్వకపోతే మనల్ని పట్టించుకోరు. ఇదీ యాచకం అనే చెప్పాలి, అయితే బోనస్‌గా మనకు ఫొటో తీసుకునే అవకాశం ఇస్తారు.
నిబంధనలు కచ్చితం!
ఇక్కడ ఎనిమిది పని గంటల నిబంధన పాటించాలి. డ్రైవర్లు నాలుగు గంటల పాటు వాహనాన్ని నడిపితే నలభై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. అలా తీసుకోకపోతే నాలుగు వందల నుంచి నాలుగు వేల యూరోలు జరిమానాగా చెల్లించాలి. ప్రతి చెక్ పాయింట్ దగ్గర పోలీసులు వాహనం డాక్యుమెంట్లతోపాటు డ్రైవర్ బండి నడిపిన సమయాన్నీ పరిశీలిస్తారు. డ్రైవర్ డ్యూటీ ఎక్కినప్పుడు ఇన్‌సర్ట్ చేసే ఫ్లాపీ లాంటి పరికరం సమయాన్ని సూచిస్తుంది.
సిటీ ఆఫ్...
ఈ నగరాన్ని సిటీ ఆఫ్ చర్చెస్ ఆంటారు. మధ్యయుగం కాలంలో ఇక్కడ అతి పెద్ద రోమన్ కాథలిక్ చర్చ్‌లు 12 ఉండేవి. 40 మ్యూజియాలు, వందకు పైగా గ్యాలరీలు ఉన్నాయి. చాక్లెట్ మ్యూజియం జర్మనీ చాక్లెట్ తయారీ పరిశ్రమ గురించిన వస్తువుల ప్రదర్శనశాల. జర్మన్ స్పోర్ట్ అండ్ ఒలింపిక్ గేమ్స్ మ్యూజియం, ఆర్ట్ మ్యూజియం ప్రధానంగా చెప్పాల్సినవి. జర్మనీలో ఏటా జూలైలో నిర్వహించే ఫైర్‌వర్క్ డిస్‌ప్లే ‘కలోన్ లైట్స్’ సంగీతంతో మేళవించి అద్భుతంగా ఉంటుంది. దీనిని చూడడానికి లక్షలాది మంది వస్తారు. యూరప్ ఖండం ఖ్యాతికి చిహ్నంగా జరుపుకునే వేడుకలకు కలోన్ నగరం ఒక వేదిక. జూలై మొదటి వారాంతంలో నగరం సిటీ సెంటర్‌లో జరిగే పార్టీకి దాదాపుగా ఐదు లక్షల మంది హాజరవుతారు. ఇది వర్తమాన రాజకీయాంశాలను చర్చించే వేదిక. కార్యక్రమం ఆసాంతం ఒక వైపు వినోదంతో పెరేడ్ థీమ్‌తో సాగుతుంది. కలోన్‌లో ప్రత్యేకమైన బీర్ దొరుకుతుంది. దానిని స్థానిక భాషలో కోల్స్ఛ్ అంటారు. దీనిని సేవించడం న్యాయసమ్మతమే. ఇది జర్మనీలో దొరికే ఇతర బీర్‌ల కంటే తియ్యగా ఉంటుందని చెబుతారు బీర్ ప్రేమికులు.
కలోన్ పర్యాటకం!
కలోన్ కెథడ్రాల్.. వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ కెథడ్రాల్ కూడ. మధ్యయుగం నాటి ఈ ప్రార్థనమందిరం శక్తిమంతమైనదని విశ్వసిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబుదాడులకు నగరం ధ్వంసం అయింది. ఈ ప్రార్థనమందిరం కూడా డెబ్బై బాంబుదాడులను ఎదుర్కొంది. కానీ కూలిపోలేదు. ఈ అద్భుతమే దీని ప్రత్యేకత అంటారు. ఏటా వేలాదిమంది పర్యాటకులు ఈ ప్రార్థనమందిరంలో 509 మెట్లను ఎక్కి నగరాన్ని వీక్షించి సంతోషిస్తుంటారు. ఈ కేథడ్రల్‌ను ఏకంగా ఆరువందల ఏళ్ల పాటు నిర్మించారు. 1248లో మొదలైన నిర్మాణం 1880 నాటికి పూర్తయింది. అప్పుడు ప్రపంచంలో ఎత్తై నిర్మాణం ఇది. 1248 నుంచి మొదలైన నిర్మాణం వేగంగా జరుగుతూ 1322లో ఆగిపోయింది. తర్వాత నాలుగు వందల ఏళ్లకు 1842లో పనులు పునఃప్రారంభమై 1880లో పూర్తయ్యాయి. ఇంత కష్టం మీద నిర్మించిన ఈ భవనం రెండవ ప్రపంచ యుద్ధంలో దెబ్బతినడంతో మరమ్మతులు చేసి 1956 నాటికి ఇప్పుడు ఉన్న రూపానికి తీసుకువచ్చారు. నగరంలో 4711 హౌస్, రాథాస్, ఆల్టర్ మార్కెట్, హోహెన్‌జోల్లెర్నబ్రుక్, హాహ్‌నెన్‌టోర్బెర్గ్(రాయల్‌గేట్), సెయింట్ మార్టిన్, ఫ్లోరా అండ్ బొటానికల్‌గార్డెన్ ప్రధానమైనవి.
