సింగపూర్... నీటి మీద తేలే పచ్చదనం...సగం ప్రపంచాన్ని ఇముడ్చుకున్న నగరం...భూగోళమే విహారానికి వచ్చిందా అన్నట్లు ఉండే ప్రదేశం.. ప్రపంచ లావాదేవీల వాణిజ్య తీరం...ఈ తూరుపును... ఆ పశ్చిమాన్ని కలగలిపిన జీవనశైలికి ప్రతిరూపం...ఒకప్పటి సింహాల దీవి... ఇప్పుడు కంప్లీట్ మోడరన్ సిటీ...
దాని విశేషాలు ఏంటే తెలుసుకుందాం...
సింగపూర్ నగరం ఆసియాలో భాగంగా అనిపించినప్పటికీ పాశ్చాత్య ప్రభావం ఎక్కువ. మన దేశంతో పోలిస్తే ఇక్కడ సగటు మానవునికి జీవన వ్యయం చాలా ఎక్కువ. ఇది ప్రపంచంలోని టాప్ టెన్ ఎక్స్ పెన్సివ్ సిటీస్‌లో ఒకటి. నగరం మీద యూరప్ ప్రభావం చాలా ఎక్కువ కావడంతో వస్త్రధారణ కూడా పూర్తిగా పాశ్చాత్యశైలిలోనే ఉంటుంది. దైనందిన జీవితంలో అందరూ ఇక్కడి వేడి వాతావరణానికి అనువుగా ఉండే ఫార్మల్ ప్యాంటు, షర్టులో కనిపిస్తారు. టూర్ ఆపరేటర్లు నైట్ సఫారీలలో భాగంగా స్థానిక సంప్రదాయ నృత్యాలను నిర్వహిస్తుంటారు. అప్పుడు మాత్రమే వారి సంప్రదాయ వస్త్రధారణ కనిపిస్తుంది. ఇక్కడ విదేశీ జనాభాలో చైనీయులదే అగ్రస్థానం. ఆహారపు అలవాట్లలో ఆ ప్రభావం కనిపిస్తుంటుంది. సింగపూర్‌లో నివసించే చైనా సంతతి వారి మాటలో మాండేరియన్(చైనాలో ఒక మాండలికం) యాస ఉంటుంది. వీళ్లు చైనా సంవత్సరాదిని జరుపుకుంటారు. ఇంట్లో చైనా భాష మాట్లాడతారు, కానీ అందరికీ ఇంగ్లిష్ వచ్చి ఉంటుంది. నగరంలో కామన్ లాంగ్వేజ్‌గా ఇంగ్లిష్ వాడుకలో ఉంది. ఇక్కడ స్థానిక భాష మలయ్‌కి లిపి లేదు. వాళ్ల పదాలను ఇంగ్లిష్ అక్షరాలతో రాస్తారు. సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయుల్లో తమిళులు ఎక్కువ.
