ఒకరోజు ఒక వ్యక్తి తన భార్యతో కలిసి ఎగ్జిబిషన్ కు వెళతాడు. అక్కడ రకరకాల ఆటబొమ్మలు, గేమ్స్ అన్ని వున్నాయి. విమాన ప్రయాణం కూడా అక్కడ అందుబాటులో వుంది.
అప్పుడా వ్యక్తి తన మనసులో విమానంలో కొద్దిసేపు ప్రయాణిద్దాం అని అనుకుంటాడు. కానీ దాని టికెట్ ధర 200 రూపాయలు అని తెలిసి తన మొహాన్ని పెడమొహం చేసుకుంటాడు.
విమానాన్ని నడిపే వ్యక్తి ఇతడిని చూసి ఇలా అంటాడు... ‘‘మీరిద్దరు (వ్యక్తి అతని భార్య) ఈ విమానంలో అర్ధగంట సేపు ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో మీరు నోటినుంచి ఒక్కమాట తీయకుండా, అరవకుండా వుంటే.. నేను టికెట్ డబ్బులు తీసుకోను. ఒకవేళ అరిచినా, నోరు తెరిచినా టికెట్ డబ్బులు తీసుకుంటాను’’ అని అంటాడు.
ఆ వ్యక్తి ఈ మాట విన్న కొద్దిసేపు ఆలోచిస్తాడు. ఆ తరువాత సంతోషంగా సరే అని ఒప్పుకుని తన భార్యతో విమానంలో ఎక్కుతాడు.
వ్యక్తి తన భార్యతో విమానంలో ఎక్కిన తరువాత పైలట్ విమానాన్ని నడపటం ప్రారంభించాడు. ఎన్నో రకాల విన్యాసాలు చేస్తాడు. విమానాన్ని పైకి, కిందకు, కొద్దిసేపటి వరకు రివర్స్ లో తిప్పడం, అప్పుడు డైవ్ చేయడం వంటివి చేశాడు. కానీ ఎంతసేపటికి ఆ వ్యక్తి తన నోరుని కదపకుండా జాగ్రత్త పడతాడు.
ఇలా మొత్తం వ్యవహారం అర్దగంటసేపు వరకు జరుగుతుంది. చివరికి పైలట్ తన ఓటమిని ఒప్పుకుని విమానాన్ని కిందకు దింపుతాడు.
అప్పుడా పైలట్ ఆ వ్యక్తితో ఇలా అంటాడు... ‘‘నిన్ను ఒప్పుకోవచ్చయ్యా... నేను విమానంతో చేసిన విన్యాసాలను చూసి ప్రతిఒక్కరు భయపడిపోతారు. అరవకుండా అస్సలు వుండలేరు. కానీ నువ్వు మాత్రం నీ నోరు కూడా తెరవకుండా కూర్చున్నావు. నీకు హ్యాట్సాఫ్ బాస్’’
అప్పుడా వ్యక్తి పైలట్ తో ఇలా అంటాడు... ‘‘ఇప్పుడు నా ఆవేదనను మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చివరాఖరికి నా భార్య కూడా విమానంలో నుంచి కిందకు పడిపోయినా అరవలేదు.. లేకపోతే నా 200 రూపాయలు పోతాయి కదా’’