రాయల్ గేట్...
నగరం చుట్టూ 12వ శతాబ్దంలో 12 గేట్లతో గోడకట్టారు. వీటిలో రాయల్ గేట్ ప్రధానమైనది. ఇది మన కోట బురుజుల్లాగానే ఉంటుంది.రాథాస్... ఇది సిటీ హాల్. ఇది కూడా గోథిక్‌శైలి నిర్మాణమే. ఓల్డ్‌టౌన్ నడిబొడ్డున ఉంది. వందలాది శిల్పాల మయం ఈ భవనం. పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ భవనాన్ని నగరం విస్తరించే కొద్దీ విస్తరిస్తూ వచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ధ్వంసం అయిన తర్వాత పునర్నిర్మాణంలో కొంత భాగం మధ్యయుగం కట్టడాన్ని పోలినట్లు యథాతథంగానూ, కొంత భాగాన్ని మోడరన్ స్టయిల్‌లోనూ నిర్మించారు. 1407 లో దీనిని పూర్తి స్థాయిలో నిర్మించిన నాటికి నగరంలో ఎత్తై నిర్మాణం ఇది. గోడల మీద నగర చరిత్రను తెలిపే శిల్పాలను చెక్కారు. చక్రవర్తి అగస్టస్ శిల్పాన్ని చూడవచ్చు.
ఆల్టర్ మార్కెట్...
ఇది సిటీ హాల్‌కు దగ్గరలో ఉంది. చారిత్రక వాణిజ్య విపణి ఇది. ఇప్పుడు కూడా కేఫ్‌లు, వేడుకలు ఎక్కువగా జరుగుతాయి. రోమన్ పాలన కాలంలో ఇది రేవు. రైన్ నది ద్వారా రవాణా అయిన వస్తువులను విక్రయించే స్థలం. క్రమంగా పోర్టు కాలగర్భంలో కలిసిపోయినా ఈ ప్రదేశం వాణిజ్యకేంద్రంగా కొనసాగుతోంది.4711 హౌస్... పెర్‌ఫ్యూమ్ తయారీ యూనిట్ ఇది. దీని గురించి ఆసక్తకరమైన కథనం ఉంది. విల్‌హెల్మ్ అనే వ్యక్తికి అతడి వివాహ సందర్భంగా ఒక సాధువు పెర్‌ఫ్యూమ్ ఫార్ములాను బహుమతిగా ఇచ్చాడట. ఆ ఫార్ములా ఆధారంగా పెర్‌ఫ్యూమ్ తయారు చేశాడు విల్‌హెల్మ్. అతడి మనుమడు ఫెర్డినాండ్ ఆ పెర్‌ఫ్యూమ్‌కు ఫ్యాక్టరీ ఉన్న భవనం నంబరునే ఖాయం చేశాడు.
హోహెన్‌జోల్లెర్నబ్రుక్...
ఇది రైన్ నది మీద ఉన్న వంతెనల్లో పెద్దది. ఇందులో రోడ్డు మార్గంతోపాటు ఆరు రైల్వే లైన్లు ఉన్నాయి. రోజుకు 1200 రైళ్లు ప్రయాణిస్తాయి. పాదచారుల దారి కూడా ఉంది. కానీ దాదాపుగా కిలోమీటరు వెడల్పు ఉన్న ఈ నదిని నడిచి దాటేవాళ్లు తక్కువ. సెలవు రోజు నగర సౌందర్యాన్ని వీక్షించడానికి వచ్చే వాళ్లే ఎక్కువ. బ్రిడ్జి అంటే ఇక్కడొక విషయాన్ని చెప్పాలి! రోమ్ నియంత జూలియస్ సీజర్ క్రీ.పూ 50 ప్రాంతంలో ఇక్కడ రెండు వంతెనలు నిర్మించాడట. ఇవి కేవలం యుద్ధం కోసమే! జర్మన్ ట్రైబల్ జాతులతో యుద్ధం చేసి ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం రోమ్ సైన్యం రాకపోకల కోసమే నిర్మించినట్లు చెబుతారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more