వందల ఏళ్ల క్రితం తమిళులు ఈ ద్వీపాలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు. ఇప్పుడు ఉన్నంత రవాణ సౌకర్యాలు లేని రోజులవి. పడవ ప్రయాణం చేయాలంటే వాతావరణం అనుకూలించాలి. ఒకసారి సరుకుతో పడవ ఈ ద్వీపాలకు వెళ్లింది అంటే... అది తిరిగి రావడానికి నెలలు పట్టేది. అందుకోసం తాత్కాలికంగా ఈ దీవుల్లో నివాసం ఏర్పాటు చేసుకునేవారు. అలా కొన్ని తమిళ కుటుంబాలు సింగపూర్ చేరి క్రమంగా అక్కడే స్థిరపడిపోయాయి. ఆ కుటుంబాల వారు ఇప్పటికీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఇక్కడ శ్రీశ్రీనివాస పెరుమాళ్ ఆలయం, శ్రీదండాయుధపాణి ఆలయం ఉన్నాయి. పూజలు, అభిషేకాలు, భజనలు చేస్తుంటారు. నుదుటిన విభూది బొట్టుతో కనిపిస్తుంటారు. నగరంలోని భారతీయుల్లో నార్త్ ఇండియన్స్ తక్కువ. ఉన్న వాళ్లలో సిక్కులు ఎక్కువ. నగరంలో సిక్కు గురుద్వారాలు ఉంటాయి. లిటిల్ ఇండియాలో మనకు అవసరమైన దినుసులన్నీ దొరుకుతాయి. నార్త్, సౌత్ రుచులకు ప్రత్యేకంగా రెస్టారెంట్లు ఉంటాయి. ఇడ్లీ, వడ లాంటి మన బ్రేక్‌ఫాస్ట్ బాగా దొరుకుతుంది. జీవనశైలి ఇలా! నగరంలో ఎటు చూసినా ఆధునికత కనిపిస్తుంది. భవనాల దగ్గర నుంచి సౌకర్యాల వరకు ప్రతిదీ నిర్ణీతమైన క్రమపద్ధతిలో ఉంటాయి. ఎన్ని భవనాలు ఉన్నా ఎక్కడా ఇరుకుగా ఉన్నట్లు అనిపించదు. కొత్త భవనాలు ఆకాశహర్మ్యాల నిర్మాణం, పాత నిర్మాణాల ధ్వంసం జరుగుతూనే ఉంటుంది. లైఫ్ పీరియడ్ అయిపోయిన భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కూల్చేస్తుంది. దానంతట అది కూలేదాకావాడుకలో ఉంచడం అనేది జరగదు. దాంతో ప్రతి భవనం కొత్తదిగానే కనిపిస్తుంది. భవనాలు కూలి ప్రాణాలు కోల్పోవడం వంటి ప్రమాదాలకు అవకాశం ఉండదు. సిటీలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ చాలా సౌకర్యంగా ఉంటుంది. దాంతో ఎక్కువ మంది సొంత వాహనాలు ఉన్నా కూడా వాటిని వీకెండ్ టూర్‌కి తప్ప రోజువారీ కార్యకలాపాలకు వాడరు. రోడ్డు మీద బస్‌లు, అండర్ గ్రౌండ్‌లో ట్రైన్‌లు నడుస్తుంటాయి. పైవేట్ ట్యాక్సీలలో ప్రయాణం కూడా చాలా సురక్షితంగా ఉంటుంది. రోడ్డు మీద పోలీసులు కనిపించరు. కానీ వీడియో వాచ్ విధానం ఉండడంతో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, ట్యాక్సీల్లో ఎక్కిన వారిని మోసం చేయడం వంటివి ఉండవు. పోలీసుల ఆనవాళ్లే కనిపించక పోయినా నేరం లేదా ప్రమాదం జరిగితే వెంటనే స్పాట్‌లో ప్రత్యక్షమవుతారు. వీడియో వాచ్ ద్వారా మానిటర్ చేస్తూ ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడకు చేరతారు. షాపుల్లో కూడా కెమెరాలు ఉంటాయి. దాంతో చిల్లర దొంగతనాలకు పాల్పడే అవకాశాలు బాగా తక్కువ. చిన్న చిన్న నేరాలు, దొంగతనాలు లేకపోయినా సింగపూర్ నగరం స్మగ్లింగ్, మాఫియాలకు కేంద్రం అని చదువుతుంటాం. కానీ ఇక్కడ పత్రికల్లో ఆ వార్తలు కనిపించవు. ఒక వ్యక్తికి హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉంటే అది ఇక్కడ పత్రికల్లో బ్యానర్ ఐటమ్‌గా వస్తుంది. ‘ఇది అంతటి ప్రధానమైన వార్తనా’ అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడి వాళ్లు మాత్రం ఆరోగ్యానికి అంతటి ప్రాధాన్యం అని చెప్తారు. దాదాపుగా సింగిల్ పార్టీ హవా నడుస్తోంది కాబట్టి రాజకీయ వార్తలు తక్కువగా ప్రచురితమవుతుంటాయి. అసెంబ్లీ భవనం దగ్గర ప్రత్యేకమైన భద్రత ఉండదు. నగరంలో దాదాపుగా అందరూ విద్యావంతులని చెప్పవచ్చు. నీటిమధ్య ఉష్ణతాపం! ఇక్కడ వాతావరణాన్ని మనవాళ్లు భరించడం కష్టమే. కానీ దాదాపు రోజూ అంతో ఇంతో వర్షం కురుస్తుంది. ఇక్కడి వాళ్లు రోజూ గొడుగుతో బయటకు వెళ్తారు. ఎండకు, వానకు రెండింటికీ అవసరమే కాబట్టి. నగరవాసులు వాటర్ స్పోర్ట్స్, స్కై స్పోర్ట్స్ బాగా ఆడతారు. రిస్కుతో కూడిన ఆటలను ఇష్టపడతారు. పర్యాటక ప్రధానమైన నగరం కావడంతో అన్ని ప్రాంతాల వాళ్లనూ ఆకర్షించే ప్రయత్నాలు ఎక్కువ. ఎలక్ట్రానిక్ వస్తువులు చవక. చైనాలో దొరికే ధరకే లభిస్తాయి. బంగారు ఆభరణాల కొనుగోలు అమ్మకాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. చైనీయులు నివసించే ప్రదేశాన్ని చైనాటౌన్ అంటారు. ఇక్కడ బుద్ధుని ఆలయం చాలా బాగుంటుంది. నగరంలో బౌద్ధం మెండుగా కనిపిస్తుంది. ఇస్లాం, హిందూమతం, క్రైస్తవం, సిక్కు, తావో, కన్ఫ్యూజియస్ మతాలను అనుసరించే వారు కూడా ఉంటారు. పరిశుభ్రత ఎక్కువ! సింగపూర్‌లో పార్కులు చాలా బాగుంటాయి. ప్రతి పార్కులో కుక్కల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తారు. ఇక్కడి వాళ్లు కుక్కలను బాగా పెంచుతారు. పార్కుల్లో కుక్కలు మలవిసర్జన చేస్తే వాటి యజమానులే డస్ట్ బిన్‌లో వేయాలి. అంతగా పరిశుభ్రత పాటిస్తారు. ఇక్కడ లైఫ్‌స్టయిల్ కాస్ట్‌లీగానే ఉన్నప్పటికీ సంపన్నుల నుంచి సామాన్యుల వరకు ఉన్నంతలో హాయిగా జీవించడమూ సాధ్యమే. పేదరికం ఆనవాళ్లు పెద్దగా కనిపించవు. లైఫ్‌స్టయిల్‌లో ఆధునిక టెక్నాలజీ అడుగు అడుగునా కనిపిస్తుంది. ఎంత వర్షం కురిసినా రోడ్డు మీద నీటిచుక్క నిలవదు. రోడ్డు మెయింటెనెన్స్, డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటాయి. సూపర్ బజార్ వంటి చోట్లకు వెళ్లినప్పుడు కారు పార్కింగ్ చార్జ్ వసూలు చేయడానికి ఎవరూ ఉండరు. ముందుగానే డబ్బు చెల్లించి పార్కింగ్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కార్డ్ ను చూపిస్తే ఆ నంబరు, కారు నంబరు కెమెరాలో ఫీడ్ అయి పార్కింగ్‌లాట్‌లో రాడ్ ఓపెన్ అవుతుంది. శిక్షలు కఠినం... నగరం ఎటు చూసినా ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండదు. మత్తుమందుల వాడకం నిషిద్ధం. స్థానికులు, విదేశీయులు ఎవరైనా సరే పట్టుబడితే మరణ శిక్ష విధించేటంత పటిష్టంగా చట్టం అమలవుతోంది. బయట మత్తు మందు తీసుకుని తర్వాత దేశంలో అడుగుపెట్టినా కూడా ఎయిర్‌పోర్టులో మూత్రం నమూనా సేకరించి పరీక్ష చేస్తారు. అందులో మత్తు మందు తీసుకున్నట్లు బయటపడితే శిక్ష కఠినంగా ఉంటుంది. మన దగ్గర సాధారణమైన మందులు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉండి తీరాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి కనిపించదు. నగరంలో చాలా చవగ్గా భోజనం అయిందనిపించే పదార్థాల నుంచి ఖరీదైన ఆహారం వరకు అన్ని రకాలూ దొరుకుతాయి. 24 గంటల కాఫీ షాపులు ఉంటాయి. ఇక్కడ కరెన్సీ సింగపూర్ డాలర్. ఇది మన కరెన్సీలో 39.74 రూపాయలకు సమానం. నగరంలో అన్ని మతాలు, ప్రాంతాల వాళ్లు దైనందిన జీవితంలో కలసి మెలసి ఉంటూ ఎవరికి వాళ్ళు సంప్రదాయ వేడుకలను జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి సింగపూర్‌లో ఏ ప్రాంతం వారైనా చాలా సౌకర్యంగా జీవించవచ్చు. ఎక్కడికో పరాయి చోటకు వెళ్లినట్లు అనిపించదు. పర్యాటకం... శరీరం చేపను, తల సింహాన్ని పోలి ఉండే శిల్పం సింగపూర్ పర్యాటక చిహ్నం.
రెండు - మూడు శతాబ్దాలకు చెందిన గ్రీకు, చైనా రచనల్లో సింగపూర్ ప్రస్తావన కనిపిస్తుంది. క్రీ.శ 11వ శతాబ్దంలో శ్రీ విజయ సామ్రాజ్యం యువరాజు సంగ్ నీల ఉత్తమ ఈ దీవికి చేరాడు. సింహాలు సంచరిస్తున్న తీరును సింగపుర అని నామకరణం చేశాడు. సింగపూర్ ప్రధానంగా పర్యాటక ప్రాధాన్యం కలిగిన నగరం. ఇక్కడ విదేశీయులకు ప్రవేశం సులభం. 14 రోజుల వీసా, నెల రోజుల వీసాలను చాలా సులభంగా జారీ చేస్తారు. తాత్కాలిక వీసాలను ఎక్స్‌టెండ్ చేయించుకోవడం మాత్రం చాలా కష్టం. నిబంధనలు కష్టతరంగా ఉంటాయి. ఇక్కడ వీకెండ్ ఎంజాయ్‌మెంట్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ వేసుకుంటారు. బీచ్‌లకు వెళ్లి గుడారాలు వేసుకుంటారు. కూరగాయలు, మాంసం... ఇలా వంటకు అవసరమైనవన్నీ తీసుకెళ్లి అక్కడే వండుకుని తింటారు. జూలో నైట్‌సఫారీ చేయాలంటే ధర ఎక్కువే అయినా అది మంచి ఎక్స్‌పీరియెన్స్. రాత్రిపూట సంచరించే జంతువులను చూస్తూ జూ అంతా తిరగడాన్ని పిల్లల నుంచి పెద్దవాళ్లు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. బర్డ్స్ పార్కు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం. ఫిష్ అక్వేరియం మరొక ప్రధానమైన టూరిస్ట్ అట్రాక్షన్. నీటి లోపల ఫైబర్ (గాజు లాగ పారదర్శకంగా ఉంటుంది) సొరంగంలోపల నడుస్తూ ఉంటే సొరంగానికి చుట్టూ సముద్ర జీవులు సంచరిస్తుంటాయి. చూడడానికి మన పక్క నుంచి తల మీద నుంచి, పాదాల కింద నుంచి తుర్రుమని జారుకుంటున్నట్లు ఉంటాయి.
|